RajaSekhar: నన్ను బతికించింది సినిమా కోసమే!

ABN , First Publish Date - 2022-05-06T05:23:29+05:30 IST

వంకాయలపాటి మురళీక్రిష్ణ సమర్పణలో పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ పతాకాలపై డా. రాజ‌శేఖ‌ర్ హీరోగా ప్రకాష్ రాజ్, ఆత్మీయ రాజన్, జార్జ్ రెడ్డి ఫేమ్ ముస్కాన్, అభినవ్ గోమఠం, కన్నడ కిషోర్, సమీర్

RajaSekhar: నన్ను బతికించింది సినిమా కోసమే!

వంకాయలపాటి మురళీక్రిష్ణ సమర్పణలో పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ పతాకాలపై డా. రాజ‌శేఖ‌ర్ (Dr. Rajasekhar) హీరోగా ప్రకాష్ రాజ్, ఆత్మీయ రాజన్, జార్జ్ రెడ్డి ఫేమ్ ముస్కాన్, అభినవ్ గోమఠం, కన్నడ కిషోర్, సమీర్, భరణి శంకర్, రవి వర్మ, శ్రవణ్ రాఘవేంద్ర నటీనటులుగా జీవితా రాజశేఖర్ (Jeevitha Rajasekhar) దర్శక‌త్వంలో బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘శేఖర్’ (Shekar). ఈ చిత్రాన్ని వెంకట సాయి ఫిల్మ్ బ్యానర్‌లో ముత్యాల రాందాస్ ఇండియా వైడ్‌గా విడుదల చేస్తుండగా.. నిర్వాణ సినిమాస్ సృజన ఎరబోలు ఓవర్సీస్‌లో విడుదల చేస్తున్నారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ చిత్రంలోని పాటలను విడుదల చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 20న గ్రాండ్‌గా విడుదల కాబోతోన్న సందర్భంగా.. చిత్ర యూనిట్ హైదరాబాద్‌లోని ఏ.యం.బి (AMB) మాల్‌లో పాత్రికేయుల సమావేశం నిర్వహించి.. చిత్ర ట్రైలర్‌ను విడుదల చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన యంగ్ హీరో అడవి శేష్ (Adivi Sesh) చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. దర్శకుడు పవన్ సాదినేని, నటి ఈషా రెబ్బా (Eesha Rebba) అతిథులుగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 


ట్రైలర్ విడుదల అనంతరం హీరో అడవి శేష్ మాట్లాడుతూ.. ‘‘శేఖర్ సినిమా ట్రైలర్ చాలా బాగుంది. రాజశేఖర్ గారంటే నాకు చాలా ఇష్టం. తను చేసిన ‘మగాడు’ చిత్రం నాకు ఆల్ టైం ఫేవరేట్ సినిమా. మంచి కంటెంట్‌తో వస్తున్న ఈ సినిమా తనకు, తన టీమ్‌కు గొప్ప పేరు తీసుకురావాలని కోరుతున్నాను. మే 20న వస్తున్న ఈ సినిమా అందరికీ గొప్ప విజయం అందించాలి..’’ అని అన్నారు.


జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ.. ‘‘వాళ్ల సినిమా పనుల్లో ఎంతో బిజీగా ఉన్నా మా ట్రైలర్ లాంచ్‌కి వచ్చిన అడవి శేష్‌కు ధన్యవాదాలు. అలాగే మాకెంతో సపోర్ట్ చేసిన మా నిర్మాతలకు ధన్యవాదాలు. ఈ సినిమాని ఫ్యామిలీలా అంతా కలిసి చేశాము. సినిమానే ఆశ, శ్వాశగా జీవిస్తున్నాము. సినిమా తప్ప మాకు ఏమీ తెలియదు. ఇందులోనే మేము చాలా పోగొట్టుకున్నాం. ఇంతకుముందు నేను చేసిన సినిమాల కంటే ఈ సినిమాకు ఎక్కువ టెన్షన్ పెట్టింది. ఎందుకంటే ఈ సినిమాకు దర్శకురాలిగా కూడా పనిచేశాను. ఉమెన్స్ ఎక్కువగా వర్క్ చేసినా కూడా ఎక్కువ మంది ఎంకరేజ్ చేయరు. ప్రస్తుతం ప్రేక్షకులు ఓటీటీలకు అలవాటు పడ్డారు. భారీ బడ్జెట్ సినిమాలను మాత్రమే చూస్తారు అని చాలా మంది చెప్పారు. అయితే ఇప్పుడు మేము తీసిన ఈ సినిమా ఫ్యామిలీ అందరికి కచ్చితంగా నచ్చుతుంది. ఇంతకు ముందు వచ్చిన రాజశేఖర్‌గారి ‘అక్క మొగుడు, సింహరాశి, గోరింటాకు’.. వంటి సినిమాలు ప్రేక్షకులను ఏవిధంగా అలరించాయో.. ఈ ‘శేఖర్’ సినిమా కూడా అంతే ఎమోషన్స్‌తో ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఎమోషనల్ అవుతారు. ఈ సినిమా కోసం అందరూ ఎంతో కష్టపడి, ఇష్టంగా చేశారు. వారందరికీ ధన్యవాదాలు. మే 20న ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా సినిమాను అందరూ ఆదరించి ఆశీర్వదించాలని కోరుతున్నాను..’’ అని తెలిపారు.


హీరో రాజశేఖర్ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు నేను కోవిడ్ వల్ల సిక్ అయ్యి చాలా సీరియస్‌ స్టేజ్‌కి వెళ్లి.. మళ్లీ మీ అందరి ప్రేమ వల్ల బతికి బయటపడ్డాను. అభిమానులు, శ్రేయోభిలాషులు.. అందరి ప్రార్థనలు నన్ను బతికించింది ఈ సినిమా కోసమే. ఈ సినిమాని మేమంతా ప్రాణం పెట్టి తీశాము. ముందు ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్నాం.. కానీ కొన్ని పరిస్థితుల వలన కుదరలేదు. ఇన్ని రోజులకి కుదిరింది. మే 20న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాము. మేము ప్రేక్షకులకు చెప్పేది ఒకటే.. థియేటర్‌కి వచ్చి సినిమా చూసిన వారు బాగుంది అంటేనే మా సినిమా చూడండి అని చెబుతున్నాము. ఎందుకంటే మాకు ఈ సినిమాపై అంత నమ్మకం ఉంది. మేము పడిన కష్టం ఎలా ఉందో అనేది మీరంతా సినిమా చూస్తే తెలుస్తుంది’’ అన్నారు.

Updated Date - 2022-05-06T05:23:29+05:30 IST