అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తున్న అందాల భామ సమంత రుత్ ప్రభు(Samantha Ruth Prabhu). దక్షిణాదిలో తానేంటో నిరూపించుకుంది. బాలీవుడ్‌లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తుంది. అక్కడి మేకర్స్‌తో చర్చలు జరుపుతుంది. ఇప్పటికే రెండు ప్రాజెక్టుల్లో కథానాయికగా ఎంపిక అయిందని బాలీవుడ్ మీడియా తెలుపుతోంది.
‘ఉరీ: ది సర్జికల్ స్ట్రైక్’(Uri: The Surgical Strike) తో బంపర్ హిట్ కొట్టిన దర్శకుడు ఆదిత్య ధర్ (Aditya Dhar). ‘ద ఇమ్మోర్టాల్ అశ్వత్థామ’ (The Immortal Ashwatthama) సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో విక్కీ కౌశల్ (Vicky Kaushal) హీరోగా నటిస్తున్నాడు. విక్కీ పక్కన హీరోయిన్‌గా నటించే అవకాశం సమంత దక్కించుకుందని బీ టౌన్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ చిత్రంలో సమంత నటిస్తుందో, లేదో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే. ఆయుష్మాన్ ఖురానా (Ayushmann Khurrana)కు జోడీగా సామ్ మరో ప్రాజెక్టులోను ఛాన్స్ కొట్టేసిందని పుకార్లు షికార్లు కొడుతున్నాయి. ఈ చిత్రాన్ని మ్యాడ్‌డక్ ఫిలిమ్స్ బ్యానర్‌పై దినేష్ విజన్ నిర్మిస్తున్నాడు. గతంలో ‘ద ఇమ్మోర్టాల్ అశ్వత్థామ’ లో సారా అలీ ఖాన్ కథానాయికగా నటిస్తుందనే వార్తలు హల్‌చల్ చేశాయి. కానీ, అధికారికంగా హీరోయిన్ ఎవరనే విషయాన్ని చిత్ర బృందం ప్రకటించలేదు. ‘‘ఆదిత్య ధర్ గత కొంతకాలంగా ‘ద ఇమ్మోర్టాల్ అశ్వత్థామ’ స్క్రిఫ్ట్‌పై పనిచేస్తున్నాడు. ఈ సినిమా 2023 ప్రారంభంలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతుంది’’ అని చిత్ర బృందంతో సన్నిహితంగా మెలిగే వ్యక్తి చెప్పారు. ఇక కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం సమంత వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ‘శాకుంతలం’, ‘యశోద’, ‘ఖుషి’ సినిమాలు చేస్తుంది.