రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannath) తొలి కలయికలో ప్రస్తుతం ‘లైగర్’ (Liger) సినిమా తెరకెక్కుతోంది. చిత్రీకరణ చివరిదశకు చేరుకుంది. ఆగస్ట్ 25న పాన్ ఇండియా స్థాయిలోనూ, ప్రపంచ వ్యాప్తంగానూ చిత్రం థియేటర్స్ లో భారీ ఎత్తున విడుదల కాబోతోంది. విడుదల మరో 50 రోజుల్లోకి వచ్చిందని ఇటీవల పూరీ జగన్నాథ్ ఓ ప్రత్యేక పోస్ట్ కూడా పెట్టారు. దీని తర్వాత ఇదే కాంబినేషన్ లో ‘జనగణమన’ (Janaganamana) (JGM) అనే మరో భారీ చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ స్టోరీని ఇంతకు ముందు మహేశ్ (Mahesh), పవన్ కళ్యాణ్ (Pawankalyan) లాంటి హీరోలకు వినిపించినా వర్కవుట్ కాలేదు. ఫైనల్ గా ఈ సినిమాను విజయ్ దేవరకొండతో ఫిక్స్ చేసి షూట్ కు రెడీ అవుతున్నారు పూరీ.
దేశభక్తి నేపథ్యంలో ఆసక్తికరమైన కథాకథనాలతో JGM సినిమాను తెరకెక్కించబోతున్నారు పూరీ. అయితే ఈ సినిమా కథాంశంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో పలు వార్తలొస్తున్నాయి. ఇందులో విజయ్ సైనికుడిగా నటించబోతున్నాడు. సైనికుడి సినిమా అనగానే అందరికీ సరిహద్దుల్లో పోరాటాలు, యుద్ధమే గుర్తుకొస్తాయి. కానీ ఇది పూరీ సినిమా కాబట్టి.. అంతకు మించిన స్థాయిలోనే కథాంశాన్ని సెట్ చేసుకున్నట్టు వినికిడి. ఈ సినిమాలో సమకాలిక రాజకీయాలకు పెద్ద పీట వేశారట పూరీ. ఈ క్రమంలో డిఫరెంట్ థాట్‌తో ఈ సినిమా కాన్సెప్ట్ ఉండబోతోందట. అసలు ఈ దేశంలో మిలటరీ రూల్ (Military rule) వస్తే ఎలా ఉంటుంది? అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశమని సమాచారం.
దేశంలోని రాజకీయ వ్యవస్థ పూర్తిగా భ్రష్టుపట్టి పోయినప్పుడు మిలటరీ ఎలా స్పందించాలి? ఈ దేశ పాలనా వ్యవస్థని చేతుల్లోకి తీసుకొని పరిపాలన సాగిస్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచన నుంచి ఈ సినిమా కథ పుట్టుకొచ్చిందట. అంటే ఈ దేశాధినేతగా ఈ సినిమాలో విజయ్ దేవరకొండను చూడబోతున్నామన్నమాట. ఇది వరకు నోటా (Nota) అనే పొలిటికల్ థ్రిల్లర్‌లో విజయ్ ముఖ్యమంత్రిగా నటించిన సంగతి తెలిసిందే. అయితే అది ఏమంతగా వర్కవుట్ కాలేదు. మరి ఈ సారి పూరీ జగన్నాథ్ విజయ్ ను దేశాధినేతగా చూపించి.. తన డ్రీమ్ ను నెరవేర్చుకుంటారేమో వేచి చూడాలి.