Tollywood : ఒకే ఫార్ములా.. ఇంకెన్నాళ్ళు?

ABN , First Publish Date - 2022-08-15T15:09:59+05:30 IST

ఎనభైయవ దశకంలో టాలీవుడ్‌లో యాక్షన్ చిత్రాలకు మాస్ జనం బాగా కనెక్ట్ అయ్యేవారు. అప్పట్లో ఒకే ఫార్మేట్లో విడుదలైన అలాంటి చిత్రాలు జనానికి బాగా ఎక్కేసేవి. ఒక ఊరుని గడగడలాడించే పవర్ ఫుల్ విలన్.. అతడికి ఎదురెళ్ళి సవాల్ విసిరే హ్యాండ్సమ్ హీరో. ఇద్దరికీ ఫైట్. కట్ చేస్తే హీరో చేతిలో విలన్‌కు చావు దెబ్బలు.

Tollywood : ఒకే  ఫార్ములా.. ఇంకెన్నాళ్ళు?

ఎనభైయవ దశకంలో టాలీవుడ్‌లో యాక్షన్ చిత్రాలకు మాస్ జనం బాగా కనెక్ట్ అయ్యేవారు. అప్పట్లో ఒకే ఫార్మేట్లో విడుదలైన అలాంటి చిత్రాలు జనానికి బాగా ఎక్కేసేవి. ఒక ఊరుని గడగడలాడించే పవర్ ఫుల్ విలన్.. అతడికి ఎదురెళ్ళి సవాల్ విసిరే హ్యాండ్సమ్ హీరో. ఇద్దరికీ ఫైట్. కట్ చేస్తే హీరో చేతిలో విలన్‌కు చావు దెబ్బలు. అదే రొటీన్ ఫార్ములా.. తరాల్ని దాటుకుంటూ.. హీరోల్ని మార్చుకుంటూ వచ్చింది. ఒక సినిమాలో హీరో పేదవాడు, మరో సినిమాలో సామాన్యుడు, ఇంకో సినిమాలో పోలీసు, మరో సినిమాలో లాయర్, వేరే సినిమాలో జిల్లా కలెక్టర్. చేసే పనులు వేరైనా ఫార్ములా మాత్రం ఒకటే. అయితే ఈతరం ప్రేక్షకులు మాత్రం అలాంటి ఔట్ డేటెడ్ ఫార్ములా చిత్రాల్ని తిప్పికొడుతున్నారు. ఈ మధ్య కాలంలో విడుదలైన అలాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద చతికిల పడ్డాయి. 


రామ్ పోతినేని, లింగుసామి కాంబినేషన్‌లో వచ్చిన ‘ది వారియర్’ చిత్రం సరిగ్గా అదే ఫార్ములాతో తెరకెక్కింది. ఇందులో హీరో ఖాకీ చొక్కా తొడుగుతాడు. పవర్ ఫుల్ విలన్ గురు.. ఒక ఊరుని గడగడలాడిస్తుంటే.. ముందు డాక్టర్ వృత్తిలో ఉండే అతడు.. పోలీస్‌గా మారి మరీ అతడి భరతం పడతాడు. కథాకథనాల్లో ఏమాత్రం కొత్తదనం లేక సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలైంది. ఈ సినిమాపై ఎన్నో హోప్స్ పెట్టుకున్న రామ్‌ ఖాతాలో దీని రూపంలో మరో ఫ్లాప్ తప్పలేదు. 


ఇక ఇదే ఫార్ములాతో వచ్చిన మరో సినిమా నితిన్ హీరోగా, రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలోని ‘మాచర్ల నియోజక వర్గం’. ఇందులో విలన్ యంఎల్‌ఏ రాజప్ప అయితే.. అతడిని ఢీకొట్టే హీరో సిద్ధార్ధ్ రెడ్డి ఐఏయస్. జిల్లా కలెక్టర్. 30 ఏళ్ళుగా మాచర్ల నియోజకవర్గంలో ఎన్నికలు జరపకుండా ఏకగ్రీవంగా యం.ఎల్.ఏ అవుతున్న అతడికి సిద్ధార్ధ్ రెడ్డి ఎదురెళ్ళి.. పోరాడి చివరికి ఎన్నికలు జరిపించడమే చిత్ర కథాంశం. ఈ సినిమా కూడా రొటీన్ కథాకథనాలతో ప్రేక్షకుల్ని బోర్ కొట్టించింది. దీనికి కూడా బాక్సాఫీస్ వద్ద పరాజయం తప్పలేదు.  అంతకు ముందు విడుదలైన రవితేజ ‘రామారావు ఆన్‌డ్యూటీ’ చిత్రం కూడా ఇంచుమించు అదే కథాకథనాలతో విడుదలై.. ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టింది. ఇంతకు ముందు సూర్య ‘ఈటీ’, విశాల్ ‘సామాన్యుడు’ చిత్రాలు కూడా ఇంచు మించు ఇవే ఫార్మేట్స్‌తో వచ్చి దెబ్బతిన్నాయి.. ఇప్పటికైనా ఈ ఫార్ములాను వదిలేసి.. టాలీవుడ్ దర్శకులు కొత్తగా ఆలోచించడం బెటరని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

Updated Date - 2022-08-15T15:09:59+05:30 IST