దేశవ్యాప్తంగా సినీ లవర్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూసిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ పలు వాయిదాల తర్వాత ఎట్టకేలకు మార్చి 25న విడుదలైంది. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ హీరోలు రామ్చరణ్, ఎన్టీఆర్ నటించిన ఈ మూవీ విడుదలైన మొదటి రోజే మంచి టాక్ని సొంతం చేసుకుంది. అంతేకాకుండా ఇప్పటి వరకున్న ఎన్నో రికార్డులను ఈ సినిమా బద్దలు కొట్టింది. అయితే తాజాగా ఈ మూవీ గురించి ఓ ఇంట్రస్టింగ్ విషయం ఒకటి సోషల్ మీడియాలో ప్రస్తుతం చక్కర్లు కొడుతోంది.
ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్స్ మాత్రమే కాకుండా అలియా భట్, అజయ్ దేవ్గణ్ వంటి బాలీవుడ్ నటులు, ఓలివియా మోరిస్, రే స్టీవేన్సన్ వంటి హలీవుడ్ తారలు సైతం నటించిన విషయం తెలిసిందే. ఈ హాలీవుడ్ తారలు ఇంగ్లిష్లో పలికే డైలాగ్స్ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ వంటి ప్రాంతీయ భాషల ప్రేక్షకులకి అంతగా అర్థం కావడం లేదు. వారు ఎంతో వేగంగా ఆ డైలాగ్స్ పలుకుతుండడం వల్ల మామూలు ప్రేక్షకులు వాటిని అందుకోలేకపోతున్నారు. దీంతో ఈ సినిమాకి ఇంగ్లిష్ సబ్టైటిల్లను జోడించాలని ఎంతోమంది థియేటర్ యాజమానులు పెద్ద సంఖ్యలో ఈ చిత్రబృందాన్ని అభ్యర్థించారట. అలా చేస్తే అందరికీ కథ ఇంకా బాగా అర్థమయ్యే అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ అభ్యర్థనలను ‘ఆర్ఆర్ఆర్’ మూవీ టీం ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటుందో చూడాలి.