చిరు ‘గాడ్‌ఫాదర్’ షూటింగ్‌లో పాల్గొననున్న సల్మాన్ ఖాన్.. చిత్రీకరణ ఎక్కడంటే..

ABN , First Publish Date - 2022-03-10T23:12:36+05:30 IST

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న సినిమా ‘గాడ్‌ఫాదర్’.

చిరు ‘గాడ్‌ఫాదర్’ షూటింగ్‌లో పాల్గొననున్న సల్మాన్ ఖాన్.. చిత్రీకరణ ఎక్కడంటే..

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న సినిమా ‘గాడ్‌ఫాదర్’. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. మలయాళంలో ఘనవిజయం సాధించిన ‘లూసిఫర్’ రీమేక్‌గా ఈ సినిమా రూపొందుతోంది. ఈ మూవీలో నయనతార, సత్యదేవ్, సల్మాన్ ఖాన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. మలయాళంలోని మంజువారియర్ పాత్రను తెలుగులో నయన్, ఆమె భర్త వివేక్ ఒబెరాయ్ పాత్రను సత్యదేవ్, పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రను సల్మాన్ ఖాన్ పోషిస్తున్నట్లు సమాచారం. 


‘గాడ్ ఫాదర్’ షూటింగ్‌లో సల్మాన్ ఖాన్ త్వరలోనే పాల్గొనబోతున్నట్టు తెలుస్తోంది. ముంబై, కర్జాత్‌ ప్రాంతంలోని ఎన్‌డీ స్టూడియోలో మార్చి 12న సల్లూ భాయ్ షూటింగ్‌ను ప్రారంభించబోతున్నట్టు సమాచారం. దాదాపుగా వారం రోజుల పాటు ఈ షెడ్యూల్ కొనసాగనున్నట్టు బాలీవుడ్ వర్గాలు తెలుపుతున్నాయి. ఈ ఏడాది జనవరిలోనే సల్మాన్ చిత్రీకరణలో పాల్గొనాలి. కానీ, చిరంజీవి కరోనా పాజిటివ్‌గా తేలడంతో షూటింగ్ వాయిదా పడింది. ఈ లోపే బాలీవుడ్ కండలవీరుడు ‘టైగర్-3’ చిత్రీకరణని పూర్తి చేశారు. చిరంజీవి ‘గాడ్‌ఫాదర్’ షూటింగ్‌లో పాల్గొనేందుకు త్వరలోనే ముంబైకి వెళ్లనున్నారని టాలీవుడ్ వర్గాలు తెలుపుతున్నాయి. అయితే, బాలీవుడ్ భాయ్‌జాన్‌కు ముంబైలోని పన్వేల్‌లో ఫామ్‌హౌస్ ఉన్న సంగతి తెలిసిందే. అదే ఫామ్‌హౌస్‌లో చిరంజీవి విడిది చేసే అవకాశం ఎక్కువగా ఉంది.   


ప్రస్తుతం చిరు చేతిలో అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. ఆయన నటించిన ‘ఆచార్య’ విడుదలకు సిద్ధంగా ఉంది. ‘గాడ్ ఫాదర్’, ‘భోళా శంకర్’ సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.



Updated Date - 2022-03-10T23:12:36+05:30 IST