నేను ఎగ్‌టేరియన్‌: రష్మిక మందన్న

ABN , First Publish Date - 2020-09-27T16:58:32+05:30 IST

టాలీవుడ్‌లో ఎగిసిపడుతున్న కన్నడ కెరటం రష్మిక మందన్న. చేతిలో చాలా సినిమాలతో సూపర్‌ బిజీగా ఉంది ఈ బ్యూటీ. పెద్ద కళ్లతో, క్యూట్‌ లుక్స్‌ తో...

నేను ఎగ్‌టేరియన్‌: రష్మిక మందన్న

టాలీవుడ్‌లో ఎగిసిపడుతున్న కన్నడ కెరటం రష్మిక మందన్న. చేతిలో చాలా సినిమాలతో సూపర్‌ బిజీగా ఉంది ఈ బ్యూటీ. పెద్ద కళ్లతో, క్యూట్‌ లుక్స్‌ తో లక్షల మందిని అభిమానులుగా మార్చుకున్న ఈ ముద్దుగుమ్మ తన అందం కోసం ఏం తింటుందో తెలుసా? 


నీళ్లతో మొదలు

ఉదయం లేవగానే చేసే మొదటి పని నీళ్లు తాగడం. దాదాపు లీటరు నీళ్లు గడగడ తాగేస్తా. ఈ మధ్యే నా డైటీషియన్‌ నీళ్లతో పాటూ కాస్త యాపిల్‌ సిడర్‌ వెనిగర్‌ తాగమని సలహా ఇచ్చింది. 


ఇష్టమైన బ్రేక్‌ ఫాస్ట్‌

నాకు అవకాడో టోస్ట్‌ అంటే చాలా ఇష్టం. కానీ నా డైటీషియన్‌ తినొద్దని చెప్పింది. అందుకే మానేశా. ఆమె ఏం చెబితే అదే నా బ్రేక్‌ ఫాస్ట్‌. ఒక బౌల్‌ నిండుగా రకరకాల పండ్ల ముక్కలు తింటా. బొప్పాయి, అరటి పండు, ఆపిల్‌, నల్ల ద్రాక్ష, డ్రాగన్‌ ఫ్రూట్‌, దానిమ్మ గింజలు, ఫిగ్‌ పండ్లు ఇవన్నీ నా ఫ్రూట్‌ బౌల్‌ లో కనిపిస్తాయి.


లంచ్‌, డిన్నర్‌...

అన్నం ఎక్కువ తినను. ఒక కప్పులో కూరలన్నీ కలిపి తింటాను. అలా అయితే ఎక్కువ కూరగాయలు, ఆకుకూరలు తిన్నట్టు అవుతుంది కదా. డిన్నర్‌లో చాలా తేలికపాటి ఆహారాన్ని తీసుకుంటాను. రైస్‌ ఐటెమ్స్‌ మాత్రం తినను. 


వ్యాయామం చేశాక...

నిజానికి నేను పక్కా మాంసాహారిని కానీ ఏడాది క్రితం శాకాహారిగా మారా. కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు ఎక్కువ తింటున్నా. అన్నట్టు ఉడకబెట్టిన గుడ్లు బాగా తింటా. వ్యాయామం చేశాక కచ్చితంగా రెండు గుడ్లు తినాల్సిందే. అందుకే నేను ఎగ్‌ టేరియన్ని అని చెబుతా. 


శాకాహారిగా ఎందుకు మారానంటే...

చికెన్‌ వంటకాలంటే పడి చచ్చే నేను వాటిని మానేశానంటే కాస్త ఆశ్చర్యంగానే ఉంది. సినిమాలలో నిలబడాలంటే అందం చాలా ముఖ్యం. నాజూగ్గా కనిపించాలనే నాన్‌ వెజ్‌ మానేశా. 


అవంటే అలర్జీ

వెజిటేరియన్‌గా మారాక నాకు ఫుడ్‌ అలర్జీ ఉన్న సంగతి బయటపడింది. టొమాటోలు, క్యాప్సికం, కీరాదోస, బంగాళాదుంపలు వంటివి తరచూ తింటే ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. అవి దాదాపు నా మెనూలో లేకుండా చూసుకుంటా. 


డైటింగ్‌ ఉన్నా...

దాదాపు నా డైటీషియన్‌ చెప్పిన ఆహారాన్నే రోజూ తింటా. డైటింగ్‌ లో ఉన్నప్పుడు నిజాయితీగా ఉండాలనే నియమం నాది. అందుకే డైటీషియన్‌ కళ్లుగప్పి ఏవీ తినను. 


తినాలని కోరుకునేవి

ఐస్‌ క్రీములు, చాకొలెట్‌ కేకులంటే చాలా ఇష్టం. డైటింగ్‌ మొదలుపెట్టాక వాటిని పక్కన పెట్టా. అప్పుడప్పుడు డైటీషియన్‌ అనుమతితో తింటా. 


ఒక చెడు అలవాటు...

రాత్రి ఒక సమయానికంటూ తినను. నచ్చినప్పుడు తింటా. ఒక్కోసారి చాలా ఆలస్యమవుతుంది. ఇది అంత మంచి అలవాటు కాదు. మీరు మాత్రం అలా చేయకండి. 


పాజిటివ్‌ ఆలోచనలు..

కేవలం ఆరోగ్యకరమైన ఆహారం వల్లే అందంగా ఉంటారనుకోవద్దు. పాజిటివ్‌ ఆలోచనలతో ఆనందంగా ఉండేందుకు ప్రయత్నించాలి. మనసు ఆనందంగా ఉంటే మనిషి అందంగా కనిపిస్తాడు. 



Updated Date - 2020-09-27T16:58:32+05:30 IST