సీనియర్‌ జర్నలిస్ట్‌ గుడిపూడి శ్రీహరి కన్నుమూత

ABN , First Publish Date - 2022-07-06T05:52:29+05:30 IST

సీనియర్‌ జర్నలిస్టు గుడిపూడి శ్రీహరి(88) ఇకలేరు. కొద్దిరోజుల కిందట ఆయన ఇంట్లో పడి, తుంటి ఎముక విరగడంతో నిమ్స్‌ ఆస్పత్రిలో...

సీనియర్‌ జర్నలిస్ట్‌  గుడిపూడి శ్రీహరి కన్నుమూత

సీనియర్‌ జర్నలిస్టు గుడిపూడి శ్రీహరి(88) ఇకలేరు. కొద్దిరోజుల కిందట ఆయన ఇంట్లో పడి, తుంటి ఎముక విరగడంతో నిమ్స్‌ ఆస్పత్రిలో చేరారు. శస్త్రచికిత్స అనంతరం కోలుకుంటున్న సమయంలో సోడియం, సీరమ్‌ క్రియాటినిన్‌ తగ్గడంతో సోమవారం రాత్రి  రెండు గంటలకు తుదిశ్వాస విడిచారు. శ్రీహరి స్వస్థలం కృష్ణాజిల్లా, కేసరపల్లి. ఆయన 1934, సెప్టెంబరు8న జన్మించారు. బీఎస్సీ, బీఈడీ పూర్తి చేశారు. గణితశాస్త్రంలో పోస్టు గ్రాడ్యుయేషన్‌ చదివారు. 1968 నుంచి ‘ది హిందూ’లో సినిమాలు, రంగస్థలం, శాస్త్రీయ కళలు తదితర సాంస్కృతిక అంశాల మీద ప్రతివారం సమీక్షలు రాస్తున్నారు. సురభి నాటక సంస్థ మీద ఆయన రాసిన కథనం కేంద్ర సంగీత నాటక అకాడమీలో కదలిక తీసుకొచ్చింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తల విభాగంలో క్యాజువల్‌ న్యూస్‌ రీడర్‌గా రెండు దశాబ్దాలు సేవలందించారు. ‘హరివిల్లు’ శీర్షిక ద్వారా సమకాలీన రాజకీయ విషయాలపై పాతికేళ్ల పాటు శ్రీహరి రాసిన వ్యంగ్య రచనలు ఆయనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. ‘తెలుగు ఫిల్మ్‌ ఇండస్ట్రీ’ తెలుగు, ‘కల్చరల్‌ హెరిటేజ్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌’, ‘ఫిల్మ్‌ ఇండస్ట్రీ ఇన్‌ ఆంధ్రప్రదేశ్‌’ ఆంగ్ల పుస్తకాలతో పాటు ‘కామాయణం’ నాటకం రచించారు. ‘మాకూ స్వాతంత్య్రం కావాలి’ సినిమాకు మాటలు రాశారు. ‘ఫిల్మ్‌ క్రిటిక్‌ అసోసియేషన్‌’ అధ్యక్షుడిగా ఆరేళ్లు ఉన్నారు. తన సినిమాలపై గుడిపూడి శ్రీహరి రాసిన ఆరోగ్యకరమైన విమర్శలు నటుడిగా తనను తాను మెరుగుపరుచుకోడానికి ఎంతో ఉపకరించాయి అంటూ మెగాస్టార్‌ చిరంజీవి ట్వీట్‌ చేశారు. ఆయన మృతికి మెగాస్టార్‌ సంతాపం తెలిపారు. తెలుగు సినీపరిశ్రమలోని అనేక ముఖ్యఘట్టాలను గుడిపూడి అక్షరబద్ధం చేశారంటూ జనసేనా అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌ గుర్తుచేశారు. 


గురువారం అంత్యక్రియలు

శ్రీహరి భార్య లక్ష్మి గతేడాది డిసెంబరులో కన్నుమూశారు. వీరి కూతురు జ్యోతి, కుమారుడు శ్రీరామ్‌. న్యూజిల్యాండ్‌ లో స్థిరపడిన కుమారుడు తండ్రి మరణవార్త తెలిసిన వెంటనే బయలుదేరాడు. బంధు, మిత్రుల సందర్శనార్థం గురువారం ఉదయం బీకేగూడలోని ఇంటి వద్ద భౌతికకాయాన్ని ఉంచనున్నారు. అనంతరం ఎర్రగడ్డ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 

Updated Date - 2022-07-06T05:52:29+05:30 IST