Ram Gopal Varma: పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్‌పై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు.. బాలీవుడ్‌కి నచ్చలేదంటూ..

ABN , First Publish Date - 2022-09-04T15:29:37+05:30 IST

వివాదం అంటే మొదట గుర్తొచ్చే పేరు రామ్ ‌గోపాల్ వర్మ(Ram Gopal Varma). ఏ విషయం మీదైనా ఎటువంటి..

Ram Gopal Varma: పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్‌పై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు.. బాలీవుడ్‌కి నచ్చలేదంటూ..

వివాదం అంటే మొదట గుర్తొచ్చే పేరు రామ్ ‌గోపాల్ వర్మ(Ram Gopal Varma). ఏ విషయం మీదైనా ఎటువంటి బెరుకు లేకుండా స్పందిస్తూ ఉంటాడు. దాంతో పలుమార్లు విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు. అయినా అవేమి పట్టించుకోకుండా తన దారి తనదే అన్నట్లు వెళ్లిపోతుంటాడు. అందుకే ఆయనకి ఓవైపు డైహార్ట్ ఫ్యాన్స్  ఉండగా.. అదే సమయంలో విమర్శించే వాళ్లు కూడా ఉంటారు. ఈ దర్శకుడు తాజాగా ఈ ఏడాదిలో అత్యధిక కలెక్షన్లు సాధించి బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’పై సంచలన వ్యాఖ్యలు చేశాడు.


పశ్రాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ (Yash) హీరోగా నటించిన చిత్రం ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2(KGF Chapter 2)’. 2018 వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘కేజీఎఫ్ ఛాప్టర్ 1’కి సీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. కొన్ని నెలల క్రితం పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ మూవీ రూ.1200 కోట్లకి పైగా కలెక్షన్లు కొల్లగొట్టింది. కాగా.. ఈ సినిమాపై మొదటి నుంచి రామ్‌గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో సైతం ఈ చిత్రంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. అదే సమయంలో వివేక్ అగ్నిహోత్రి ‘ది కాశ్మీర్ ఫైల్స్‌’పై కూడా కామెంట్స్ చేశాడు.


ఆర్జీవీ మాట్లాడుతూ.. ‘కెజీఎఫ్ 2, ది కాశ్మీరీ ఫైల్స్ చిత్రాలు బాలీవుడ్‌లోని అన్ని లెక్కలను మార్చేశాయి. ఆ చిత్రాలు రెండు విభిన్న కథలు.. విభిన్న ధృవాలు అయినా మంచి ఆదరణ పొందాయి. నిజం చెప్పాలంటే.. బాలీవుడ్‌లో ఎవరికీ కేజీఎఫ్ 2 నచ్చలేదు. నీకు నచ్చని సినిమా మంచి వసూళ్లు సాధించినప్పుడు.. మేకర్స్ ఎలాంటి సినిమా చేయాలో తెలియని కన్‌ఫ్యూజన్‌లో పడిపోతారు. బాలీవుడ్ ప్రస్తుతం అదే పరిస్థితుల్లో ఉంది. 


బాలీవుడ్‌లోని ఓ పెద్ద దర్శకుడు నాతో కేజీఎఫ్ గురించి మాట్లాడాడు. ఆయన రాము నేను ఐదుసార్లు సినిమా చూడటానికి ప్రయత్నించాను.. కానీ అరగంటకు మించి మూవీని చూడలేకపోయాను. ఎలా హిట్ అయ్యిందో అర్థం కాట్లేదని చెప్పాడు’ అని చెప్పుకొచ్చాడు. కాగా.. అదే సమయంలో షాహిద్ కపూర్, కరణ్ జోహార్ వంటి బాలీవుడ్ ప్రముఖులు ఈ సినిమాని ఈ సంవత్సరంలోనే బిగ్గెస్ట్ హిట్ అని అభివర్ణించారు.

Updated Date - 2022-09-04T15:29:37+05:30 IST