Priyamani పెళ్ళి తర్వాత రీ ఎంట్రీ కష్టాలు..?

ABN , First Publish Date - 2022-09-10T17:47:48+05:30 IST

సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా మంచి క్రేజ్ తెచ్చుకున్న ప్రియమణి (Priyamani) ఇప్పుడు అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. తమిళంలో హీరోయిన్‌గా నటించిన మొదటి సినిమా పరుత్తివీరన్‌తో జాతీయ ఉత్తమనటిగా అవార్డు అందుకున్న

Priyamani పెళ్ళి తర్వాత రీ ఎంట్రీ కష్టాలు..?

సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా మంచి క్రేజ్ తెచ్చుకున్న ప్రియమణి (Priyamani) ఇప్పుడు అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. తమిళంలో హీరోయిన్‌గా నటించిన మొదటి సినిమా పరుత్తివీరన్‌తో జాతీయ ఉత్తమనటిగా అవార్డు అందుకున్న ఆమె తెలుగులో ఎవరే అతగాడు సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయినప్పటికీ, జగపతి బాబు హీరోగా వచ్చిన పెళ్ళైన కొత్తలో మూవీలో అవకాశం అందుకొని మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.


ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా అన్నీ వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొని హిట్‌గా నిలిచింది. ఈ సినిమా సక్సెస్ తర్వాత ప్రియమణికి మంచి అవకాశాలు వచ్చాయి. రాజమౌళి - ఎన్.టి.ఆర్ కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ యమదొంగ ఆమెకి ఇంకా పాపులారిటీని తెచ్చిపెట్టింది. దాంతో అటు నితిన్, తరుణ్ లాంటి యంగ్ హీరోలతోనూ, నాగార్జున, బాలకృష్ణ లాంటి సీనియర్ హీరోలతోనూ నటించే అవకాశాలు వరుసగా అందుకున్నారు. ఒకవైపు ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలలో నటిస్తూనే ద్రోణ వంటి సినిమాలలో బికినీ ధరించి హాట్ టాపిక్ అయ్యారు.


పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన గోలీమార్ అలాగే నవ వసంతం, రక్తచరిత్ర, శంభో శివ శంభో, చారులత, చండి లాంటివి ఆమె కెరీర్‌లో మంచి చిత్రాలుగా చెప్పుకోవచ్చు. హిందీలో రావణ్, మైదాన్ లాంటి చిత్రాలలో నటించారు. అయితే, కెరీర్ మంచి ఊపులో ఉన్నప్పుడే ముస్తఫ్ఫా రాజ్‌ను పెళ్ళి చేసుకొని కొంత గ్యాప్ తీసుకున్నారు. అయితే, పూర్తిగా నటనకు మాత్రం దూరం కాలేదు. బుల్లితెర మీద షోస్‌లలో సందడి చేస్తున్నారు. అంతేకాకుండా, డిజిటల్ ఎంట్రీ ఇచ్చి ది ఫ్యామిలీ మేన్ లాంటి సూపర్ హిట్ వెబ్ సిరీస్‌లలో నటిస్తూ బిజీగా ఉన్నారు. 


అయితే, ప్రియమణి ఇంకా హీరోయిన్‌గా కొనసాగాలనుకుంటున్నారు. ఆ దిశగా గట్టి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో పెళ్ళి తర్వాత వచ్చిన నారప్ప, విరాట పర్వం సినిమా అవకాశాలను వదల్లేదు. కానీ, ఈ సినిమాలు ప్రియమణి రీ ఎంట్రీకి పెద్దగా ఉపయోగపడినట్టు లేదనే చెప్పాలి. తెలుగులో ప్రస్తుతానికైతే హీరోయిన్‌గా ఆమె చేతిలో ఒక్క సినిమా కూడా లేదని తెలుస్తోంది. హిందీలో మాత్రం బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ నటిస్తున్న సినిమాలో కీలక పాత్రను పోషిస్తున్నారు. నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు అట్లీ దర్శకుడు. 


మరి పెళ్ళి తర్వాత కూడా ఇంతగా హీరోయిన్ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న ప్రియమణికి ఆ అవకాశాలు వస్తాయో లేదో చూడాలి. ఆ మధ్య బుల్లితెరపై ప్రసారమవుతున్న పాపులర్ డాన్స్ షోకి గెస్ట్‌గా వచ్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ .."ముందుకంటే ఇప్పుడు ఇంకా అందంగా ఉన్నారు..చూద్దాం మనమిద్దరం కలిసి నటించే ఛాన్స్ వస్తుందేమో" అని అన్నారు. దానికి ప్రియమణి పడ్డ ఆనందం అంతా ఇంతా కాదు. బన్నీ కామెంట్స్ చూస్తే ఇక్కడ ఆమెకి అవకాశాలు ఇచ్చేవాళ్ళు ఇంకా ఉన్నారని అర్థమవుతుంది. చూడాలి మరి అది ఎప్పుడు జరుగుతుందో. 

Updated Date - 2022-09-10T17:47:48+05:30 IST