దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి (S S Rajamouli) దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR)- మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోలుగా రూపొందిన పాన్ ఇండియన్ సినిమా 'ఆర్ఆర్ఆర్' (RRR). ఈ సినిమాను అగ్ర నిర్మాత డీవీవీ దానయ్య (D V V Danayya) భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం మార్చి 25వ తేదీన విడుదలైన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఈ సినిమా 500 థియేటర్లలో విజయవంతగా 50 రోజులను పూర్తిచేసుకుంది. ఈ మధ్య కాలంలో ఇంత భారీ స్థాయిలో 50 రోజులను పూర్తి చేసుకున్న సినిమా ఆర్ఆర్ఆర్ కావడం విశేషం.
ఇందులో కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ .. అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ నటించగా, భారీ అంచనాల మధ్య విడుదలైంది. ఇండియాతో పాటు అమెరికా వంటి ఇతర దేశాల నుంచి మొదటి షో నుంచే భారీ హిట్ అనే టాక్ తెచ్చుకుంది. ఇద్దరు స్టార్ హీరోల పాత్రలను స్క్రీన్ మీద సరి సమానంగా చూపించి అటు నందమూరి అభిమానులను ఇటు మెగా అభిమాలతో పాటు అన్నీ వర్గాల ప్రేక్షకులను సంతృప్తి పరిచిన జక్కన్నను టాలీవుడ్, బాలీవుడ్ సహా మిగతా భాషలలోని సినీ ప్రముఖులు ప్రశంసలతో ముంచేశారు. ఈ సినిమాకి కీరవాణి అందించిన సంగీతం కూడా పెద్ద హైలెట్‌గా నిలిచింది.
టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకూ ఆర్టిస్టులు ఈ సినిమాలో కనిపించగా, విజయేంద్ర ప్రసాద్ కథాకథనాలు .. రాజమౌళి చిత్రంలో పాత్రలను మలచిన విధానం .. ఆయన మేకింగ్ .. ఎన్టీఆర్ - చరణ్‌ల పర్ఫార్మెన్స్.. .. అజయ్ దేవగణ్ ఎపిసోడ్ ఆర్ఆర్ఆర్ చిత్రానికి హైలైట్‌గా నిలిచాయి. విడుదలరోజునే రికార్డు స్థాయి వసూళ్లతో ఓపెనింగ్స్ మొదలుపెట్టిన ఈ సినిమా రూ 1000 కోట్ల మార్కును దాటడానికి ఎక్కువరోజులు పట్టకపోవడం గొప్ప విశేషం. కాగా, ఇప్పుడు ఆర్ఆర్ఆర్ 500 థియేటర్లలో విజయవంతగా 50 రోజులను పూర్తిచేసుకోవడంతో దీనికి సంబంధించిన సరికొత్త పోస్టర్ నెట్టింట చక్కర్లు కొడుతూ వైరల్ అవుతోంది.