సీనియర్‌ ఎడిటర్‌ గౌతమ్‌ రాజు కన్నుమూత

ABN , First Publish Date - 2022-07-07T06:30:11+05:30 IST

తెలుగు చిత్రపరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. సీనియర్‌ ఎడిటర్‌ గౌతమ్‌రాజు బుధవారం తెల్లారి హైదరాబాద్‌లోని తన స్వగృహంలో కన్నుమూశారు...

సీనియర్‌ ఎడిటర్‌ గౌతమ్‌ రాజు కన్నుమూత

తెలుగు చిత్రపరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. సీనియర్‌ ఎడిటర్‌ గౌతమ్‌రాజు బుధవారం తెల్లారి   హైదరాబాద్‌లోని తన స్వగృహంలో కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన కిడ్నీ సంబంధిత వ్యాధితో  బాధ పడుతున్నారు.అనారోగ్య కారణాలతో కొన్నాళ్ల క్రితమే ఆయన ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొంది డిస్చార్జ్‌ అయ్యారు కూడా. అయితే అనూహ్యంగా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన కన్నుమూశారు.  ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 1954 జనవరి 15న ఒంగోలులో జన్మించిన గౌతమ్‌రాజు 800 చిత్రాలకు పైగా పనిచేశారు.  తండ్రి ఉద్యోగరీత్యా విద్యాభ్యాసం  అంతా చెన్నైలోనే జరిగింది. అరుణాచలం స్టూడియోలో ఆపరేటివ్‌ కెమెరామన్‌గా కెరీర్‌ ప్రారంభించిన గౌతమ్‌రాజు, జి.సంజీవి దగ్గర ఎడిటింగ్‌లో మెళకువలు నేర్చుకుని , తమిళ దర్శకుడు ఎస్‌.ఎ.చంద్రశేఖర్‌ రూపొందించిన ‘అవళ్‌ ఒరు పచ్చి కొళందై’కు ఎడిటర్‌గా తొలిసారి పనిచేశారు. ఆ చిత్రం ఆధారంగా తెలుగులో చిరంజీవి, మాధవి జంటగా  రూపుదిద్దుకున్న ‘చట్టానికి కళ్లు లేవు’ సినిమాకూ ఆయనే ఎడిటర్‌. ఆ సినిమాలో ఓ పాట చూసి దర్శకుడు జంధ్యాల తన ‘నాలుగు స్థంభాలాట’ చిత్రానికి ఎడిటర్‌గా పెట్టుకున్నారు. అప్పటినుండి జంధ్యాల మరణించే వరకూ తీసిన చిత్రాలకు గౌతమ్‌రాజే ఎడిటర్‌. తెలుగులోనే కాదు తమిళ, కన్నడ భాషల్లో ఎన్నో చిత్రాలకు ఆయన ఎడిటర్‌గా పనిచేశారు. బెస్ట్‌ ఎడిటర్‌గా ఆయన ఆరు నంది అవార్డులు అందుకున్నారు. ఎంతోమంది సీనియర్‌ హీరోలకు గౌతమ్‌రాజు అంటే గౌరవం. ఆయన జడ్జిమెంట్‌ను బాగా విశ్వసిస్తుంటారు. టెక్నాలజీలో వచ్చే మార్పులకు అనుగుణంగా మారలేక చాలా మంది కెరీర్‌లో వెనకపడిపోతుంటారు. కానీ గౌతమ్‌రాజు అలా కాదు .. ఎడిటింగ్‌ పరంగా వచ్చే లేటేస్ట్‌ టెక్నాలజీని ఆకళింపు చేసుకుని తనని తాను అప్‌డేట్‌ చేసుకుంటూ వచ్చారు. చిరంజీవి, బాలకృష్ణ, పవన్‌కల్యాణ్‌, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌ నటించిన ఎన్నో చిత్రాలకు ఆయన ఎడిటర్‌గా పనిచేశారు. గౌతమ్‌రాజు  మితభాషి. ముఖ్యంగా పబ్లిసిటీకి బాగా దూరంగా ఉండేవారు. ఇంటర్వ్యూ అడిగినా ఇచ్చేవారు కాదు. అలాగే సినిమా ఫంక్షన్స్‌లో తప్ప ఎక్కడా కనిపించేవారు కాదు. ఎడిటింగ్‌ రూమ్‌లోనే ఆయన ఎక్కువ సమయం గడిపేవారు.


చిరంజీవి ఆర్ధిక సాయం

తను హీరోగా నటించిన ఎన్నో చిత్రాలకు ఎడిటర్‌గా పనిచేసిన గౌతమ్‌రాజు  మృతికి మెగాస్టార్‌ చిరంజీవి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. తక్షణ సాయంగా రెండు లక్షల రూపాయలను గౌతమ్‌రాజు కుటుంబ  సభ్యులకు  తమ్మారెడ్డి భరద్వాజ ద్వారా చిరంజీవి అందజేశారు. 


Updated Date - 2022-07-07T06:30:11+05:30 IST