Imran ‘అలాంటివాడు’... రాజకీయాలకు పనికి రాడంటోన్న లెజెండ్రీ బాలీవుడ్ బ్యూటీ!

ABN , First Publish Date - 2022-04-11T19:46:32+05:30 IST

అలనాటి బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ... తరువాతి కాలంలో పాప్యులర్ టెలివిజన్ షో హోస్ట్... సిమీ గరెవాల్ ఆసక్తికరమైన ట్వీట్ చేసింది. అవిశ్వాస తీర్మానంలో పదవి పొగొట్టుకున్న తొలి ప్రధానిగా పాకిస్థాన్ చరిత్రలో నిలిచిపోయిన ఇమ్రాన్ ఖాన్ గురించి ఆమె రెండు కీలకమైన అంశాలు నెటిజన్స్‌తో పంచుకుంది...

Imran ‘అలాంటివాడు’... రాజకీయాలకు పనికి రాడంటోన్న లెజెండ్రీ బాలీవుడ్ బ్యూటీ!

అలనాటి బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ... తరువాతి కాలంలో పాప్యులర్ టెలివిజన్ షో హోస్ట్... సిమీ గరెవాల్ ఆసక్తికరమైన ట్వీట్ చేసింది. అవిశ్వాస తీర్మానంలో పదవి పొగొట్టుకున్న తొలి ప్రధానిగా పాకిస్థాన్ చరిత్రలో నిలిచిపోయిన ఇమ్రాన్ ఖాన్ గురించి ఆమె రెండు కీలకమైన అంశాలు నెటిజన్స్‌తో పంచుకుంది. 1. జనం మద్దతు ఉన్నప్పటికీ ఓ ప్రధానిని విపక్షాలన్నీ కలసి మూకుమ్ముడిగా బలప్రయోగం చేసి పదవీచ్యుతుడ్ని చేయగలవని ఆమె గ్రహించిందట. 2. ఇమ్రాన్ ఖాన్ లాంటి ఆదర్శవాదులకి రాజకీయాల్లో చోటుండదని కూడా సిమీ చెప్పుకొచ్చింది. అంతే కాదు, ఆమె తనకు ఇమ్రాన్ 40 ఏళ్లుగా తెలుసుననీ... అతను ఎంతో మంచివాడని కితాబునిచ్చింది. అటువంటి చక్కటి ఆదర్శాలున్న పాక్ మాజీ ప్రధాని అవినీతిపరుడు మాత్రం కాదంటూ సిమీ సర్టిఫికెట్ కూడా ఇచ్చింది.   


ఇతర లోపాలు ఎన్ని ఉన్నా... ఇమ్రాన్ ఖాన్ అవినీతి మనిషి కాదంటోన్న ఒకప్పటి బాలీవుడ్ హీరోయిన్ సిమీ... ఆయన గురించి ట్వీట్ చేయటం ఇదే మొదటిసారి కాదు. అసలు కొన్నాళ్ల కింద ఇమ్రాన్ ప్రధాని అయినప్పుడు కూడా తను ఓ వివాదాస్పద ట్వీట్ చేసింది. చాలా ఏళ్ల కిందట ఆమె ఇమ్రాన్‌తో మాట్లాడుతుండగా పాక్ మాజీ క్రికెట్ క్యాప్టెన్ ఓ షాకింగ్ విషయం చెప్పాడట. భవిష్యత్తు చెప్పగలిగే ఓ ఇస్లామ్ మత గురువు ఇమ్రాన్ దేశ ప్రధాని అవుతాడని జోస్యం చెప్పాడట. కానీ, అతను హత్య చేయబడతాడని కూడా అన్నాడట! ఇదంతా ఇమ్రాన్ నాకు చెప్పాడంటూ సిమీ గరెవాల్ ట్వీట్ చేసింది! కానీ, పాక్ ప్రధానిగా ఖాన్ ఎన్నికైన వెంటనే సిమీ అటువంటి అనూహ్య ట్వీట్ చేయటం విమర్శలకు దారి తీసింది. అందుకే, తరువాత ఆమె దాన్ని డిలీట్ చేసేసింది. అయితే, ఇప్పుడు ఇమ్రాన్ పదవి కోల్పోయాక మరోసారి అతడి గురించి తన అభిప్రాయం చెప్పింది. ఏది ఏమైనా... సిమీ గరెవాల్ చెప్పిన ఆ హత్య సంగతి మాత్రం ఇమ్రాన్ విషయంలో నిజం కాకూడదని మనమైతే కోరుకుందాం... 

Updated Date - 2022-04-11T19:46:32+05:30 IST