ఇండియాలో బంగ్లాదేశ్ ఫిల్మ్ ఫెస్టివల్.. ఆ దేశ విముక్తి ప్రధానంగా..

ABN , First Publish Date - 2022-02-24T18:43:31+05:30 IST

భారతదేశం, బంగ్లాదేశ్‌ మధ్య బంధాన్ని బలోపేతం చేసే ఉద్దేశంతో బంగ్లాదేశ్ ఫిల్మ్ ఫెస్టివల్‌ని అగర్తాలాలో నిర్వహిస్తున్నారు...

ఇండియాలో బంగ్లాదేశ్ ఫిల్మ్ ఫెస్టివల్.. ఆ దేశ విముక్తి ప్రధానంగా..

భారతదేశం, బంగ్లాదేశ్‌ మధ్య బంధాన్ని బలోపేతం చేసే ఉద్దేశంతో బంగ్లాదేశ్ ఫిల్మ్ ఫెస్టివల్‌ని అగర్తాలాలో నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఓసారి ఇలాంటి వేడుకలను నిర్వహించగా.. తాజాగా రెండోసారి నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 23న ప్రారంభించిన ఈ ప్రొగ్రామ్‌లో భాగంగా రెండు దేశాలు సంయుక్తంగా సాంస్కృతిక, సాహిత్య కార్యక్రమాలను నిర్వహించనున్నాయి. లిబరేషన్ వార్ 1971 స్వర్ణోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఈ ఉత్సవాన్ని ప్లాన్ చేసినట్లు బంగ్లాదేశ్ అసిస్టెంట్ హైకమిషనర్ కార్యాలయ అధికారి తెలిపారు.


ఈ ఉత్సవం ప్రారంభోత్సవంలో త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్, బంగ్లాదేశ్ సమాచార, ప్రసార శాఖ మంత్రి హసన్ మహమూద్, త్రిపుర సమాచార, సాంస్కృతిక వ్యవహారాల మంత్రి సుశాంత చౌదరితో పాటు బంగ్లాదేశ్‌కు చెందిన పలువురు నటీనటులు, సినీ ప్రముఖులు పాల్గొన్నారు.


బంగ్లాదేశ్ అసిస్టెంట్ హైకమిషనర్ ఆరిఫ్ మహ్మద్ మాట్లాడుతూ.. రెండు దేశాల యువతకు బంగ్లాదేశ్ విజయాన్ని, అద్భుతమైన చరిత్రను తెలియజేయాలనే ఉద్దేశంతో విముక్తి యుద్ధంపై ఉత్తమంగా నిర్మించిన చిత్రాలను ఈ ఫెస్టివల్‌లో ప్రదర్శించనున్నట్లు తెలిపారు. విముక్తి యుద్ధ సమయంలో భారత ప్రభుత్వం, ముఖ్యంగా త్రిపుర ప్రజల పాత్ర కూడా ఫిల్మ్ ఫెస్టివల్‌లో హైలైట్ అవుతుందని చెప్పారు. పొరుగు దేశాల మధ్య సామాజిక, ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయడం ఈ సాంస్కృతిక ఉత్సవం లక్ష్యం అని ఆయన పేర్కొన్నారు. నిజానికి ఈ ఫెస్టివల్ గతేడాది అక్టోబర్‌లోనే జరగాల్సింది. అయితే దుర్గా పూజ పండుగ సందర్భంగా బంగ్లాదేశ్‌లో మతపరమైన సంఘటనలు జరగడం, ఆ కారణంగా త్రిపురలో ఉద్రిక్త పరిస్థితుల ఏర్పడడంతో వాయిదా పడింది.

Updated Date - 2022-02-24T18:43:31+05:30 IST