KJ Sarathi: సీనియర్ హాస్య నటుడు కె.జె. సారథి కన్నుమూత

ABN , First Publish Date - 2022-08-01T15:02:27+05:30 IST

సీనియర్ హాస్యనటుడు కె.జె. సారథి (83) (KJ Sarathi) సోమవారం ఉదయం కన్నుమూశారు. కిడ్నీ, లంగ్స్ సమస్యలతో బాధపడుతున్న ఆయన.. నెల రోజులుగా హైదరాబాద్ సిటీ న్యూరో సెంటర్ హాస్పిటల్ నందు చికిత్స పొందుతూ..

KJ Sarathi: సీనియర్ హాస్య నటుడు కె.జె. సారథి కన్నుమూత

సీనియర్ హాస్యనటుడు కె.జె. సారథి (83) (KJ Sarathi) సోమవారం ఉదయం కన్నుమూశారు. కిడ్నీ, లంగ్స్ సమస్యలతో బాధపడుతున్న ఆయన.. నెల రోజులుగా హైదరాబాద్ సిటీ న్యూరో సెంటర్ హాస్పిటల్ నందు చికిత్స పొందుతూ.. సోమవారం ఉదయం 2గంటల 32 నిమిషాలకు మృతి చెందారు. ఆయన పూర్తి పేరు కడలి విజయ సారథి (Kadali Jaya Sarathi). 1942 జూన్ 26న పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుగొండలో ఆయన జన్మించారు. దాదాపు 350 పైగా చిత్రాలలో నటించడమే కాకుండా.. నిర్మాతగా మారి రెబల్ స్టార్ కృష్టంరాజు (Krishnam Raju)తో ‘ధర్మాత్ముడు, అగ్గిరాజు, శ్రీరామ చంద్రుడు, విధాత’ చిత్రాలను నిర్మించారు. 


1960లో నందమూరి తారక రామారావు (NT Ramarao) దర్శకత్వంలో వచ్చిన ‘సీతారామ కళ్యాణం’ చిత్రంతో నటుడిగా కె.జె. సారథి వెండితెరకు పరిచయమయ్యారు. ఆ చిత్రంలో నలకూబరునిగా ఆయన నటించారు. అనేక సినిమాలలో హాస్యపాత్రలు పోషించి ప్రేక్షకుల మెప్పు పొందారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ మద్రాసు నుండి హైదరాబాదుకు తరలించే ప్రక్రియలో ఆయన కూడా క్రియాశీలక పాత్ర పోషించారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ సినీకార్మికుల సంస్థకు వ్యవస్థాపక కోశాధికారిగా ఆయన పని చేశారు. సినిమాలే కాకుండా ఋష్యేంద్రమణి, స్థానం నరసింహారావు, రేలంగి వెంకట్రామయ్య, బి.పద్మనాభం వంటి గొప్ప నటులతో కలిసి నాటకాలలో నటించి.. నాటకరంగానికి ఎనలేని సేవచేశారు. నవతా కృష్ణంరాజు నిర్మించిన ‘జమిందార్ గారి అమ్మాయి, పంతులమ్మ, అమెరికా అమ్మాయి, ఇంటింటి రామాయణం, ఓ ఇంటి భాగోతం’ చిత్రాల మ్యూజిక్ సిట్టింగ్స్ అన్ని సారథినే దగ్గరుండి చూశారు. రెబల్‌స్టార్ కృష్ణంరాజుతో ఉన్న సాన్నిహిత్యంతో గోపికృష్ణ బ్యానర్‌లో నిర్మించిన చిత్రాలకు సారథి సాంకేతిక విషయాలను చూసుకునేవారు. అలాగే హైదరాబాద్ చిత్రపురి కాలనీ నిర్మాణంలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు.


సీతారామ కళ్యాణం (1961), పరమానందయ్య శిష్యుల కథ1966), ఈ కాలపు పిల్లలు (1976), భక్త కన్నప్ప (1976), అత్తవారిల్లు (1977),  అమరదీపం (1977), జగన్మోహిని (1978), మన ఊరి పాండవులు (1978), సొమ్మొకడిది సోకొకడిది (1978),  కోతల రాయుడు (1979), గంధర్వ కన్య (1979), మెరుపు దాడి (1984).. వంటి ఎన్నో చిత్రాలతో నటించిన కె.జె. సారథి..హాస్యనటుడిగా తనదైన నటనతో మంచి గుర్తింపును పొందారు.  కె.జె. సారథి మరణవార్త తెలిసిన సినీ ప్రముఖులు చింతిస్తూ.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ.. నివాళులు అర్పిస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం హైదరాబాద్ మహాప్రస్థానంలో ఆయన అంత్య క్రియలు జరగనున్నాయి.







Updated Date - 2022-08-01T15:02:27+05:30 IST