ఆ వివాదాన్ని మైండ్‌లోంచి డిలీట్‌ చేశా!: రకుల్

ABN , First Publish Date - 2021-02-28T08:33:55+05:30 IST

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌... బహు భాషా కథానాయిక! తనను తాను కొత్తగా ఆవిష్కరించుకోవాలని తపించే నటి. ప్రస్తుతం చేస్తున్న చిత్రాలు, వ్యక్తిగత జీవితం గురించి రకుల్‌ చెప్పిన విశేషాలు ఆమె మాటల్లోనే!

ఆ వివాదాన్ని మైండ్‌లోంచి డిలీట్‌ చేశా!: రకుల్

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌... బహు భాషా కథానాయిక! తనను తాను కొత్తగా ఆవిష్కరించుకోవాలని తపించే నటి. ప్రస్తుతం చేస్తున్న చిత్రాలు, వ్యక్తిగత జీవితం గురించి రకుల్‌ చెప్పిన విశేషాలు ఆమె మాటల్లోనే!


నేను ఆలోచించేది అదే!

నాతోనే నాకు పోటీ. గత చిత్రానికి, ప్రస్తుత చిత్రానికి అభినయం పరంగా నేనో మెట్టు పైకి ఎక్కాలి. నా మనసులో ఎల్లప్పుడూ ఆ ఆలోచనే ఉంటుంది. చంద్రశేఖర్‌ యేలేటిగారు ‘చెక్‌’ కథ చెప్పే  ముందు ‘రెగ్యులర్‌ హీరోయిన్‌ రోల్‌ కాదు. మీకు ఎక్కువ మేకప్‌ ఉండదు. సాంగ్స్‌ ఉండవు’ అన్నారు. ‘ఏం పర్లేదు. పాత్ర బావుంటే చేస్తాన’ని చెప్పా. ‘చెక్‌’లో నా పాత్రకు వస్తే... క్రిమినల్‌ లాయర్‌. కానీ, జైలు-ఖైదీలు అంటే భయపడుతుంది. ఆ భయాన్ని దాటి ఉరిశిక్ష పడ్డ ఖైదీ కేసు వాదిస్తుంది. ఆ ట్రాన్స్‌ఫర్మేషన్‌ నచ్చింది. అందుకే, సినిమా చేశా. అంతకు మించి ఆలోచించలేదు. ఇవాళ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్‌ మీడియాలో జైలులో ఓ ఖైదీపై అరిచే సన్నివేశం, క్లైమాక్స్‌ గురించి పోస్టులు పెడుతుంటే... చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం ప్రేక్షకుల ధోరణి మారింది. అందుకే, ఎప్పుడూ కొత్తగా ప్రయత్నిస్తూ ఉండాలి. లేదంటే ప్రేక్షకులకు బోర్‌ కొడుతుంది.


ప్రయోగాలు చేయాలనుంది!

ఐదేళ్ల క్రితం చేసిన పాత్రలు, ఆ తరహా చిత్రాలే మళ్లీ ఇప్పుడు చేస్తే నటిగా నేను పైకి ఎదగలేను. ఒకే తరహా చిత్రాలకు మాత్రమే పరిమితం అవుతా. పాత్రల పరంగా ప్రయోగాలు చేయాలనుంది. ప్రతిరోజూ ‘ఈ రోజు కొత్తగా చేస్తున్నా’ అనే ఫీలింగ్‌తో సెట్‌కి వెళ్లాలని అనుకుంటాను. ‘మే డే’లో పైలట్‌గా అభినయానికి ఆస్కారమున్న పాత్ర చేస్తున్నా. అర్జున్‌ కపూర్‌ ‘సర్దార్‌ కా గ్రాండ్‌సన్‌’లో దక్షిణాది అమ్మాయి రాధ పాత్రలో నటించా. అది మేలో విడుదల అవుతుంది. ఆయుష్మాన్‌ ఖురానా ‘డాక్టర్‌ జి’లో నాది గైనకాలజిస్ట్‌ పాత్ర. ‘థాంక్‌ గాడ్‌’లో పాత్ర కూడా వైవిధ్యమైనదే. తెలుగులో వైష్ణవ్‌ తేజ్‌కు జంటగా క్రిష్‌ దర్శకత్వంలో పక్కా పల్లెటూరి అమ్మాయిగా నటించా. ఇవన్నీ నాకు ప్రయోగాలు చేసే అవకాశం ఇచ్చాయి. తమిళంలో శివ కార్తికేయన్‌తో ‘అలయాన్‌’ అని ఓ చిత్రం చేశా. ఈ ఏడాదే విడుదలవుతుంది.


కరోనా తర్వాత...

లాక్‌డౌన్‌ తర్వాత సెట్స్‌కు వెళ్లడానికి కొంచెం భయపడ్డా. అయితే, ‘మే డే’ చిత్రీకరణలో నేను కరోనా బారినపడ్డా. మామూలుగా ఆహారం, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉంటాను కనుక ఎక్కువ మందులు వాడాల్సిన అవసరం రాలేదు. క్వారంటైన్‌లో ఉన్నప్పుడు మొదటి నాలుగు రోజులు నిద్రపోయా. ఐదో రోజు నుంచి యోగా, ప్రాణాయామ, బ్రీతింగ్‌ వర్కవుట్స్‌ చేశా. పన్నెండు రోజుల్లో కోలుకున్నా. పదమూడో రోజు చిత్రీకరణకు వెళ్లా. అయితే, కరోనా నుంచి కోలుకున్నాక... వర్కవుట్స్‌ చేసినప్పుడు బాడీ పెయిన్స్‌ వచ్చాయి. కరోనా నేపథ్యంలో అందరూ బాధ్యతగా ఉండాలి. ముఖ్యంగా ఇంట్లో సీనియర్‌ సిటిజన్స్‌ ఉంటే! బయటకు వెళ్లేటప్పుడు మాస్క్‌ ధరించండి. ఇంకొకటి బ్యాగులో పెట్టుకోండి. మనం జాగ్రత్తలు తీసుకోవాలి.


పేరులో ప్రీత్‌ లేకపోతే?

హిందీ సినిమా ‘సర్దార్‌ కా గ్రాండ్‌సన్‌’ ప్రమోషనల్‌ సాంగ్‌ ఇటీవలే చేశాం. దానికి సినిమాటోగ్రాఫర్‌, నా సిబ్బందీ తెలుగువాళ్లే. షూట్‌లో వాళ్లతో తెలుగులో మాట్లాడుతుంటే... ‘నీ పేరులో ప్రీత్‌ సింగ్‌ లేదంటే, నువ్వు తెలుగమ్మాయి అనుకుంటారు’ అన్నారు హీరో అర్జున్‌ కపూర్‌. నేనిప్పుడు పంజాబీ కంటే ఎక్కువగా తెలుగమ్మాయి అయిపోయా. తెలుగువాళ్లు ఎవరైనా కనిపిస్తే... తెలుగులో మాట్లాడుతున్నా.


దాన్ని మైండ్‌లోంచి డిలీట్‌ చేశా!

చిన్నతనం నుంచి ఆరోగ్యం, ఆహారం, వ్యాయామం విషయాల్లో నేనెంతో జాగ్రత్తగా ఉంటున్నా. అటువంటి నాకు ఓ జర్క్‌ వచ్చింది. ఆ వివాదం (రియా చక్రవర్తి కేసులో తన పేరు రావడాన్ని ఉద్దేశిస్తూ...) వచ్చిన మరుసటి రోజు నా తల్లితండ్రులు నా దగ్గరకు వచ్చి అండగా ఉన్నారు. నా సన్నిహితులకూ నేనేంటో తెలుసు. వాళ్లూ నాకు మద్దతుగా నిలిచారు. ఇక, ఆ వివాదం గురించి నేనెక్కువ మాట్లాడాలని అనుకోవడం లేదు.  దాన్ని మైండ్‌లోంచి డిలీట్‌ చేసేశాను. జీవితంలో వివాదాలు వచ్చినప్పుడు పని మీద మాత్రమే దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నా. నా పనే మాట్లాడుతుంది. అంతే!         


ప్రస్తుతం ప్రేక్షకుల ధోరణి మారింది. అందుకే, ఎప్పుడూ కొత్తగా ప్రయత్నిస్తూ ఉండాలి. లేదంటే ప్రేక్షకులకు బోర్‌ కొడుతుంది.


  చిత్రజ్యోతి డెస్క్‌

Updated Date - 2021-02-28T08:33:55+05:30 IST