‘పుష్ప’ బ్యూటీస్‌కి బాలీవుడ్‌లో ఫుల్ క్రేజ్!

ABN , First Publish Date - 2022-04-20T03:04:01+05:30 IST

గ్లామర్ ఎక్కడ ఉంటే ఫిల్మ్ మేకర్స్ అక్కడికి వెదుక్కుంటూ వెళ్లిపోతుంటారు. ప్రస్తుతం బీ-టౌన్ దర్శకనిర్మాతలు, హీరోల కన్ను ఇద్దరు సౌత్ బ్యూటీస్‌పై ప్రధానంగా పడుతోంది...

‘పుష్ప’ బ్యూటీస్‌కి బాలీవుడ్‌లో ఫుల్ క్రేజ్!

పేరుకి మనది ఒకే దేశమైనా... సినిమా పరిశ్రమల పరంగా బోలెడు హద్దలు, సరిహద్దలున్నాయి. ముఖ్యంగా, చాలా కాలంగా బాలీవుడ్‌కి, దక్షిణాదికి మధ్య స్పష్టమైన అడ్డుగీత కొనసాగుతోంది. అయితే, ‘బాహుబలి’ లాంటి ప్యాన్ ఇండియన్ మూవీ సీన్ మొత్తం మార్చేసింది. వరుసగా సౌత్ సినిమాలు బాలీవుడ్‌లో దుమ్మురేపుతున్నాయి. పైగా ఓటీటీ విప్లవం కూడా అన్ని భాషల ప్రేక్షకుల్ని, నటీనటుల్ని, సాంకేతిక నిపుణుల్ని మరింత దగ్గర చేసేస్తోంది. మరి ఈ మార్పు అందగత్తెలకు వర్తించదా చెప్పండి? ఖచ్చితంగా గ్లామర్ ఎక్కడ ఉంటే ఫిల్మ్ మేకర్స్ అక్కడికి వెదుక్కుంటూ వెళ్లిపోతుంటారు. ప్రస్తుతం బీ-టౌన్ దర్శకనిర్మాతలు, హీరోల కన్ను ఇద్దరు సౌత్ బ్యూటీస్‌పై ప్రధానంగా పడుతోంది... 


బాలీవుడ్‌కు దక్షిణాది కథనాయికలు కొత్తేం కాదు. వైజయంతీమాలా, రేఖ మొదలు శ్రీదేవి, ఐశ్వర్య రాయ్ వరకూ సౌత్ సౌందర్యవతులు దశాబ్దాల పాటూ హిందీ తెరని ఏలారు. ఇప్పుడు కూడా దీపికా పదుకొణే, విద్యా బాలన్, పూజా హెగ్డే లాంటి దక్షిణాది మూలాలున్న ముంబై బ్యూటీస్ తమ సత్తా చాటుతూనే ఉన్నారు. అయితే, బీ-టౌన్‌లో నెక్ట్స్ బెస్ట్ థింగ్స్‌గా ప్రచారం అవుతోన్న రెండు క్రేజీ పేర్లు... రశ్మిక, సమంత. ‘పుష్ప’ బ్యూటీ రశ్మిక ఆల్రెడీ ‘తగ్గేదేలే’ అంటూ హిందీ తెర మీదకి దూసుకెళ్లింది. ‘మిషన్ మజ్నూ, గుడ్ బై, యానిమల్’ లాంటి స్ట్రెయిట్ హిందీ మూవీస్‌తో ముందు ముందు బాలీవుడ్‌లో హల్‌చల్ సృష్టించనుంది. ‘నేషనల్ క్రష్’ అంటూ బాలీవుడ్ బాబులు రశ్మిక పేరు బాగానే కలవరిస్తున్నారు!


తెలుగులో సూపర్ హిట్టై... హిందీలోకి డబ్ అయిన... ‘ఈగ, సన్నాఫ్ సత్యమూర్తి’ లాంటి అనేక చిత్రాల ద్వారా సమంత బాలీవుడ్ ఆడియన్స్‌కి పరిచయమే. అయితే, ‘ద ఫ్యామిలీ మ్యాన్ 2’తో నేరుగానే సత్తా చాటేసింది సామ్. దాంతో ఆమెని పెద్ద తెరపై చూసుకోవాలని హిందీ ప్రేక్షకులు ఆసక్తిగానే ఎదురు చూస్తున్నారు. అయితే, త్వరలో ‘శాకుంతలం, యశోద’ లాంటి ప్యాన్ ఇండియా సినిమాలతో సమంత బాలీవుడ్‌ని పలకరించనుంది. ఆ తరువాత ఇంగ్లీష్ వెబ్ సిరీస్ ‘సిటాడెల్’ హిందీ వర్షన్‌లో కూడా ఆమె కనిపించనుంది. వరుణ్ ధవన్ పక్కన సామ్ వెబ్ సిరీస్‌లో నటించబోతోంది. అయితే, సమంత ఇంత వరకూ పూర్తి స్థాయి బాలీవుడ్ మూవీని మాత్రం సైన్ చేయలేదు. బిగ్ బాలీవుడ్ స్క్రీన్‌పై మన సౌత్ బ్యూటీ ఎప్పుడు గుభాళిస్తుందో చూడాలి మరి....  

Updated Date - 2022-04-20T03:04:01+05:30 IST