బాలీవుడ్, టాలీవుడ్ అనే గీతలు చెరిగిపోయాయి. అక్కడి నటులు ఇక్కడ... ఇక్కడి నటులు అక్కడ.. సినిమాలు చేసేస్తున్నారు. తెలుగు సినిమాల్లో బాలీవుడ్ హీరోలు, హిందీ చిత్రాల్లో మన కథానాయకులు తళుక్కున మెరవడం మామూలైపోతోంది. చిరు ‘గాడ్ ఫాదర్’ కోసం సల్మాన్ ఖాన్ రంగంలోకి దిగారు. అమీర్ ‘లాల్ సింగ్ చద్దా’లో నాగచైతన్య నటించారు.
ఇప్పుడు సల్మాన్ ఖాన్ చిత్రంలో వెంకటేష్ ఓ కీలక పాత్ర చేయడానికి ఒప్పుకొన్నారు. సల్మాన్ కథానాయకుడిగా ‘కభీ ఈద్.. కభీ దివాళీ’ అనే చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఫర్హద్ సమ్జీ దర్శకుడు. పూజా హెగ్డే కథానాయిక. శుక్రవారం ముంబైలో ఈ చిత్రం ప్రారంభమైంది. ఇందులో వెంకీ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. వచ్చే వారంలో ఆయన సెట్స్‌పై అడుగుపెట్టబోతున్నారు. వెంకీ, సల్మాన్ మంచి స్నేహితులు. సల్మాన్ ‘బాడీగార్డ్’ చిత్రాన్ని వెంకీ తెలుగులో రీమేక్ చేశారు. దాంతో.. వీరిద్దరి ఫ్రెండ్షిప్ మరింతగా పెరిగింది. ఆ స్నేహంతోనే ఈ సినిమాలో ఓ కీలక పాత్ర చేయమని వెంకీని కోరారు సల్మాన్. వెంటనే వెంకటేష్ కూడా ఒప్పుకొన్నారు. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి.