Asha Bhosle Birthday Special: లతా మంగేష్కర్ అనే మర్రిచెట్టు నీడ నుంచి బయటపడి.. మోస్ట్ వాంటెడ్‌గా..

ABN , First Publish Date - 2022-09-08T19:20:55+05:30 IST

మర్రిచెట్టు నీడలో ఏ మొక్క బతకాలేదనేది తెలిసిందే. బాలీవుడ్ సంగీత ప్రపంచంలో లతా మంగేష్కర్ అలాంటి మరిచెట్టులాంటి వారే...

Asha Bhosle Birthday Special: లతా మంగేష్కర్ అనే మర్రిచెట్టు నీడ నుంచి బయటపడి.. మోస్ట్ వాంటెడ్‌గా..

ఇన్‌ ఆంఖోకి మస్తీమే... 

మస్తాని హజారో హై.... 

(మత్తెక్కించే సోయగాల ఈ కళ్లకి వేనవేల మంది దాసులున్నారు... ) అనే ఉమ్రావ్ జాన్ (రేఖ) అభినయిస్తుంది. ఆ అభినయం వెనక గాత్రానికి కూడా అసంఖ్యాకమైన ఆరాధకులు ఉన్నారు. ఆ గాత్రం పేరు ఆశా భోస్లే. నిజంగానే.. మౌనమే విరుగుతూ బిడియమే ఒరుగుతూ.. మనసిలా మరుగుతూ అవధులే కరుగుతూ .. ఉంటాయి ఆమె స్వరంలోంచి మన తెలుగులో ‘నాలో ఊహలకు.. నాలో ఊసులకు అడుగులు నేర్పావు/ నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు..’ (చందమామ) అని వినిపిస్తుంటే. అప్పుడెప్పుడో 4 దశాబ్దాల క్రితమే మన తేనెలూరు తెలుగులో పాడారు ఆశా- ‘ఇది మౌనగీతం... ఒక మూగరాగం...’ అని (పాలు నీళ్లు -1981). ఆ మధురస్వరం నేడు (సెప్టెంబర్ 8) 90వ పడిలో అడుగుపెడుతున్న సందర్భంగా ప్రత్యేక కథనం.


మర్రిచెట్టు నీడలో ఏ మొక్క బతకాలేదనేది తెలిసిందే. బాలీవుడ్ సంగీత ప్రపంచంలో లతా మంగేష్కర్ అలాంటి మరిచెట్టులాంటి వారే. అయితే.. ఆ మర్రిచెట్టు నీడ నుంచి బయటపడి ఆ ఇంటి నుంచే మరో మహావృక్షం మొలిచింది. ఆ చెట్టు పేరే ఆశా భోస్లే. ఈ ప్రసిద్ధ గాయని లతా మంగేష్కర్‌కి సొంత చెల్లెలు. అక్క నీడలో చాలా సంవత్సరాల పాటు ఎటువంటి గుర్తింపు లేకుండా ఉండిపోయారు ఆశా. అయినప్పటికీ చాలా ఓపికగా, పట్టుదలగా ప్రయత్నించి సంగీత ప్రపంచంలో ఆమెకంటూ ఓ గుర్తింపును సాధించుకోగలిగారు.


ఆ పాట పుట్టిన తావు..

ఆశా భోస్లే మహారాష్ట్రకు చెందిన సాంగ్లి‌లోని గోర్ అనే చిన్న కుగ్రామంలో ఒక సంగీత కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి దీనానాథ్ మంగేష్కర్ నటుడు, గాయకుడు. 1933లో సెప్టెంబరు 8న జన్మించిన ఆమె పదేళ్ల వయస్సులోనే అంటే 1943లో గాయనిగా ప్రయాణం మొదలుపెట్టారు. ఇప్పటి వరకూ కెరీర్‌లో 1000కి పైగా బాలీవుడ్ సినిమాల్లో ఆమె పాటలు పాడారు. సినిమా పాటలు మాత్రమే కాకుండా.. పాప్ సంగీతం, గజల్స్, భజన పాటలతోపాటు భారత సాంప్రదాయ సంగీతం, జానపదాలు, ఖవ్వాలీ పాటలను పాడటంలో సిద్ధహస్తురాలిగా పేరు తెచ్చుకున్నారు.


అయితే.. కెరీర్ ప్రారంభంలో సరైన అవకాశాలు లేక ఇబ్బందిపడ్డారు. దానికి కారణం ఆమె సోదరి లతా మంగేష్కర్‌. ఆమె అప్పటికే పెద్ద గాయని. దాంతో చాలామంది సంగీత దర్శకులు లతానే సంప్రదించేవారు. అయితే.. పలు కారణాల వల్ల లతా కొన్ని పాటలను నిరాకరించడంతో.. ఆ అవకాశాలను అందిపుచ్చుకుని, గాయనిగా ఆమెకంటూ గుర్తింపు పొందారు. అలా పాపులారిటీ రావడంతో చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్‌ ఆశానే పాటల పాడమంటూ సంప్రదించేవారు. అలా వేల సంఖ్యలో పాటలు పాడారు. ఇక్కడ చాలా మంది సంగీత దర్శకులకి ఆశా మోస్ట్ వాంటెడ్ గాయనిగా అవ్వడానికి కారణం.. ఆమె గొంతులోని గాంభీర్యం. ఆ స్వరం కొన్ని పాటలకు నిజంగానే చాలా ప్లస్ అయ్యింది కూడా.


అయితే.. లతాకు ఆశాకు మధ్య మొదటి నుంచి అందరి అక్కాచెల్లెళ్లలాగే సహజమైన పోటీ ఉండేది. అయినప్పటికీ పబ్లిక్‌లో మాత్రం బయటపడలేదు.అయితే ఓ సందర్భంలో ఆశా మాట్లాడుతూ..‘లతా అక్క నా కెరీర్‌కి పెద్దగా సహాయ పడలేదు. అది మా సంగీతకారుల కుటుంబంలో మామూలే’ అంటూ చాలా క్యాజువల్‌గా చెప్పుకొచ్చారు.


శంషాద్ బేగం, గీతా దత్, లతా మంగేష్కర్ వంటి హేమాహేమీలు సంగీత ప్రపంచాన్ని ఏలుతున్న దశలో ఆశా చాలా చిన్న చిత్రాలకు పాటలు పాడారు. ఇంకా చెప్పాలంటే.. ఆ సమయంలో ఎక్కువ పాటలు పాడింది ఆశానే కావడం ఇక్కడ విశేషం. కానీ వాటి వల్ల ఆశాని ఎటువంటి ఉపయోగం లేదు. ఆ సినిమాలను ప్రేక్షకులు అంతగా చూడపోవడమే దానికి కారణం.


ఈ తరుణంలో ఆశా టాలెంట్‌ని గుర్తించింది ప్రముఖ సంగీత దర్శకుడు ఓ పీ నయ్యర్. సిఐడి(1956) సినిమాలో అవకాశం ఇచ్చారు. అనంతరం 1957లో వచ్చిన ‘నయా దౌర్’తో ఈ గాయని గురించి సంగీత ప్రపంచానికి తెలిసింది. అనంతరం కూడా ఆయన సారథ్యంలో మూడు వందలకు పైగా పాటలు పాడారు. అందులో చాలా వరకూ మంచి హిట్స్‌గా మిగిలాయి. అలాగే అనంతరం ఆర్.డి.బర్మన్, ఇళయరాజా సంగీత సారథ్యంలో మంచి పాటలను పాడారు. అనంతరం ఆర్‌.డి.బర్మన్‌నే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.


ఇళయరాజా కారణంగా ఆశా భోస్లే దక్షిణాదిలో అడుగుపెట్టారు. తమిళ సినిమా మూండ్రం పిరయ్ (తెలుగులో వసంత కోకిల, హిందీలో సద్మా)లో పాటలు పాడింది. అలాగే కృష్ణవంశీ దర్శకత్వంలో 2007లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘చందమామ’లో ‘నాలో ఊహలకు’ పాటతో మంచి గుర్తింపు సాధించారు.


అలాగే.. 1981 లో ‘ఉమ్రావ్ జాన్’ సినిమాలో పాడిన ‘దిల్ చీజ్ క్యా హై’.. 1986లో ‘ఇజాజత్’ సినిమాలో పాడిన ‘మెర కుచ్ సామా’ పాటలకుగానూ.. రెండుసార్లు జాతీయ ఉత్తమ నేపథ్య గాయని అవార్డులు గెలుచుకున్నారు. అలాగే.. 2001లో ఫిలింఫేర్ జీవిత సాఫల్య అవార్డు కూడా గెలుచుకున్నారు. అవేకాకుండా మరెన్నో అవార్డులు ఆశా ఖాతాలో వేసుకున్నారు.

                                                                               

                                                                                          - వాసు నామాల

Updated Date - 2022-09-08T19:20:55+05:30 IST