పాటలను రీమిక్స్ చేయడంపై లతా మంగేష్కర్ ఏమన్నారంటే..!

ABN , First Publish Date - 2022-02-06T22:42:03+05:30 IST

లతా మంగేష్కర్ గొంతెత్తి పాడితే సినీ ప్రియులు పులకరించిపోయారు.

పాటలను రీమిక్స్ చేయడంపై లతా మంగేష్కర్ ఏమన్నారంటే..!

లతా మంగేష్కర్ గొంతెత్తి పాడితే సినీ ప్రియులు పులకరించిపోయారు. గాన మాధుర్యానికి పరవశించారు. ఎందుకంటే ఆమె గొంతులో అమృతం​ ఉంది. ఆ గొంతుకు అన్ని రకాల భావాలను పండించగల సామర్థ్యం ఉంది. గాన కోకిల స్వరం నుంచి వేలల్లోనే పాటలు జాలువారాయి. తాజాగా ఆ స్వరం ఏ పాట పాడనంటూ శాశ్వతంగా మూగబోయింది. ఆదివారం ఉదయం లతా మంగేష్కర్‌ కన్నుమూశారు. అయితే, గతంలో లతాజీ పాడిన పాపులర్ పాటలను రీమిక్స్ చేసి అనంతర కాలంలో వచ్చిన సినిమాల్లో పలువురు దర్శక, నిర్మాతలు ఉపయోగించుకున్నారు. ఆ రీమిక్స్ పాటలను లతా మంగేష్కర్ తీవ్రంగా వ్యతిరేకించేవారు. పలు సందర్భాల్లో ఆందోళన కూడా వ్యక్తం చేశారు. అనంతరం ఆ పాటల రీమిక్స్‌పై తన అభిప్రాయాన్ని తెలుయజేస్తూ 2018లో ఓ ప్రకటనను కూడా విడుదల చేశారు. 



ప్రముఖ గేయ రచయిత జావేద్ అక్తర్‌తో జరిపిన సంభాషణ సమయంలో హిందీ రీమిక్స్ పాటల అంశం ప్రస్తావనకు వచ్చింది. ఈ సందర్భంగా ట్విట్టర్‌లో 2018లో తన అభిప్రాయాలను లతా మంగేష్కర్ వెల్లడించారు. గత కాలం నాటి మధుర గీతాలను రీమిక్స్ చేసే ముందు రికార్డింగ్ కంపెనీలు ఓసారి ఆలోచించుకోవాలన్నారు. ఒక పాట సాహిత్యం, సారాంశం సురక్షితంగా ఉన్నంత కాలం రీమిక్స్ చేయడంలో తప్పేమీ లేదని స్పష్టం చేశారు. పాటకు కచ్చితమైన రూపం లేకుండా ఆకృతిని మార్చడం తప్పు అని  ఆమె పేర్కొన్నారు. ట్యూన్‌ని మార్చడం, సాహిత్యాన్ని ఇష్టం వచ్చినట్టు మార్చి చౌకబారు ఆలోచనలు జోడించడం వంటివి తన దృష్టికి వచ్చిందని లతాజీ తెలిపారు. ఇటువంటి అసంబద్ధ ప్రవర్తన తనను ఎంతగానో బాధిస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.



Updated Date - 2022-02-06T22:42:03+05:30 IST