అసలు ఇదేం సినిమా.. స్క్రీన్‌ప్లే ఏమైనా ఉందా..? Beast దర్శకుడిపై Vijay తండ్రి విమర్శలు

ABN , First Publish Date - 2022-04-20T00:51:48+05:30 IST

కోలీవుడ్‌లో హీరో విజయ్ క్రేజే వేరు. ఆయన తాజా చిత్రం ‘బీస్ట్’ నెగటివ్ రివ్యూస్‌తో డీలా పడింది. అయినా కూడా ఫ్లాప్ టాక్‌ని తట్టుకుంటూ వసూళ్ల పరంగా 200 కోట్ల మార్క్ క్రాస్ చేసింది! కానీ, అదే కారణం ఇప్పుడు విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్‌కి ఆగ్రహం తెప్పిస్తోంది...

అసలు ఇదేం సినిమా.. స్క్రీన్‌ప్లే ఏమైనా ఉందా..? Beast దర్శకుడిపై Vijay తండ్రి విమర్శలు

కోలీవుడ్‌లో హీరో విజయ్ క్రేజే వేరు. ఆయన తాజా చిత్రం ‘బీస్ట్’ నెగటివ్ రివ్యూస్‌తో డీలా పడింది. అయినా కూడా ఫ్లాప్ టాక్‌ని తట్టుకుంటూ వసూళ్ల పరంగా 200 కోట్ల మార్క్ క్రాస్ చేసింది! కానీ, అదే కారణం ఇప్పుడు విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్‌కి ఆగ్రహం తెప్పిస్తోంది. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కేవలం హీరో విజయ్ స్టార్‌డమ్ మీదే నమ్మకం పెట్టుకుని స్క్రిప్ట్ సంగతి లైట్ తీసుకున్నాడని ఆయన ఆరోపిస్తున్నాడు. 


ఇళయదళపతి విజయ్ తండ్రి చంద్రశేఖర్ స్వయంగా దర్శకనిర్మాత. ఆయన తన తనయుడు నటించిన ‘బీస్ట్’ చూసి చాలా డిజపాయింట్ అయ్యాడట. సినిమాలో కొరియోగ్రాఫర్ పనితనం, ఫైట్ మాస్టర్ ప్రతిభ, హీరో శ్రమ... ఇలా అన్నీ కనిపిస్తున్నాయి... కానీ, ఎక్కడా దర్శకుడు నెల్సన్ మాత్రం కనిపించలేదని ఘాటుగా వ్యాఖ్యానించాడు. చాలా మంది కొత్త దర్శకులు ఇదే పని చేస్తున్నారని ఆయన ఓ ఇంటర్వ్యూలో అన్నాడు. మొదటి చిత్రం క్రియేటివ్‌గా, టెక్నికల్‌గా చక్కగా తీస్తారని చెప్పిన ఆయన రెండో సినిమా కూడా జాగ్రత్తగానే తెరకెక్కిస్తారని అన్నాడు. ఇక మూడో సినిమాకల్లా పెద్ద హీరోల నుంచీ ఆపర్స్ రావటంతో యంగ్ డైరెక్టర్స్ హోమ్ వర్క్ మానేస్తారని చంద్రశేఖర్ కుండబద్ధలు కొట్టాడు. కథ, కథనం వంటివి పట్టించుకోకుండా స్టార్ హీరో డేట్స్ దొరకగానే నేరుగా సెట్స్ మీదకి వచ్చేస్తారని విమర్శించాడు. అందుకే, ‘బీస్ట్’ లాంటి సినిమాల్లో స్క్రీన్ ప్లే లోపం స్పష్టంగా కనిపిస్తుంటుందని చెప్పుకొచ్చాడు. 


‘బీస్ట్’ సినిమా అంతర్జాతీయ ఉగ్రవాదం గురించి... ఒక ‘రా‘ ఏజెంట్‌కు సంబంధించిన స్టోరీ... అటువంటి భారీ అంశాల్ని తెరపై చూపుతున్నప్పుడు ఎంతో శ్రద్ధ అవసరం అంటున్నాడు ఎస్ఏ చంద్రశేఖర్. నెల్సన్ దిలీప్ కుమార్ ఎంత మాత్రం స్క్రిప్ట్ వర్క్ చేయలేదని ఆయన సూటిగానే విమర్శించాడు. చూడాలి మరి, తన కెరీర్‌లో మూడో చిత్రంగా విజయ్‌తో ‘బీస్ట్’ రూపొందించిన నెల్సన్ తనపై వస్తోన్న విమర్శలకు ఎలాంటి జవాబు ఇస్తాడో. హీరో విజయ్ తండ్రే నానా మాటలు అంటుండటం ప్రస్తుతం కోలీవుడ్‌లో చర్చగా మారింది. త్వరలోనే ఇళయదళపతి విజయ్ కూడా ఏమన్నా మాట్లాడతాడేమో చూడాలి...  

Updated Date - 2022-04-20T00:51:48+05:30 IST