పవిత్ర లోకేశ్‌పై రమ్య దాడి

ABN , First Publish Date - 2022-07-04T07:20:32+05:30 IST

టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు నరేశ్‌, ఆయన భార్య రమ్య రఘుపతి వ్యవహారంలో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. నరేశ్‌, నటి పవిత్ర లోకేష్‌తో మైసూరులోని ఓ హోటల్‌లో ఉండగా...

పవిత్ర లోకేశ్‌పై రమ్య దాడి

మైసూరులో ఘటన

టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు నరేశ్‌, ఆయన భార్య రమ్య రఘుపతి వ్యవహారంలో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. నరేశ్‌, నటి పవిత్ర లోకేష్‌తో మైసూరులోని ఓ హోటల్‌లో ఉండగా ఆదివారం ఉదయం అక్కడకు చేరుకున్న రమ్య వారితో గొడవకు దిగారు. ఆగ్రహంతో పవిత్ర లోకేష్‌పై చెప్పుతో దాడికి యత్నించారు. రమ్య లాడ్జి వద్దకు చేరుకోగానే పవిత్ర పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు.. హోటల్‌కు చేరుకుని, గది నుంచి నరేశ్‌, పవిత్రను బయటకు తీసుకొచ్చారు. ఈ సమయంలోనే పవిత్రపై రమ్య చెప్పుతో దాడికి యత్నించారు. ‘కన్నడిగురాలివై ఉండి నాకు అన్యాయం చేస్తావా’ అంటూ దూషించారు. ఈ సందర్భంగా పలువురు పవిత్ర, నరేశ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నరేశ్‌ విజిల్‌ వేస్తూ ‘లవ్‌ యూ పీపుల్‌’ అంటూ వ్యాఖ్యలుచేశారు. ఫ్రాడ్‌.. ఫ్రాడ్‌.. అంటూ రమ్యను ఉద్దేశించి అన్నారు. ఈలోగా నరేశ్‌, పవిత్ర బయటకు వచ్చి, మరో ప్రాంతానికి వెళ్లిపోయారు. అనంతరం రమ్య మాట్లాడుతూ.. హిందూ సంప్రదాయంలో నరేశ్‌ను పెళ్లి చేసుకున్నాననీ, విడిపోయే ఆలోచన లేదన్నారు. జరుగుతున్న వ్యవహారంతో తన కుమారుడు బాధపడుతున్నాడని తెలిపారు. నరేశ్‌, పవిత్రను వదిలేది లేదని, తానెందుకు విడాకులు ఇవ్వాలని ప్రశ్నించారు. తన వ్యక్తిత్వాన్ని కించపరిచి, మర్యాద లేకుండా చేసి విడాకులు కోరాల్సిన అవసరం నరేశ్‌కు ఏం ఉందన్నారు. కర్ణాటక ప్రజలు తన వెంట ఉన్నారన్నారు. మరోవైపు.. పవిత్ర లోకేష్‌ ఓ కన్నడ చానల్‌పై పోలీసులకు ఫిర్యాదుచేశారు. కొన్నిరోజులుగా ఓ చానల్‌ వారు తన వెంట పడుతున్నారనీ, నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతాలతో అనుచితంగా వ్యవహరిస్తున్నారని, మానసికంగా ఇబ్బంది పెడుతున్నారంటూ శనివారం రాత్రి మైసూరులోని వీవీ పురం పోలీసులకు ఆమె ఫిర్యాదుచేశారు.


పవిత్రలోకేశ్‌... ఇప్పటికీ నా భార్యే!

ఈ నేపథ్యంలో పవిత్రలోకేశ్‌ భర్త సుచింద్ర ప్రసాద్‌ తొలిసారి స్పందించారు. పవిత్ర ఇప్పటికీ తన భార్యే అని ఆయన స్పష్టం చేశారు. ‘‘పదహారేళ్ల పరిపూర్ణ దాంపత్యం మాది. 1955 హిందూ వివాహ చట్టం ప్రకారమే దంపతులు అయ్యాం. అందుకు తగిన ఆధారాలన్నీ నా దగ్గర ఉన్నాయి. మేమిద్దరం కళాకారులమే. కలిసి నటించాం. ప్రేమించి పెళ్లి చేసుకొన్నాం. మా దాంపత్యం సాఫీగానే సాగింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. తనపై ఇప్పటికీ గౌరవం ఉంది. తన గురించి నేనెక్కడ ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు. ఒకవేళ నా తీరుకు తను నొచ్చుకొని ఉంటే బహిరంగ క్షమాపణ కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. నరేశ్‌ ఎవరో కూడా నాకు తెలీదు. ఆయన్నెప్పుడూ కలవలేదు’’ అన్నారు.  

బెంగళూరు (ఆంధ్రజ్యోతి)  



Updated Date - 2022-07-04T07:20:32+05:30 IST