Ram Gopal Varma: ఆర్ఆర్ఆర్, కేజీయఫ్ 2 కంటే కార్తీకేయ 2 గొప్ప సినిమా.. వర్మ ఇంట్రస్టింగ్ కామెంట్స్

ABN , First Publish Date - 2022-08-21T18:19:13+05:30 IST

వివాదం అంటే సినీ ఇండస్ట్రీలో మొదట గుర్తొచ్చే పేరు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma). ఈ క్రేజీ డైరెక్టర్ ఏ విషయం..

Ram Gopal Varma: ఆర్ఆర్ఆర్, కేజీయఫ్ 2 కంటే కార్తీకేయ 2 గొప్ప సినిమా.. వర్మ ఇంట్రస్టింగ్ కామెంట్స్

వివాదం అంటే సినీ ఇండస్ట్రీలో మొదట గుర్తొచ్చే పేరు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma). ఈ క్రేజీ డైరెక్టర్ ఏ విషయం గురించైనా ఎటువంటి మొహమాటం లేకుండా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడుతుంటాడనే విషయం తెలిసిందే. అలాగే.. కొన్నిసార్లు రాజకీయ అంశాలతో పాటు ఎక్కువగా సినిమాలపై ఆయన ట్వీట్లు చేస్తుంటారు. ఈ ఏడాది బాలీవుడ్‌కి బ్యాడ్‌టైమ్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు అక్కడ చాలా సినిమాలు రిలీజ్ అవ్వగా.. మూడు మాత్రమే ప్రేక్షకాదరణ పొందాయి. ముఖ్యంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన పెద్ద స్టార్ల సినిమాలు మినిమం కలెక్షన్లని కూడా సాధించలేక చతికిలాపడ్డాయి. అదే సమయంలో ‘ఆర్ఆర్ఆర్(RRR)’, ‘కేజీఎఫ్ 2(KGF 2)’.. తాజాగా ‘కార్తీకేయ 2 (Karthikeya 2)’ హిందీ బెల్టులో వసూళ్ల సునామీని సృష్టించాయి.


ఈ పరిణామంపై ఇప్పటికే పలుమార్లు వర్మ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. బాలీవుడ్ సినిమాలపై విమర్శలు చేశాడు. తాజాగా ఆగస్టు 12న విడుదలైన ‘కార్తీకేయ 2’ అక్కడి స్టార్ల సినిమాలను వెనక్కి నెట్టి మంచి కలెక్షన్లని సాధిస్తోంది. నిఖిల్ హీరోగా నటించిన ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహించాడు. ఈ మూవీపై తాజాగా వర్మ స్పందిస్తూ ఓ ట్వీట్ చేశాడు.


వర్మ చేసిన ట్వీట్‌లో.. ‘నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటించగా అభిషేక్ నిర్మించిన చిత్రం కార్తికేయ 2. ఈ మూవీ విడుదలై రెండో వారంలో కూడా మంచి కలెక్షన్లని సాధిస్తోంది. ముఖ్యంగా.. హిందీ బెల్ట్‌లో ఆమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా, అక్షయ్ కుమార్ నటించిన రక్షాబంధన్ సినిమాలకంటే రెండు రెట్లు ఎక్కువగా వసూళ్లు సాధిస్తోంది. పెట్టుబడి మీద వచ్చిన ఆదాయం పరంగా పోల్చితే ఎస్ఎస్ రాజమౌళి సినిమా ఆర్ఆర్ఆర్, ప్రశాంత్ నీల్ సినిమా కేజీయఫ్ 2 కంటే కార్తీకేయ 2నే గొప్ప చిత్రం. చందు మొండేటికి కంగ్రాట్స్’ అని రాసుకొచ్చాడు. 


మొదట తక్కువ థియేటర్స్‌లో విడుదలైన ‘కార్తీకేయ 2’ హిట్ టాక్ రావడం.. ఆమీర్, అక్షయ్ సినిమాలు ఫ్లాప్‌గా తేలడంతో ఈ సినిమాకి థియేటర్స్ పెరుగుతూ వచ్చాయి. విడుదలై దాదాపు పది రోజులు కావొస్తున్న ఈ సినిమా ఇప్పటికి హౌస్‌ఫుల్ కలెక్షన్లతో రన్ అవుతోంది. దాదాపు రూ.30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటి వరకూ ప్రపంచవ్యాప్తంగా రూ.60 కోట్లకి పైగా కలెక్షన్లని సాధించింది. దీంతో పలువురు బాలీవుడ్ ప్రముఖులు సైతం ఈ మూవీ టీంకి కంగ్రాట్స్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు.



Updated Date - 2022-08-21T18:19:13+05:30 IST