Rajinikanth కండక్టర్‌గా ఉన్నప్పుడు సినిమాల్లోకి వెళ్లమని ప్రోత్సహించిన బస్ డ్రైవర్.. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే..

ABN , First Publish Date - 2021-10-29T22:10:26+05:30 IST

రజనీకాంత్.. ఒకప్పుడు శివాజీ రావు గైక్వాడ్ అనే సాధారణ బస్సు కండక్టర్. ఇప్పుడు ఇండియన్ బాక్సాఫీస్‌ని ఏలుతున్న సూపర్ స్టార్.

Rajinikanth కండక్టర్‌గా ఉన్నప్పుడు సినిమాల్లోకి వెళ్లమని ప్రోత్సహించిన బస్ డ్రైవర్.. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే..

రజనీకాంత్.. ఒకప్పుడు శివాజీ రావు గైక్వాడ్ అనే సాధారణ బస్సు కండక్టర్. ఇప్పుడు ఇండియన్ బాక్సాఫీస్‌ని ఏలుతున్న సూపర్ స్టార్. తమిళ దర్శకుడు బాలచందర్ ప్రోత్సాహంతో ఎదిగిన రజినీకాంత్..  సినీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును ఇటీవల అందుకున్నారు.ఇటీవల ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా రజినీ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. ఆ అవార్డును బాలచందర్‌తోపాటు.. తన స్నేహితుడు, బస్సు డ్రైవర్ రాజ్ బహదూర్‌కు రజినీ అంకితమిచ్చారు. రజినీ కర్ణాటక నుంచి చెన్నై వచ్చి నటుడిగా మారడం వెనుక రాజ్ బహదూర్ ప్రోత్సాహం ఎంతో ఉంది. అందుకే ఎంత ఎత్తుకి ఎదిగినా రజినీ తన స్నేహాన్ని విడవలేదు. వీలు కుదిరినప్పుడల్లా రాజ్ బహుదూర్ ఇంట్లో రజినీ ప్రత్యక్షమవుతూ ఉంటారు. 


`మా స్నేహానికి 50 ఏళ్లు పూర్తయ్యాయి. నేను 1970లో రజినీకాంత్‌ను కలిశాను. నేను డ్రైవర్‌గా, ఆయన కండక్టర్‌గా జాయిన్ అయ్యాం. మా గ్రూప్‌లో రజినీ గొప్ప నటుడు. మా డిపార్ట్‌మెంట్‌లో కల్చరల్ ప్రోగ్రామ్ అంటే వేదికపై రజినీ నటించాల్సిందే. అతను అద్భుత నటుడు. చెన్నై వెళ్లి యాక్టింగ్ స్కూళ్లో జాయిన్ అవమని నేనే అతడిని బలవంతపెట్టాను. అక్కడ కోర్సు పూర్తయ్యాక స్కూల్ నిర్వాహకులు ఓ కార్యక్రమం నిర్వహించారు. దానికి బాలచందర్ ముఖ్య అతిథిగా వచ్చారు. అక్కడ రజినీ నటన చూసిన బాలచందర్.. `తమిళ్ నేర్చుకోమ`ని సూచించారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఆ విషయం నాకు రజినీ చెప్పారు. అ రోజు నుంచి నాతో తమిళ్‌లోనే మాట్లాడమని రజినీకి చెప్పాన`ని బహుదూర్ తెలిపారు. 


రాజ్ బహుదూర్ తనకు చేసిన సహాయం గురించి రజినీ ఎన్నోసార్లు చెప్పారు. అప్పట్లో బహుదూర్ జీతం నెలకు రూ.400 అట. రజినీ చెన్నై వెళ్లి యాక్టింగ్ స్కూళ్లో జాయిన్ అయినపుడు బహుదూర్ నెలకు రూ.200 పంపేవారట. మిగతా సగం జీతంతోనే తన కుటుంబాన్ని నడిపేవారట. అందుకే సూపర్‌స్టార్‌గా ఎదిగిన తర్వాత కూడా రజినీ.. బహుదూర్‌ స్నేహాన్ని విడువలేదు. అప్పుడప్పుడు రజినీ నేరుగా బహుదూర్ ఇంటికి వెళ్లి తలుపు కొట్టి షాకిచ్చేవారట. స్నేహితుడితో సరదాగా సమయం గడిపేవారట. అందుకే రజినీ కోసం బహుదూర్ ఇంట్లో ప్రత్యేకంగా ఓ గది ఉండేదట. రజినీ వచ్చినపుడు స్నేహితులిద్దరూ ఆ గదిలో కూర్చుని గంటలు గంటలు మాట్లాడుకునేవారట. అనంతరం కిందనే పరుపులు వేసుకుని నిద్రపోయేవారట. పదవీ విరమణ చేసిన తర్వాత బహుదూర్ ప్రస్తుతం తన సోదరుడి కుటుంబంతో కలిసి ఉంటున్నారు. 




Updated Date - 2021-10-29T22:10:26+05:30 IST