సినిమా మధ్యలో అలాంటివి వస్తే.. లేచి వెళ్లిపోతాను: Rana Daggubati

Twitter IconWatsapp IconFacebook Icon
సినిమా మధ్యలో అలాంటివి వస్తే.. లేచి వెళ్లిపోతాను: Rana Daggubati

పాన్ ఇండియా స్టార్ రానా దగ్గుబాటి (Rana Daggubati), సాయిప‌ల్లవి (Sai Pallavi) జంట‌గా వేణు ఊడుగుల (Venu Udugula) ద‌ర్శక‌త్వంలో తెరకెక్కిన చిత్రం ‘విరాట‌ప‌ర్వం’ (Virata Parvam). డి. సురేష్ బాబు (D Suresh Babu) స‌మ‌ర్పణ‌లో ఎస్‌.ఎల్‌.వి. సినిమాస్ (SLV Cinemas) ప‌తాకంపై సుధాక‌ర్ చెరుకూరి (Sudhakar Cherukuri) నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రచార కార్యక్రమాలను యమా జోరుగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా హీరో రానా దగ్గుబాటి మీడియాకు చిత్ర విశేషాలను తెలియజేశారు. ఆయన చెప్పిన ‘విరాటపర్వం’ చిత్ర విశేషాలివే.. 


‘అరణ్య’ (Aranya) నుండి ‘విరాటపర్వం’లోకి రావడం ఎలా అనిపించింది?

అడవులకూ నాకూ ఏదో అనుబంధం ఉన్నట్లుంది.(నవ్వుతూ)  గత నాలుగేళ్ళుగా అడవుల్లోనే ఎక్కువ షూటింగులు జరిగాయి. అక్కడే ఎక్కువ గడిపాను. విరాటపర్వానికి వచ్చేసరికి 90లో జరిగే కథ. దళం సభ్యులు అడవుల్లో వుండే రోజులు.. నాటి వాతావరణం.. చాలా యదార్ధంగా తీశాం. నా కెరీర్‌లో ఫస్ట్ టైమ్ ఒక గ్రేట్ లవ్ స్టోరీ చేశాను. చాలా లోతైన ప్రేమకథ. ప్రేమ కోసం ఒక వ్యక్తి ఎంత దూరం వెళ్తాడు, ఎంత త్యాగం చేస్తాడు? స్క్రిప్ట్ చదివినప్పుడే చాలా డీప్‌గా అనిపించింది. కథ చదివినప్పుడు చాలా బరువనిపించింది. ఒక లోతైన సముద్రంలో తోసేస్తే ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందో.. ఈ చిత్ర కథ చదివినప్పుడు అలాంటి డీప్ ఫీలింగ్ కలిగింది. విరాటపర్వం లాంటి కథ ఎప్పుడూ వినలేదు, అంత భారం ఎప్పుడు తీసుకోలేదు.


ఒక ఉద్యమ నేపథ్యమున్న రవన్న (Ravanna) జీవితంలోకి ప్రేమ ఎలా ప్రవేశిస్తుంది?

ఇప్పుడే కథ మొత్తం చెప్పలేం కదా (నవ్వుతూ).. రవన్న కానీ, దళం సభ్యులు కానీ, ఇంకా ఉద్యమ నాయకులు కానీ ఖచ్చితమైన లక్ష్యంతో వుంటారు. కుటుంబ, స్నేహ సంబంధాలు కన్నా సమాజమే ముఖ్యమని జీవిస్తారు. ఎలాంటి వ్యక్తిగత ఎజెండా లేకుండా వెళ్తున్న రవన్న జీవితంలోకి వెన్నెల ప్రవేశిస్తుంది. ఇక్కడే ఒక మోరల్ డైలమా వుంటుంది. ఒక లక్ష్యం కోసం పని చేయాలా? ఫ్యామిలీతో కలిసి రిలాక్స్ అవ్వాలా? అనేది ఒక మోరల్ డైలమా. ఈ సినిమా మోరల్ డైలమా గురించి వుంటుంది.

సినిమా మధ్యలో అలాంటివి వస్తే.. లేచి వెళ్లిపోతాను: Rana Daggubati

ఈ సినిమా చేసిన తర్వాత నక్సల్స్ మీద మీకు ఎలాంటి అభిప్రాయం ఏర్పడింది?

టైం ని రీ క్రియేట్ చేయడం సినిమా వలనే సాధ్యం. నక్సల్ మూమెంట్ గురించి టీవీల్లో, న్యూస్ పేపర్స్‌లో వచ్చిన  కొన్ని హైలెట్స్ మాత్రమే తెలుసు. కానీ వాళ్ళు రియల్‌గా ఎలా వుంటారు? యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులు కూడా నక్సల్స్‌గా ఎందుకు మారారు? ఇలాంటి వివరాల్లోకి వెళ్ళలేదు. రవన్న కథలో మాటల రూపంలో ఇలాంటి వివరాలు కొన్ని తెలుస్తాయి. కొన్ని సంఘటనలు, పొలిటికల్ డ్రామా నడుస్తుంటుంది. కానీ ఈ కథలో ప్రధాన సారాంశం మాత్రం ప్రేమ.


రవన్న పాత్రకు స్ఫూర్తి ఉందా?

రవన్న పాత్ర యదార్ధ పాత్ర కాదు. మేము డిజైన్ చేశాం. చేగువేరా లాంటి నాయకుల స్ఫూర్తి రవన్న పాత్రలో కనిపిస్తుంది. రవన్న ఒక డాక్టర్. కానీ అప్పుడున్న పరిస్థితులు రవన్నని కవిగా, తర్వాత ఉద్యమ నాయకుడిగా మారుస్తాయి.


‘విరాటపర్వం’ టైటిల్ జస్టిఫికేషన్ ఏంటి?

‘మహాభారతం’లో విరాటపర్వం అనేది అజ్ఞాతవాసానికి సంబంధించిన కథ. విరాటపర్వంలో కూడా ఇలాంటి అజ్ఞాతపోరాటం ఉంటుంది.


ఒక నక్సల్‌గా అదే సమయంలో ప్రేమికుడిగా కనిపిస్తున్నారు కదా.. ఆ రెండు పాత్రలని ఎలా బ్యాలెన్స్ చేశారు?

సరదాగా పాటలు పాడుకునే ప్రేమ కాదిది. రవన్న పాత్ర చాలా ఇంటెన్స్‌గా వుంటుంది. బలమైన ఎమోషన్స్ వుంటాయి. ఇందాక చెప్పినట్లు సినిమా అంతా మోరల్ డైలమా వుంటుంది. 


మీకు పాన్ ఇండియా రీచ్ వుంది కదా.. ఈ సినిమాని ఎందుకు పాన్ ఇండియాగా ప్లాన్ చేయలేదు?

ఇప్పుడంతా పాన్ ఇండియా అంటున్నారు కానీ నేను పదేళ్ళుగా ఆ పాన్‌లోనే ఆమ్లెట్లు వేసుకుంటున్నాను(నవ్వుతూ). కొన్ని కథలు తెలుగులోనే చేయాలి. విరాటపర్వం మొదలు పెట్టినప్పుడే మాకు పాన్ ఇండియా ఆలోచన లేదు. ఇది ఒక ప్రాంతానికి సంబంధించిన కథ. ఆ ప్రాంతం తాలూకు సాహిత్యం ఎక్కువగా వుంది. దర్శకుడు వేణు ఊడుగుల స్వతహాగా సాహిత్యకారుడు. ఈ సాహిత్యం మరో భాషలో కుదరకపోవచ్చు. అందుకే పాన్ ఇండియా ఆలోచన పెట్టుకోలేదు. అయితే మలయాళం, బెంగాళీ, హిందీలో డబ్ చేస్తున్నాం.


సాయిపల్లవితో పాటు మిగతా నటీనటుల ప్రాధాన్యత ఈ సినిమాలో ఎలా వుంటుంది?

రవన్న, వెన్నెల కాకుండా ఈ సినిమాలో కనిపించే దాదాపు అన్ని పాత్రలకు ప్రాధాన్యత వుంది. ప్రధాన పాత్రలే కాకుండా మిగతా పాత్రలు చెప్పిన డైలాగ్స్, ఆలోచనలతో కూడా కథ వేగంగా ముందుకు వెళుతుంది. జరీనా వాహెబ్, ప్రియమణి, ఈశ్వరీ రావు, నందితా దాస్.. ఈ పాత్రలన్నీ బలంగా వుంటాయి. ఇది మహిళా చిత్రం. స్క్రీనింగ్ చూసిన తర్వాత అబ్బాయిలంతా వావ్ అంటే.. మహిళా ప్రేక్షకులు కంటతడి పెట్టుకొని అద్భుతమని చెబుతున్నారు.


మీ సినిమాలకి చాలా గ్యాప్ వస్తుంది కదా?

చాలా త్వరగా సినిమాలు చేసేవాడిని. మధ్యలో చిన్న హెల్త్ ఇష్యూ వచ్చింది. అయితే నేను వచ్చి షూటింగ్ మొదలుపెట్టిన తర్వాత పాండమిక్ వచ్చింది. ఇది సెట్‌లో తీసే సినిమా కాదు. పరిస్థితులు సర్దుకున్నాక మళ్ళీ అడవిలోనే షూట్ ఫినిష్ చేశాం. విడుదల తేది విషయానికి వస్తే.. మంచి డేట్ కోసం ఎదురుచూశాం. రెండు మూడు వారాలు మనకీ ఉన్నపుడు వస్తే బావుంటుందని అనుకున్నాం. జూన్ 17న వస్తున్నాం. దీని తర్వాత రెండు వారాల వరకూ ఎలాంటి సినిమా లేదు. ప్రేక్షకులంతా హాయిగా ఈ సినిమాని ఎంజాయ్ చేయొచ్చు. 


రవన్న పాత్రలో వుండే సవాళ్లు ఏంటి?

చాలా ఇంటెన్సిటీ వున్న పాత్ర. ఇంత బలమైన పొయిట్రీ రాసే వాళ్ళు ఎలా మాట్లాడతారు, వాళ్ళలో ఎంత డెప్త్ వుంటుంది.. అని దర్శకుడు వేణుగారు, నేను చర్చించుకునేవాళ్ళం.


సాయిపల్లవి గురించి?

సాయిపల్లవి గొప్ప నటి. విరాటపర్వంలో వెన్నెల పాత్రలో మరో స్థాయిలో వుంటుంది. ఇది వెన్నెల కథని ట్రైలర్‌లో చెప్పాం. రవన్న పాత్రని మరొకరు చేస్తారో లేదో తెలీదు కానీ వెన్నెల పాత్రని సాయిపల్లవి తప్పితే మరొకరు చేయలేరు. సాయిపల్లవి చాలా సింపుల్ పర్శన్. ఆ సింప్లీసిటీ వల్లే ఇంత అద్భుతమైన నటన కనుబరుస్తుందని భావిస్తున్నా.

సినిమా మధ్యలో అలాంటివి వస్తే.. లేచి వెళ్లిపోతాను: Rana Daggubati

ఇంత సీరియస్ టోన్‌లో లైవ్ స్టోరీ కనెక్ట్ అవుతుందని భావిస్తున్నారా?

కొన్ని కథలకి కమర్షియల్ టోన్ కావాలి. మరి కొన్ని కథలకు సీరియస్ టోన్ కావాలి. విరాటపర్వం చూసి చప్పట్లు కొడతారో లేదో తెలియదు కానీ .. ఇది నిజమే కదా అని మాత్రం భయపడతారు. అంత నిజాయితీ గల కథ ఇది.


విరాటపర్వం లాంటి కథ ఇప్పుడు రావడం ప్రజంట్ ట్రెండ్‌కి సరైనదేనా?

విరాటపర్వంకి ఇదే సరైన సమయం. మన ప్రపంచాన్ని వదిలేసి వేరే ప్రపంచంలో నాన్ స్టాప్‌గా ఉండగలిగితే అదే సినిమా ఎక్స్‌పీరియన్స్. విరాటపర్వం అలాంటి ఎక్స్‌పీరియన్స్ ఉన్న సినిమా. సినిమా చాలా కొత్తగా వుంటుంది. ఒక ప్రేమ కథ రిలాక్స్‌గా, హ్యాపీగా వెళ్తుంటుంది. కానీ ఇది భయం భయంగా వెళ్తుంది. ఈ వైవిధ్యం చాలా కొత్తగా వుంటుంది.


కెమెరా మ్యాన్స్ గురించి చెప్పండి?

డానీ, దివాకర్ మణి అనే ఇద్దరు డివోపీ‌గా పని చేశారు. డానీ సినిమాని చాలా కొత్తగా చూపించారు. ట్రైలర్ చూస్తే విజువల్ రిచ్‌నెస్ అర్థమౌతుంది. షాట్స్ చాలా వివరంగా వుంటాయి. దివాకర్ మణి కూడా గ్రేట్ విజువల్స్ ఇచ్చారు.


నటుడిగా అద్భుతం అనిపించుకున్నారు.. సోలో హీరోగా కమర్షియల్ సక్సెస్ గురించి ఆలోచిస్తుంటారా?

నేను హీరో అవ్వాలంటే.. నేను కొట్టే విలన్ ఎవరో కనిపించలేదు. ఇది మొదటి సమస్య(నవ్వుతూ). ఒక కథని చెప్పాలంటే హీరోగానే ఉండాల్సిన అవసరం లేదు. ప్రేక్షకులకు కొత్తదనం చూపించాలనేది నా కోరిక. ఇప్పుడు నా నుండి రాబోతున్న సినిమాలు హీరోయిజం ఉండేవే. చాలా కొత్తగా వుంటాయి. ‘హిరణ్యకశ్యప’ (hiranya kashyapa) చేస్తున్నా. దాని కంటే పెద్ద కమర్షియల్ సినిమా వుండదు. నా వరకూ అది కమర్షియల్.  కథ సీరియస్‌గా జరుగుతున్నపుడు సడన్‌గా డ్యాన్స్ వేస్తే నేను బయటికి వెళ్ళిపోతా. ఇవి నాకు ఎక్కవు. అలాగే హీరోయిన్‌ని టీజింగ్ చేసినా.. ఇబ్బందిగా వుంటుంది. ఇలాంటివి నచ్చవు. మనం టెంపరరీ. సినిమాలు శాశ్వతం. చాలా మంది గొప్పనటులు వదిలేసిన గొప్ప విషయాలనే గుర్తుపెట్టుకుంటాం. అలా గొప్పగా గుర్తుపెట్టుకునే వర్క్ చేయాలని వుంది.


మీకు ఏ జోనర్ ఇష్టం?

అన్ని జోనర్స్ ఇష్టం. అయితే చేసిన జోనర్, పాత్ర మళ్ళీ మళ్ళీ చేయకూడదు. 


విరాటపర్వానికి ఒక నిర్మాతగా వున్నారు కదా..  ఫుల్ టైం నిర్మాతగా కొనసాగుతారా?

నిజాయితీ గల సినిమాలు చేయాలనే ఆలోచన వుంది. ‘బొమ్మలాట, కేరాఫ్ కంచరపాలెం, చార్లీ..’ ఇప్పుడు విరాట విరాటపర్వంకు నిర్మాతగా నా పేరు కనిపిస్తుంది.  అమరచిత్ర కథపై వర్క్ జరుగుతుంది.


రానా నాయుడు గురించి?

నేను, వెంకటేష్ గారు చేసిన వెబ్ సీరిస్. క్రైమ్ అండ్ ఫ్యామిలీ డ్రామాగా వుంటుంది.


పాన్ ఇండియా సీన్‌లోకి రావడం వలన కథల ఎంపిక కష్టమైందా?

పాన్ ఇండియా అనేది కథే చెప్పాలి. పాన్ ఇండియా సినిమా తీయాలని నిర్ణయించుకుని తీస్తే అది వర్కవుట్ కాకపోవచ్చు. కథే నిర్ణయించాలి.


మీ బ్రదర్ సినిమా ఎక్కడి వరకూ వచ్చింది?

అది ఫైనల్ స్టేజ్‌కి వచ్చింది. ఇంకా చూడలేదు.


రీసెంట్‌గా నచ్చిన సినిమా?

కమల్ హాసన్‌గారి ‘విక్రమ్’ చాలా నచ్చింది.


‘విరాటపర్వం’ ప్రివ్యూలు వేశారు కదా.. ఎలాంటి స్పందన వచ్చింది?

చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా చూసిన అందరూ వండర్ ఫుల్ అంటున్నారు. విరాటపర్వంలో మొదటిసారి ఓ పాట పాడాను.

AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.