ఆ రోజుల్లో రాజశేఖర్‌ను ఇమిటేట్‌ చేస్తూ మాట్లాడేవాణ్ణి

ABN , First Publish Date - 2022-05-19T05:30:00+05:30 IST

‘రాజశేఖర్‌గారు నటించిన ‘తలంబ్రాలు’, ‘అంకుశం’, ‘ఆహుతి’, మగాడు’ వంటి చిత్రాలు చూసి ఆయనకు వీరాభిమానిని అయ్యాను.

ఆ రోజుల్లో రాజశేఖర్‌ను ఇమిటేట్‌ చేస్తూ మాట్లాడేవాణ్ణి

‘రాజశేఖర్‌గారు నటించిన ‘తలంబ్రాలు’, ‘అంకుశం’, ‘ఆహుతి’, మగాడు’ వంటి చిత్రాలు చూసి ఆయనకు వీరాభిమానిని అయ్యాను. నేను కూడా సినిమాలు చేయగలను అనే కాన్ఫిడెంట్‌ను ఆ చిత్రాలు ఇచ్చాయి. ఆ రోజుల్లో రాజశేఖర్‌గారిని ఇమిటేట్‌ చేస్తూ మా ఊర్లో పాపులర్‌ అయ్యాను. స్కూల్‌లో కూడా తనలా మాట్లాడమని అడిగేవారు. నేను కూడా సినిమాల్లోకి రాగలను, ఏమైనా చేయగలను అనే భావన ఏర్పడడానికి రాజశేఖర్‌గారే కారణం. ఇలా చెప్పే సందర్భం ఇంతవరకూ రాలేదు. ఇప్పుడు వచ్చింది కనుక చెబుతున్నాను. మనం ఫ్యామిలీ మెంబర్స్‌ను ఇండస్ర్టీకి దూరం పెడతాం. కానీ రాజశేఖర్‌గారు తన ఇద్దరు ఆడపిల్లలను కూడా పరిశ్రమకు  తీసుకురావడం గ్రేట్‌. ఫ్యామిలీని చూసుకుంటూ సినిమాతో పాటు దర్శకత్వం చేయడం చాలా కష్టం. అందుకే జీవితగారి కోసమైనా ‘శేఖర్‌’ సినిమా ఆడాలి’ అని కోరారు దర్శకుడు సుకుమార్‌. మంగళవారం సాయంత్రం జరిగిన ‘శేఖర్‌’ చిత్రం ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో గెస్ట్‌గా పాల్గొన్న దర్శకుడు సుకుమార్‌ చెప్పిన మాటలివి.


హీరో రాజశేఖర్‌ మాట్లాడుతూ ‘కొవిడ్‌ కారణంగా నేను ఎంతో ఇబ్బంది పడ్డాను. డెత్‌ బెడ్‌ నుండి తిరిగొచ్చి ఈ సినిమా చేయగలిగానంటే దానికి కారణం మీ అందరి అభిమానం. ఫ్యాన్స్‌, శ్రేయోభిలాషులు కలసి నన్ను బతికించినట్టే నా సినిమా చూసి మా బతుకుతెరువును మళ్లీ బతికించండి. ఈ సినిమా కోసం నాకంటే జీవిత ఎక్కువ కష్టపడింది. మా ఇద్దరు పిల్లలు పోస్ట్‌ పొడ్రక్షన్‌ లో జీవితకు బాగా హెల్ప్‌ చేశారు’ అన్నారు. ‘ప్రేక్షకులకు నేను ఒక్కటే చెబుతున్నా. ‘శేఖర్‌’ చాలా మంచి సినిమా. మంచి చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉన్నారు. అలాగే మా సినిమాను కూడా ఆదరించండి. టికెట్‌ రేట్స్‌ పెరగడం వల్ల ప్రేక్షకులు థియేటర్స్‌కు రావడం లేదని విన్నాను. అందుకే మా సినిమాకు రేట్లు పెంచడం లేదు. మీకు అందుబాటు ధరలోనే టికెట్స్‌ ఉంటాయి’ అన్నారు దర్శకురాలు జీవిత. ఈ కార్యక్రమంలో నటుడు సముద్రఖని, సంగీత దర్శకుడు అనూప్‌, శివాత్మిక రాజశేఖర్‌, శివానీ, దర్శకులు విజయభాస్కర్‌, ప్రశాంత్‌ వర్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-19T05:30:00+05:30 IST