సౌత్ సినిమాలతో పోల్చితే బాలీవుడ్ అందుకే వెనకబడుతోంది.. Raveena Tandon ఆసక్తికర కామెంట్స్

ABN , First Publish Date - 2022-04-19T22:36:11+05:30 IST

ఈ మధ్య కాలంలో బాలీవుడ్ నటీనటులు దక్షిణాది చిత్రాల్ని, సినీ పరిశ్రమల్ని మెచ్చుకోవటం, ఆకాశానికి ఎత్తటం సర్వ సాధారణం అయిపోయింది. ఇప్పుడు రవీనా టాండన్ కూడా ‘సౌత్ అభిమానుల’ లిస్టులో చేరిపోయింది. ఆమె బాలీవుడ్‌ని, దక్షిణాదితో పోలుస్తూ ఆసక్తికరమైన విశ్లేషణ చేసింది...

సౌత్ సినిమాలతో పోల్చితే బాలీవుడ్ అందుకే వెనకబడుతోంది.. Raveena Tandon ఆసక్తికర కామెంట్స్

ఈ మధ్య కాలంలో బాలీవుడ్ నటీనటులు దక్షిణాది చిత్రాల్ని, సినీ పరిశ్రమల్ని మెచ్చుకోవటం, ఆకాశానికి ఎత్తటం సర్వ సాధారణం అయిపోయింది. ఇప్పుడు రవీనా టాండన్ కూడా ‘సౌత్ అభిమానుల’ లిస్టులో చేరిపోయింది. ఆమె బాలీవుడ్‌ని, దక్షిణాదితో పోలుస్తూ ఆసక్తికరమైన విశ్లేషణ చేసింది. సౌత్ మూవీస్‌ ఇండియన్ కల్చర్‌ని అంటిపెట్టుకుని కొనసాగుతోంటే హిందీ చిత్రాలు మాత్రం హాలీవుడ్‌ను అనుకరిస్తూ ఒరిజినాలిటి మిస్ అవుతున్నాయని సీనియర్ బ్యూటీ చెప్పింది... 


రవీనా తన తాజా ఇంటర్వ్యూలో ‘కేజీఎఫ్’ చిత్రాల గురించి ప్రస్తావించింది. ‘కేజీఎఫ్ చాప్టర్ 2’లో ఆమె ప్రధాన మంత్రి పాత్రలో కనిపించింది. అయితే, ‘కేజీఎఫ్’ చాప్టర్ వన్ అండ్ టూలో అసలు హైలైట్ ఎమోషనల్ ఎలిమెంట్సే అంటోందామె. భావోద్వేగాలు పండకపోతే సినిమా అంత పెద్ద హిట్ అవ్వదని రవీనా అభిప్రాయపడింది. 


గతంలో కొన్ని తెలుగు చిత్రాల్లోనూ హీరోయిన్ గా నటించిన రవీనా టాండన్ ఒకప్పటి బాలీవుడ్‌ని, సౌత్ సినిమాని కూడా పోలుస్తూ తేడాని వివరించింది. హిందీ సినిమా దర్శకనిర్మాతలు వీలైనంతగా హాలీవుడ్‌ను అనుకరించటంలోనే నిమగ్నమయ్యే వారట. అదే సమయంలో రవీనా దక్షిణాది చిత్రాలు చేసేందుకు మన వైపుగా వస్తే... ఇక్కడి చిత్రాల్లో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు తెర నిండుగా దర్శనం ఇచ్చేవట! ఆ విధంగా సౌత్ మూవీస్ సామాన్యులకి ఏం కావాలో అది అందించటం వల్లే సూపర్ హిట్స్ అయ్యాయని రవీనా విశ్లేషించింది. 


‘కేజీఎఫ్ చాప్టర్ 2’ బ్లాక్ బస్టర్ సక్సెస్‌తో ఆనందంగా ఉన్న రవీనా టాండన్... ప్రశాంత్ నీల్ సినిమా కేవలం యాక్షన్ థ్రిల్లర్ కాదంటోంది. ఎంతగా ఫైట్స్, గన్స్ అండ్ బుల్లెట్స్ చూపించినా కథలో ప్రేక్షకుల్ని పట్టిపెట్టే ఎమోషన్ ఉండాల్సిందేనంటోంది. అది ఉంది కాబట్టే బాలీవుడ్ సినిమాల్ని మించిపోయేలా ‘కేజీఎఫ్’ దేశవ్యాప్తంగా సత్తా చాటుతోందని ఆమె నిర్ధారించింది. రాజమౌళి ‘బాహుబలి’తో మొదలైన సౌత్ సినిమాల క్రేజ్ బాలీవుడ్‌లో ఇంకా కొనసాగుతోంది. ‘కేజీఎఫ్ 2’ 500 కోట్ల మార్క్ దాటేసింది కలెక్షన్ల పరంగా. దాంతో బీ-టౌన్ సీనియర్ నటీనటులు, దర్శకనిర్మాతలు చాలా మంది దక్షిణాది జపం చేస్తున్నారు. 

Updated Date - 2022-04-19T22:36:11+05:30 IST