Rao Ramesh: నిజమైన హీరో రావు రమేష్

ABN , First Publish Date - 2022-09-19T21:13:12+05:30 IST

చాలామంది నటీనటుల దగ్గర కొంతమంది స్టాఫ్ సంవత్సరాల తరబడి చాలకాలం నుంచి పని చేస్తూ ఉంటారు..

Rao Ramesh: నిజమైన హీరో రావు రమేష్

చాలామంది నటీనటుల దగ్గర కొంతమంది స్టాఫ్ సంవత్సరాల తరబడి చాలకాలం నుంచి పని చేస్తూ ఉంటారు. ఆ స్టాఫ్ కుటుంబం ఆపదలో ఉన్నప్పుడు కొందరు నటులు వాళ్లని మామూలుగా ఆదుకుంటారు, కొందరు అయితే అస్సలు పట్టించుకోరు. ఇందుకు భిన్నంగా.. క్యారెక్టర్, వైవిధ్య పాత్రలు చేసే నటుడు రావు రమేష్ (Rao Ramesh) మొత్తం తెలుగు సినిమా పరిశ్రమ అబ్బుర పడే విధంగా తన మేకప్ మేన్ (Makeup man) కుటుంబాన్ని ఆదుకున్నాడు. రమేష్ దగ్గర బాబు (Babu) అనే మేకప్ మేన్ గత 11 సంవత్సరాల (11 years) నుంచి పని చేస్తున్నాడు. అతను కొన్ని రోజుల క్రితం ఒక యాక్సిడెంట్ (accident)లో చనిపోయాడు. ఆ కుటుంబానికి అతనే పెద్ద దిక్కు. అతని కూతురు కూడా ఇంకా చదువుకుంటోంది.


రావు రమేష్ ఆ కుటుంబానికి సాయం చెయ్యాలనుకున్నాడు. అంతే.. పెద్ద హంగామా ఏం లేకుండా, సాదాసీదాగా ఒకరోజు మేకప్ మెన్ ఇంటికి వెళ్లి రూ.10 లక్షల చెక్ (అవును అక్షరాలా పది లక్షల రూపాయలు) ఇచ్చేసి ఇంటికి వచ్చేశాడు. ఒక రూ.50 వేలు ఇస్తేనే పేపర్స్‌లో, వెబ్‌సైట్స్‌లో వార్త రాయించుకునే ఈ సినిమా పరిశ్రమలో రావు రమేష్ లాంటి పెద్ద నటుడు పది లక్షల రూపాయల చెక్ ఇచ్చి ఏమి కానట్టు తన పని తాను చేసుకుంటూ ఉండిపోయాడు. ఆ కుటుంబం ఇంత డబ్బు ఇచ్చాడని తెలిసి మొదట షాక్ అయింది. తరువాత రావు రమేష్‌ని ప్రశంసలతో ముంచెత్తింది. వాళ్లే కాదు.. మొత్తం పరిశ్రమలో ఉన్న ఎంప్లాయిస్ అందరూ కూడా రావు రమేష్‌ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఈ  విషయం పరిశ్రమలోనూ అలాగే సాంఘిక మాధ్యమాల్లో కూడా వైరల్ అయింది. ‘‘నా దగ్గర 11 ఏళ్లు పని చేశాడు బాబు. మంచివాడు. వాళ్ల కుటుంబాన్ని ఆదుకోవాలని అనుకున్నాను. వాళ్లకి సరిపోయేట్టు ఇవ్వాలి అనుకొని ఇచ్చాను. నేను పబ్లిసిటీకి దూరం, అందుకే ఇచ్చినట్టు ఎవరికీ తెలియకూడదు అనుకున్నా’’ అన్నారు రావు రమేష్. కానీ ఆ కుటుంబం, పరిశ్రమలోని చాలామంది  రమేష్ చేసిన మేలుని వేనోళ్ల పొగుడుతున్నారు. రావు రమేష్ రియల్ లైఫ్‌లో నిజమైన హీరో అయ్యాడు. చాలామంది నటులు, నిర్మాతలు, దర్శకులు ఒకటో రెండు లక్షలు ఇస్తారు. కానీ రావు రమేష్ ఇంత పెద్ద మొత్తం ఇవ్వటం.. పరిశ్రమలోనే పెద్ద టాక్ అయింది. షాక్ అయింది.

Updated Date - 2022-09-19T21:13:12+05:30 IST