Krishnam Raju Demise: టాలీవుడ్ స్టార్స్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన రామ్‌గోపాల్ వర్మ

ABN , First Publish Date - 2022-09-12T17:11:15+05:30 IST

వివాదాలు అంటే మొదట గుర్తొచ్చే పేరు రామ్‌గోపాల్ వర్మ (Ram Gopal Varma). ‘శివ’ సినిమాతో టాలీవుడ్ గతిని మార్చేసిన ఈ దర్శకుడికి..

Krishnam Raju Demise: టాలీవుడ్ స్టార్స్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన రామ్‌గోపాల్ వర్మ

వివాదాలు అంటే మొదట గుర్తొచ్చే పేరు రామ్‌గోపాల్ వర్మ (Ram Gopal Varma). ‘శివ’ సినిమాతో టాలీవుడ్ గతిని మార్చేసిన ఈ దర్శకుడికి గతకొంతకాలంగా బ్యాడ్ ఫేజ్ నడుస్తోంది. ఆయన చేసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్‌గా నిలుస్తోంది. అయితే.. ఈ దర్శకుడు సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటూ దేశవ్యాప్తంగా జరిగిన పలు అంశాలపై స్పందిస్తూ ఉంటాడనే విషయం తెలిసిందే.. వాటి కారణంగా.. చాలా వరకు విమర్శల పాలవుతుంటాడు. అయినప్పటికీ వెనక్కి తగ్గకుండా తనదైన శైలిలో రెస్పాండ్ అవుతూనే ఉంటాడు. తాజాగా కృష్ణంరాజు (Krishnam Raju) మృతిపై వర్మ స్పందిస్తూ.. టాలీవుడ్ స్టార్స్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. 


టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు (Krishnam raju) సెప్టెంబర్ 11న అనారోగ్య కారణాలతో మృతి చెందారు. ఆయన ఆకస్మిక మరణం తెలుగు చిత్ర పరిశ్రమని దిగ్భ్రాంతికి గురిచేసింది. 1966లో ‘చిలక గోరింకా’ చిత్రంతో తెరంగేట్రం చేసిన కృష్ణంరాజు 56 ఏళ్ల కెరీర్‌లో 180కి పైగా మూవీస్‌లో ప్రేక్షకుల్ని మెప్పించారు. ఆయన మరణం విషయం తెలిసిన పలువురు టాలీవుడ్ ప్రముఖలంతా తమ సంతాపాన్ని తెలియజేశారు. దీనిపై సోషల్ మీడియా వేదికగా వర్మ స్పందించాడు.


వర్మ చేసిన ట్వీట్‌లో.. ‘భక్త కన్నప్ప, కటకటాల రుద్రయ్య, బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్ర పాపారాయుడు లాంటి  అత్యంత  గొప్ప చిత్రాలని  అందించిన మహా నటుడు, గొప్ప నిర్మాత కోసం ఒక్క రోజు కూడా షూటింగ్ ఆపలేని అత్యంత స్వార్ధపూరిత తెలుగు సినిమా పరిశ్రమ కి నా జోహార్లు. సిగ్గు! సిగ్గు!.


కృష్ణగారికి, మురళీమోహన్ గారికి, చిరంజీవిగారికి, మోహన్‌బాబుగారికి, బాలయ్యకి, ప్రభాస్ కి, మహేష్, కల్యాణ్‌కి నేను ఈ విషయం మీద మనవి చేసేదేంటంటే  రేపు ఇదే దుస్థితి మీలో ఎవరికీ  కూడా తప్పదు. ఒక మహోన్నత  కళాకారుడికి ఇవ్వలేని మహోన్నత  వీడ్కోలు మన మీద మనమే ఉమ్మేసుకోవడం లాంటిది.


మనసు లేకపోయినా ఓకే. కనీసం మన చావుకి విలువ  ఉండాలంటే పోయిన కృష్ణంరాజుగారి లాంటి  పెద్దమనిషికి విలువ ఇద్దాం .. కనీసం రెండు రోజులు షూటింగ్ ఆపుదాం. డబ్బు ఎక్కువ ఖర్చు అయిపోతోంది అని నెలరోజులు షూటింగ్ ఆపేసిన పరిశ్రమ మనది. 


మన చావుకి విలువ  ఉండాలంటే పోయిన కృష్ణంరాజుగారి లాంటి  పెద్దమనిషికి విలువ ఇద్దాం .. కనీసం రెండు రోజులు షూటింగ్ ఆపుదాం’ అని వరుసగా ట్వీట్స్ చేశాడు. అంతేకాకుండా.. ఆ పోస్టుకి టాలీవుడ్ టాప్ స్టార్స్‌ని ట్యాగ్ కూడా చేశాడు.


కాగా.. వర్మ చేసిన ట్వీట్స్ ప్రస్తుతం వైరల్‌గా మారాయి. తెలుగు సినీ పరిశ్రమపైనే ఈ రేంజ్‌లో వర్మ విరుచుకుపడటానికి కారణం ఏంటా అని అందరూ అనుమానపడుతున్నారు. దాంతో.. వర్మ కామెంట్స్‌ను కొందరు సమర్థిస్తుండగా.. మరికొందరు విమర్శిస్తున్నారు.









Updated Date - 2022-09-12T17:11:15+05:30 IST