పేరునే కాదు.. జీవితాన్నే మార్చేసిన మొదటి సినిమా.. ఆ పాట రాయడానికే Sirivennela కు వారం పట్టింది..!

ABN , First Publish Date - 2021-11-30T22:45:24+05:30 IST

‘సిరివెన్నెల’ సీతారామ శాస్త్రి... ఈ పేరు మూడున్నర దశాబ్దాల పాటూ తెలుగు సినిమాను మెరిపించింది. నిండు పున్నమి నాటి గోదారిలా తెలుగు సాహితీ సెలయేటిని పరవళ్లు తొక్కించింది. అయితే, ‘సిరివెన్నెల’ అనగానే మన కళ్ల ముందు కదలాడే సీతారామశాస్త్రి అసలు ఇంటి పేరు ‘సిరివెన్నెల’ కాదు. ఆయన పుట్టుకతో ‘చేంబోలు’ సీతారామ శాస్త్రి...

పేరునే కాదు.. జీవితాన్నే మార్చేసిన మొదటి సినిమా.. ఆ పాట రాయడానికే  Sirivennela కు వారం పట్టింది..!

‘సిరివెన్నెల’ సీతారామ శాస్త్రి... ఈ పేరు మూడున్నర దశాబ్దాల పాటూ తెలుగు సినిమాను మెరిపించింది. నిండు పున్నమి నాటి గోదారిలా తెలుగు సాహితీ సెలయేటిని పరవళ్లు తొక్కించింది. అయితే, ‘సిరివెన్నెల’ అనగానే మన కళ్ల ముందు కదలాడే సీతారామశాస్త్రి అసలు ఇంటి పేరు ‘సిరివెన్నెల’ కాదు. ఆయన పుట్టుకతో ‘చేంబోలు’ సీతారామ శాస్త్రి...

సీతారామ శాస్త్రి గేయ రచయితగా తెలుగు సినీ రంగ ప్రవేశం చేసింది కళాతపస్వి కే. విశ్వనాథ్ వారి వల్లే అని మనందరికీ తెలుసు. అయితే, చాలా మంది ఆయన తొలి చిత్రం ‘సిరివెన్నెల’ అనుకుంటూ ఉంటారు. నిజానికి విశ్వనాథ్, సీతారామ శాస్త్రి కాంబినేషన్‌లో వచ్చిన ఫస్ట్ మూవీ ‘జననీ జన్మభూమి’. 1984లో విడుదలైన ఆ చిత్రంలో, సీతారామశాస్త్రి రాసిన ‘తడిసిన అందాలలో’ అనే గీతాన్ని కేవీ మహదేవన్ స్వరపరచగా మాధవపెద్ది రమేశ్, సుశీల గానం చేశారు. ఆ తరువాత రెండేళ్లకు, అంటే... 1986లో ‘సిరివెన్నెల’ జనం ముందుకొచ్చింది. 

‘సిరివెన్నెల’ సినిమా కోసం సీతారామ శాస్త్రి చేత పాటలన్నీ రాయించారు విశ్వనాథ్. అప్పట్లో అలా సింగిల్ కార్డ్‌తో ఓ కొత్త రచయిత ప్రేక్షకుల ముందుకు రావటం అత్యంత అరుదైన విషయం. కానీ, ‘సిరివెన్నెల’ పాటలతో తెలుగు వెండితెరపై నిండు వెన్నెల ఆరబోసేశారాయన. ఒక్క ‘విధాత తలపున...’ పాట రాసేందుకే వారం రోజులు పట్టిందట. ఆ సినిమాలోని ప్రతీ పాటా, ప్రతీ పాటలోని ప్రతొక్క మాటా ఓ తప్సస్సులా భావించి సృజించారు సీతారామ శాస్త్రి. అయితే, అందుకే అదే సినిమా పేరు ఆయన ఇంటి పేరు అయిందని చాలా మంది భావిస్తారు. కానీ, ఆశ్చర్యకర అద్భుతం ఏంటంటే... ‘సిరివెన్నెల’ సినిమా టైటిల్ కార్డ్స్‌లోనే సీతారామశాస్త్రి ఇంటి పేరుగా ‘సిరివెన్నెల’ అని ఉంటుంది! సినిమా విడుదలై పేరొచ్చాక దాన్ని ఇంటిపేరు చేసుకోలేదన్నమాట! విడుదలకి ముందే సీతారామశాస్త్రి ‘సిరివెన్నెల’ అయిపోయారు! ఎలా? కే. విశ్వనాథ్ ఆ నిర్ణయం తీసుకున్నారట! 

మొదట్లో ‘భరణి’ అనే కలం పేరుతో సాహిత్యం రాస్తోన్న సీతారామశాస్త్రికి... ‘‘తల్లిదండ్రులు పెట్టిన లక్షణమైన పేరునే ఉపయోగించ’’మని కే. విశ్వనాథే చెప్పారు. మళ్లీ అదే చేంబోలు సీతారామశాస్త్రిని ‘సిరివెన్నెల’గా తెలుగు సినీ చరిత్రలో శాశ్వత కీర్తిమంతుడ్ని చేసింది కూడా ఆయనే! శిష్యుడు సీతారాముని జీవితంపై గురువు విశ్వనాథుని ప్రభావం వెలకట్టలేనిది... 

Updated Date - 2021-11-30T22:45:24+05:30 IST