విజయవాడ: రౌద్రం... రణం.... రుధిరం... సంక్షిప్తంగా ఆర్ఆర్ఆర్. చిత్ర ప్రదర్శన మధ్యలో అంతరాయం వచ్చినందుకు అభిమానులు రౌద్రం ప్రదర్శించారు. థియేటర్లో రణం చేశారు. విజయవాడలోని అన్నపూర్ణ థియేటర్లో ఈ ఘటన శుక్రవారం జరిగింది. ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. విజయవాడలోని అన్నపూర్ణ థియేటర్లో ఉదయం ఆటలో కాసేపు సాంకేతిక లోపం వచ్చింది. ఆట మొదలైనప్పటి నుంచి రచ్చరచ్చ చేస్తున్న అభిమానులు ఈ సాంకేతిక లోపంతో ఒక్కసారిగా చల్లబడిపోయారు. సమయం గడుస్తున్నా ప్రదర్శన ప్రారంభం కావడం లేదు. థియేటర్ యాజమాన్యం సమస్య ఏమిటో చెప్పడం లేదు. దీంతో హీరోల అభిమానులు ఆగ్రహానికి లోనయ్యారు.
థియేటర్లో ఉన్న కుర్చీలను ఒక వరుసలో విరగ్గొట్టేశారు. థియేటర్లో బాల్కనికి బయట ఏర్పాటు చేసిన అద్దాలను ధ్వంసం చేశారు. తలుపులను విరిసేశారు. అభిమానులు తెర వద్దకు వెళ్లకుండా కొద్దిరోజుల క్రితం యాజమాన్యం మేకులు దిగ్గొట్టిన చెక్కలను ఏర్పాటు చేసింది. వాటినీ పీకి పారేశారు. మొత్తంగా అంతరాయంతో ఆగ్రహానికి లోనైన అభిమానులు థియేటర్లో రణం ప్రదర్శించారు. ఇక పాయకాపురంలో ఉన్న తార స్ర్కీన్స్ థియేటర్లో ఉదయం ఆట చివరిలో కాసేపు అంతరాయం వచ్చింది. మధ్యాహ్నం ఆటకు ప్రేక్షకులు థియేటర్లోకి వెళ్లి కూర్చున్నా ప్రదర్శన ప్రారంభం కాలేదు. ప్రొజెక్టర్లో సాంకేతిక లోపం రావడంతో ఆలస్యమైంది. అప్పటికే అన్నపూర్ణ థియేటర్లో జరిగిన విధ్వంసం గురించి తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన తార స్ర్కీన్స్కు చేరుకున్నారు. అక్కడ ఎలాంటి విధ్వంసం జరగకుండా ప్రేక్షకులను అదుపు చేసినట్లుగా తెలుస్తుంది.