Shooting Bandh: ఇష్యూ మెగా ఫ్యామిలీది కాదు.. ఇండస్ట్రీది!

ABN , First Publish Date - 2022-08-01T17:06:27+05:30 IST

తెలుగు చలన చిత్ర పరిశ్రమ (Tollywood) చరిత్రలో ఇప్పటి వరకు లేనిది.. తొలిసారి చిత్ర నిర్మాతలు షూటింగ్స్‌ని నిలిపివేశారు. నిర్మాతలే స్వయంగా బంద్‌కు పిలుపునివ్వడంతో.. టాలీవుడ్ పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా..

Shooting Bandh: ఇష్యూ మెగా ఫ్యామిలీది కాదు.. ఇండస్ట్రీది!

తెలుగు చలన చిత్ర పరిశ్రమ (Tollywood) చరిత్రలో ఇప్పటి వరకు లేనిది.. తొలిసారి చిత్ర నిర్మాతలు షూటింగ్స్‌ని నిలిపివేశారు. నిర్మాతలే స్వయంగా బంద్‌కు పిలుపునివ్వడంతో.. టాలీవుడ్ పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది. ముఖ్యంగా సినిమా నిర్మాణం ధర అధికంగా పెరిగిపోతుందని, దీనిని అదుపులోకి తీసుకువచ్చేందుకే ఈ బంద్ అనేలా నిర్మాతల వైపు నుండి వినబడుతుంది. అయితే ఈ విషయంలో కూడా ఇండస్ట్రీ అంతా మెగా ఫ్యామిలీ వైపే చూస్తుంది. ఎవరు అంగీకరించినా.. అంగీకరించకపోయినా.. దాసరి నారాయణరావు (Dasari Narayana Rao) తర్వాత ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi)గానే ఇండస్ట్రీలోని చాలా మంది భావిస్తున్నారు. చిరంజీవి తనకి పెద్దరికం వద్దని.. ఎవరైనా ఆపదలో ఉంటే మాత్రం ఖచ్చితంగా తాను స్పందిస్తానని ఈ మధ్య ఒక వేదికపై చెప్పినా.. ఇండస్ట్రీకి వస్తున్న ప్రతి సమస్య ఇప్పుడు మెగా తలుపే తడుతుంది. మొన్నటికి మొన్న స్వయంగా దిల్ రాజే (Dil Raju).. హీరోల రెమ్యూనరేషన్ విషయంలో రామ్ చరణ్ (Ram Charan) తన వైపు నుండి బాధ్యత తీసుకుని.. ఇతర హీరోలతో మాట్లాడతానని భరోసా ఇచ్చినట్లుగా చెప్పుకొచ్చారు.


అయితే దీనిని కూడా కొందరు మెగా ఫ్యామిలీ ఇష్యూగానే చూస్తుండటం గమనార్హం. మెగా ఫ్యామిలీలో 10 మందికి పైగా హీరోలు ఉన్నారు. వాళ్లు రెమ్యూనరేషన్ తగ్గించుకుంటే సమస్య తీరిపోతుంది అనేలా కొన్ని చోట్ల కథనాలు అల్లుతున్నారు. మెగా ఫ్యామిలీలో హీరోలు ఉన్నది నిజమే కానీ.. భారీ రెమ్యూనరేషన్ తీసుకునే హీరోలు అందులో నలుగురు మాత్రమేనని గమనించాలి. మెగా ఫ్యామిలీ హీరోలు కాకుండా.. బయట అధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోలు చాలా మంది ఉన్నారు. వారు కూడా.. ఇది ఇండస్ట్రీ సమస్యగా భావించి ముందుకు వస్తే తప్ప.. ప్రస్తుతం ఉన్న సమస్య పరిష్కారం కాదు. అసలీ పని నిర్మాతలు ఎప్పుడో చేయాల్సింది. ఇండస్ట్రీలో  హీరోల డామినేషన్‌కి కారణమే నిర్మాతలు. వారి స్వయంకృతాపరాధం కారణంగానే నేడు ఇండస్ట్రీకి ఈ పరిస్థితి దాపురించింది. మధ్యలో కరోనా, ఓటీటీల ప్రభావంతో ఇండస్ట్రీ దిక్కుతోచని పరిస్థితికి చేరడంతో.. నిర్మాతలంతా ఇప్పుడు మేల్కొన్నారు. ఇప్పుడు కూడా అందరినీ కలుపుకుపోకుండా.. ఆ నలుగురే కారణం అనుకుంటూ కూర్చుంటే మాత్రం సమస్యలో ఎటువంటి మార్పు రాదు. అలాగే, ఇంకా మెగా ఫ్యామిలీనే టార్గెట్ చేసుకుంటూ కూర్చుంటే కూడా.. సమస్యను మరింత జఠిలం చేసుకున్నవారవుతారు తప్ప.. సమస్యకు పరిష్కారకులు కాలేరు. కాబట్టి.. అందరినీ కలుపుకుని, అందరితో అంటే అన్ని క్రాఫ్టులలో ఉన్నవారితో సంప్రదింపులు జరిపి.. ఈ సమస్యకు సరైన మార్గాన్ని నిర్మాతలు ఎన్నుకుంటారని ఆశిద్దాం.

Updated Date - 2022-08-01T17:06:27+05:30 IST