రమేష్ బాబు హీరోగా అరంగేట్రం వెనుక ఎంత కథ నడిచిందంటే..!

ABN , First Publish Date - 2022-01-09T04:46:10+05:30 IST

బాల నటుడిగా కొన్ని సినిమాలు చేసిన తర్వాత తన 23వ ఏట హీరోగా మళ్లీ కెమెరా ముందుకు వచ్చారు రమేష్ బాబు. అక్కినేని వారసుడు నాగార్జున, రామానాయుడి తనయుడు వెంకటేష్. ఎన్టీఆర్ తమ్ముడు త్రివిక్రమ రావు కుమారుడు కళ్యాణ్ చక్రవర్తి.. హీరోలుగా పరిచయం అయిన..

రమేష్ బాబు హీరోగా అరంగేట్రం వెనుక ఎంత కథ నడిచిందంటే..!

బాల నటుడిగా కొన్ని సినిమాలు చేసిన తర్వాత తన 23వ ఏట హీరోగా మళ్లీ కెమెరా ముందుకు వచ్చారు రమేష్ బాబు. అక్కినేని వారసుడు నాగార్జున, రామానాయుడి తనయుడు వెంకటేష్. ఎన్టీఆర్ తమ్ముడు త్రివిక్రమ రావు కుమారుడు కళ్యాణ్ చక్రవర్తి.. హీరోలుగా పరిచయం అయిన నేపథ్యంలో హీరో కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ కూడా హీరోగా ఎంటర్ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.  ఆ సమయంలో ఎన్టీఆర్, కృష్ణ మధ్య మాటలు లేవు. అందుకే ఏయన్నార్‌ను ఈ చిత్ర ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు కృష్ణ. 1986 ఆగస్టు 29న ఏవిఎమ్ స్టూడియోలో భారీ ఎత్తున ప్రారంభమైన ఈ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణతో సినిమాలు తీసే నిర్మాతలు తక్కువ సంఖ్యలో హాజరయ్యారు. బాలకృష్ణకు పోటీగా తన కొడుకును కృష్ణ రంగంలోకి దించినట్లు ప్రచారం జరగడం దీనికి ఒక కారణం.


హీరోగా రమేష్ బాబును పరిచయం చేసే ముందు అన్ని జాగ్రత్తలు తీసుకొన్నారు కృష్ణ. డైలాగ్స్ విషయంలో శిక్షణ ఇప్పించడమే కాకుండా డాన్సులు, ఫైట్స్‌లో నిపుణులతో ట్రైనింగ్ ఇప్పించారు. కథ విషయంలో కాంప్రమైజ్ కాకుండా హిందీలో హిట్ అయిన బేతాబ్ హక్కులు కొన్నారు. పరుచూరి బ్రదర్స్‌తో మాటలు రాయించారు. బాలీవుడ్ నుంచి బప్పిలహరిని పిలిపించి పాటలు రికార్డ్ చేయించారు. తనతో ఎన్నో చిత్రాలకు పనిచేసిన టాప్ కెమెరామన్ విఎస్ఆర్ స్వామిని నియమించారు. బాలీవుడ్ భామ సోనమ్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. ఇలా ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కాకుండా ‘సామ్రాట్’ చిత్రానికి భారీగా ఖర్చు పెట్టారు కృష్ణ.


ఈ చిత్రానికి మొదట కన్నడ దర్శకుడు రాజేంద్ర సింగ్ బాబును డైరెక్టర్‌గా ఎన్నుకొన్నారు. ఆయనతో ఓ షెడ్యూల్ కూడా చేశారు. డబ్బు మంచి నీళ్లలా ఖర్చు అవుతున్నా వర్క్ సరిగ్గా జరగకపోవడంతో ఆయనని తీసేసి విక్టరీ మధుసూదనరావును దర్శకుడిగా నియమించారు. ఆయనే చిత్రాన్ని పూర్తి చేశారు. ‘సామ్రాట్’ టైటిల్‌తో వివాదం నడిచింది. ఆ సమయంలోనే బాలకృష్ణ నటిస్తున్న చిత్రానికి కూడా సామ్రాట్ అని పేరు పెట్టారు. ఇరు వర్గాలు రాజీకి రాకపోవడంతో టైటిల్ కోసం చివరికి కోర్టుకు వెళ్లారు కూడా. ఫైనల్‌గా రమేష్ బాబుకే సామ్రాట్ టైటిల్ దక్కింది. బాలకృష్ణ సినిమా పేరును సాహస సామ్రాట్‌గా మార్చుకున్నారు. సామ్రాట్ చిత్రం ఘన విజయం సాధించి హీరోగా రమేష్ కు మంచి పేరు తెచ్చినా కెరీర్ మీద శ్రద్ధ పెట్టక పోవడంతో తక్కువ కాలంలోనే ఆయన తెరమరుగయ్యారు.

- వినాయకరావు

Updated Date - 2022-01-09T04:46:10+05:30 IST