మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ వదిలిన ‘సీతారామ‌పురంలో ఒక ప్రేమ జంట’ టీజ‌ర్

ABN , First Publish Date - 2022-06-23T22:35:56+05:30 IST

శ్రీ ధ‌న‌ల‌క్ష్మి మూవీస్ ప‌తాకంపై.. ఎమ్.విన‌య్ బాబు ద‌ర్శక‌త్వంలో బీసు చంద‌ర్ గౌడ్ నిర్మిస్తోన్న చిత్రం ‘సీతారామ‌పురంలో ఒక ప్రేమ జంట‌’. విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో సాగే ఈ ప్రేమ‌క‌థా చిత్రంతో ర‌ణ‌ధీర్, నందిని రెడ్డి హీరోహీరోయిన్లుగా..

మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ వదిలిన ‘సీతారామ‌పురంలో ఒక ప్రేమ జంట’ టీజ‌ర్

Seetharama Puram Lo Oka Prema Janta: శ్రీ ధ‌న‌ల‌క్ష్మి మూవీస్ ప‌తాకంపై.. ఎమ్.విన‌య్ బాబు ద‌ర్శక‌త్వంలో బీసు చంద‌ర్ గౌడ్ నిర్మిస్తోన్న చిత్రం ‘సీతారామ‌పురంలో ఒక ప్రేమ జంట‌’. విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో సాగే ఈ ప్రేమ‌క‌థా చిత్రంతో ర‌ణ‌ధీర్, నందిని రెడ్డి హీరోహీరోయిన్లుగా ప‌రిచ‌యం అవుతున్నారు. తాజాగా ఈ చిత్రం టీజర్‌ని హైదరాబాద్, ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగిన కార్యక్రమంలో మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) విడుదల చేశారు. టీజర్ విడుదల అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా పాట‌లు, టీజ‌ర్ చూశాక ఇదొక చ‌క్కటి ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ చిత్రమని అర్థమ‌వుతోంది. అంద‌రూ కొత్తవారు న‌టించిన ఈ చిత్రం విజ‌య‌వంతం కావాల‌ని కోరుకుంటున్నాను. ఇంత‌కు ముందు ఆ న‌లుగురే నిర్మాత‌లు, వాళ్లే హీరోలు, వాళ్లవే థియేట‌ర్స్ అన్నట్టు ఉండేది. కానీ, ఇప్పుడు ప‌రిస్థితి మారింది. కొత్తవాళ్లు కూడా వ‌స్తున్నారు. స‌క్సెస్ సాధిస్తున్నారు. ఇంకా మార్పు మారాలి. ఇక సింగిల్ విండో విధానం ద్వారా తెలంగాణలో ఎక్కడైనా షూటింగ్ చేసుకోవ‌డానికి  త‌క్కువ రేట్లతో ప‌ర్మిష‌న్స్ ఇస్తున్నాం. తెలంగాణ‌లో ఎన్నో అద్భుత‌మైన లొకేష‌న్స్ ఉన్నాయి. ఇక్కడ మంచి క‌ల్చర్ ఉంది. తెలుగుతో పాటు ఇత‌ర భాష‌ల చిత్రాలు కూడా ఇక్కడ షూటింగ్స్ జ‌రుపుకుంటున్నాయి. తెలంగాణ ప్రభుత్వం సినిమా ప‌రిశ్రమ‌కి అన్నివిధాల స‌హ‌క‌రిస్తోంది. చిత్ర  ప‌రిశ్రమ‌ను  డెవ‌ల‌ప్ చేయ‌డానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోంది. ప్రస్తుతం తెలంగాణ భాష‌, యాస‌లో వ‌చ్చే చిత్రాలు బాగా స‌క్సెస్ అవుతున్నాయి. ఆ కోవ‌లో వస్తున్న ఈ  ‘సీతారామ‌పురంలో ఒక ప్రేమ జంట’ కూడా బాగా ఆడాల‌ని కోరుకుంటూ చిత్రయూనిట్‌కి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను..’’ అన్నారు.


ద‌ర్శకుడు విన‌య్ బాబు మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్ర క‌థ అంద‌రికీ న‌చ్చేలా ఉంటుంది.  ప్రతి పాత్ర ప్రేక్షకుడికి క‌నెక్టయ్యేలా ఉంటుంది. డిఫ‌రెంట్ వేలో ఆలోచించి  తీసిన ల‌వ్ స్టోరి ఇది.  ప్రేమించ‌డం కాదు.. ఆ ప్రేమ‌ను నిల‌బెట్టుకోవాల‌న్న అంశాన్ని మా చిత్రం ద్వారా చూపిస్తున్నాం. ఎక్కడా వ‌ల్గారిటీకి తావుండ‌దు. అన్ని వ‌ర్గాల ప్రేక్షకుల‌కు న‌చ్చే విధంగా సినిమా ఉంటుంది. త్వర‌లో సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేస్తాం’’ అని తెలుపగా.. నిర్మాత బీసు చంద‌ర్ గౌడ్ మాట్లాడుతూ.. “ద‌ర్శకుడు విన‌య్ బాబు చెప్పిన క‌థ న‌చ్చి మా అబ్బాయి ర‌ణ‌ధీర్‌ని హీరోగా ప‌రిచ‌యం చేస్తూ ఈ సినిమా నిర్మించాను. ఎక్కడా రాజీ ప‌డ‌కుండా క‌థకు త‌గ్గట్టుగా ఖ‌ర్చు పెట్టాం. గ్రామీణ వాతావ‌ర‌ణంలో జ‌రిగే చ‌క్కటి ప్రేమ‌క‌థా చిత్రమిది. క‌థ‌లో మంచి మ‌లుపులు ఉన్నాయి.  క‌థా ప‌రంగా చాలా పెద్ద సినిమా ఇది. విడుద‌లైన పాట‌ల‌కు మంచి స్పంద‌న వ‌స్తోంది. మా టీమ్‌ని ఆశీర్వదించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్‌గారికి ధన్యవాదాలు. త్వర‌లోనే చిత్ర విడుద‌ల తేదీ ప్రక‌టిస్తాం’’ అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో హీరో రణధీర్, హీరోయిన్ నందిని రెడ్డి మాట్లాడుతూ.. అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు.



Updated Date - 2022-06-23T22:35:56+05:30 IST