దర్శక ధీరుడు ఎస్ ఎస్. రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ‘రౌద్రం, రణం, రుధిరం(ఆర్ఆర్ఆర్)’. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించిన ఈ సినిమా సంచలన రికార్డులు నమోదు చేస్తోంది. విడుదలైన 16రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 1000కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టింది. బాలీవుడ్‌లోను రూ.200కోట్లను వసూలు చేసింది. కోవిడ్ అనంతరం ఈ మార్కు దాటిన రెండో చిత్రంగా నిలిచింది. కరోనా మొదలైన తర్వాత ‘ద కశ్మీర్ ఫైల్స్’ మాత్రమే రూ.200కోట్ల వసూళ్లను రాబట్టింది. ‘ఆర్ఆర్ఆర్’ లో అజయ్ దేవగణ్, అలియా భట్, ఒలివియా మోరిస్, సముద్ర ఖని, రే స్టీవెన్సన్, అలిసన్ డూడీ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
‘ఆర్ఆర్ఆర్’లో రామ్ చరణ్ నటనకు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో అతడు మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో ఆసక్తికర కబుర్లను అభిమానులకు తెలిపాడు. తాను బాలీవుడ్ డైరెక్టర్లతో పనిచేయాలనుకుంటున్నానని రామ్ చరణ్ తెలిపాడు. కానీ, ఆ దర్శకులు సౌత్‌కు అనుగుణంగా పాన్ ఇండియా సినిమాను తెరకెక్కించాలన్నాడు. బాలీవుడ్ సినిమాలను దక్షిణాదిలో ఆదరించారన్న సల్మాన్ ఖాన్ వ్యాఖ్యలపై కూడా అదిరిపోయే రెస్పాన్స్ ఇచ్చాడు. ‘‘నిజం చెప్పాలంటే అది సల్మాన్ తప్పు కాదు, సినిమా తప్పు కాదు. కథలోనే లోపం ఉందని నేను నమ్ముతున్నాను’’ అని రామ్ చరణ్ వెల్లడించాడు. సరిహద్దులను చెరిపేయాల్సింది దర్శకులే అని వివరించాడు. ప్రతి రైటర్ విజయేంద్ర ప్రసాద్, రాజమౌళి లాగా కథలు రాయగలరని స్పష్టం చేశాడు.
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ మార్చిలో ఐఫా ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడాడు. తనకు చిరంజీవి చాలా కాలంగా తెలుసన్నాడు. ‘గాడ్ ఫాదర్’లో చిరుతో కలసి పనిచేస్తున్నానన్నాడు. ‘‘రామ్ చరణ్ నాకు మంచి స్నేహితుడు. ‘ఆర్ఆర్ఆర్’ లో అద్భుతంగా నటించాడు. అతనిని చూస్తే గర్వంగా ఉంది. సౌత్‌లో బాలీవుడ్ సినిమాలు ఎందుకు నడవవో నాకు ఆశ్చర్యం వేస్తుంది. కానీ, దక్షిణాది చిత్రాలు మాత్రం బాలీవుడ్లో అద్భుతమైన వసూళ్లు సాధిస్తున్నాయి’’ అని సల్మాన్ ఖాన్ తెలిపాడు.