Raviteja : టాలెంటెడ్ రైటర్‌కు దర్శకుడిగా అవకాశం

ABN , First Publish Date - 2022-08-07T20:22:08+05:30 IST

మాస్ మహారాజా రవితేజ (Raviteja) ఒక రైటర్‌ టాలెంటెడ్ అని అనిపిస్తే చాలు.. జయాపజయాలతో పనిలేకుండా.. వారితో రిపిటెడ్‌గా ట్రావెల్ అవుతుంటారు. ఈ కోవలో గతంలో చాలా మంది రచయితలతో రవితేజ పనిచేశారు.

Raviteja : టాలెంటెడ్ రైటర్‌కు దర్శకుడిగా అవకాశం

మాస్ మహారాజా రవితేజ (Raviteja) ఒక రైటర్‌ టాలెంటెడ్ అని అనిపిస్తే చాలు..  జయాపజయాలతో పనిలేకుండా.. వారితో రిపిటెడ్‌గా ట్రావెల్ అవుతుంటారు. ఈ కోవలో గతంలో చాలా మంది రచయితలతో రవితేజ పనిచేశారు. ఇప్పుడు కూడా ఒక రైటర్ రవితేజ సినిమాలకు తరచుగా పనిచేస్తున్నాడు. అతడి పేరు శ్రీకాంత్ విస్సా (Srikanth Vissa). అల్లు అర్జున్ (Allu Arjun) ‘పుష్ప’ (Pushpa) చిత్రానికి అతడే రైటర్. ఆ సినిమా సూపర్ హిట్టవడంతో శ్రీకాంత్ రైటర్ గా చాలా బిజీ అయిపోయాడు. రవితేజ నటించిన ‘ఖిలాడి’ (Khiladi) చిత్రానికి కథ అతడిదే. ఈ సినిమా పరాజయం పాలైనప్పటికీ.. ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న ‘టైగర్ నాగేశ్వరరావు (Tiger Nageswararao), రావణాసుర’ (Ravanasura) చిత్రాలకు అతడ్నే రైటర్ గా పెట్టుకున్నారు రవితేజ. అలాంటి రైటర్ ను ఇప్పుడు దర్శకుడ్ని చేసే బాధ్యతను రవితేజ తీసుకోవడం విశేషం.


శ్రీకాంత్ పనితీరు, రైటింగ్ స్కిల్స్ రవితేజను బాగా ఆకట్టుకోవడంతో.. అతడు రాసిన రెండు కథల్ని రవితేజ కొనేసి సినిమాలుగా చేయబోతున్నారు. అంతేకాదు అందులో ఒక సినిమాకి శ్రీకాంత్ విస్సా దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం ఆ కథకు సంబంధించిన కథా చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం రవితేజ వరుస చిత్రాలతో బీజీగా ఉన్న సంగతి తెలిసిందే. పనిలో పనిగా శ్రీకాంత్ కు కూడా డేట్స్ ఇవ్వాలని రవితేజ ఫిక్స్ అయ్యారు. తన సొంత బ్యానర్ ఆర్టీ క్రియేటివ్ వర్క్స్ (RT Creative Works) బ్యానర్‌పైనే ఈ సినిమాను నిర్మించబోతున్నారు రవితేజ. 


రవితేజ‌తో చాలా మంది రైటర్స్ పనిచేసినప్పటికీ.. ఇంతవరకూ వారిలో ఎవరికీ ఆయన దర్శకుడిగా ఛాన్స్ ఇవ్వలేదు. తొలిసారి ఒక రైటర్‌ను ఆయన దర్శకుడిగా చేయబోతుండడం విశేషమనే చెప్పాలి. త్వరలో శ్రీకాంత్ విస్సా దర్శకత్వంలో రవితేజ చేయబోయే సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతోంది. ఇటీవల విడుదలైన రవితేజ చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’ (Ramarao Onduty) పరాజయం పాలవడంతో.. తదుపరి చిత్రాలపై మరింత జాగ్రత్తగా అడుగులే వేయబోతున్నారు రవితేజ. మరి శ్రీకాంత్ విస్సా రచన అందిస్తున్న చిత్రాలతో పాటు తొలిసారిగా దర్వకత్వం చేయబోతున్న సినిమా రవితేజకు ఏ స్థాయి హిట్స్ అందిస్తాయో చూడాలి. 

Updated Date - 2022-08-07T20:22:08+05:30 IST