Rajamouli Comments: ‘ఇది రాజమౌళి కథ కాదే’ అనిపించకూడదు

ABN , First Publish Date - 2022-09-17T01:57:42+05:30 IST

తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చూపించారు దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి. ‘బాహుబలి’తో ప్యాన్‌ ఇండియాకు తెలుగు సినిమా రుచి చూపించిన ఆయన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో ఆ స్థాయిని మరింత పెంచారు.

Rajamouli Comments: ‘ఇది రాజమౌళి కథ కాదే’ అనిపించకూడదు

తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చూపించారు దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి(Rajamouli). ‘బాహుబలి’తో ప్యాన్‌ ఇండియాకు తెలుగు సినిమా రుచి చూపించిన ఆయన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో ఆ స్థాయిని మరింత పెంచారు.  రామ్‌చరణ్‌(Ram charan), ఎన్టీఆర్‌(NTR) కథానాయకులుగా రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రం రూ.1000కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. హాలీవుడ్‌ ప్రేక్షకులు, మేకర్స్‌ సైతం రాజమౌళి పనితీరును ప్రశంసించారు. అందుకే రాజమౌళికి దేశవిదేశాల్లో అరుదైన గౌరవం దక్కుతున్నాయి. తాజాగా ఆయన టొరంటో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు (Raja mouli at torrento film festival)హాజరయ్యారు. ఆ వేదికపై ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు జక్కన్న. 


వందల నుంచి వేలకు..

‘‘బాహుబలి’కి జపాన్‌లో విశేష ఆదరణ దక్కింది. నా సెలెక్ట్‌ చేసుకునే కథలు మాతృభాషలను దాటుకుని పక్క రాష్ట్రాలకు వెళ్తాయని నమ్మేవాడిని. కానీ దేశం దాటి వెళ్తాయని, అక్కడి ప్రేక్షకులు అలరిస్తాయని ఎప్పుడూ ఊహించలేదు. బాహుబలికి అలాంటి ఆదరణ దక్కిన తర్వాత నాకు బాగా నమ్మకం కలిగింది. తూర్పు దేశాల ఆడియన్స్‌కు మన సినిమాలు నచ్చుతాయని అర్థమైంది. అయితే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ను వెస్ట్రన్‌ కంట్రీస్‌ను దృష్టిలో పెట్టుకుని చేయలేదు. అలాంటి ఆలోచన కూడా నాకు రాలేదు. స్లో పాయిజన్‌లాగా అక్కడి ఆడియన్స్‌కు కూడా నచ్చిందన్న అభిప్రాయం వచ్చింది. ఏదో కొందరికి నచ్చిందనుకున్నా. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రశంసించేవారి వారి సంఖ్య పదుల నుంచి వందలు, వందల నుంచి వేలకు చేరింది. హాలీవుడ్‌ రచయితలు, దర్శకుడు, క్రిటిక్స్‌, ప్రేక్షకులు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ గురించి ఉన్నతంగా మాట్లాడటం చూసి ఈ మాటలన్నీ నా గురించి, నా సినిమా గురించేనా? అన్న ఆశ్చర్యం కలిగింది’’ అని అన్నారు. 




నా కంటూ ఓ స్టైల్‌ ఉంది...

‘‘హాలీవుడ్‌ ప్రేక్షకులకు నా సినిమాలు నచ్చుతాయని నా థింకింగ్‌ స్టైల్‌ మార్చుకుని సినిమాలు తీస్తే సరిగ్గా వర్కవుట్‌ కాకపోవచ్చు. కథను చెప్పే విధానంలో నా శైలిని మార్చుకోను. నాకంటూ ఓ స్టైల్‌ ఉంటుంది. అదే ఫాలో అవుతా. దానిని మరింత మెరుగుపరుచుకోవడానికి కృషి చేస్తా. నా స్టైల్‌ మార్చుకుని ఇతరుల అభిరుచి కోసం చేస్తే  రెండు పడవలపై ప్రయాణం చేసినట్టు అవుతుంది. మార్పులు, చేర్పులు, అదనపు హంగులు ఎన్ని జోడించినా ఫైనల్‌గా అది నా కథ అయి ఉండాలి. సినిమా చూసిన ప్రేక్షకులకు ‘ఇది రాజమౌళి స్టోరీ కాదే’ అనిపించకూడదు. కథ చెప్పే విషయంలో చాలామంది నన్ను మార్గ నిర్దేశకుడు అంటున్నారు. నిజం చెప్పాలంటే ఇప్పుడిప్పుడే అడుగులు వేయడం ప్రారంభించా. ఇదే తరహాలో ముందుకు వెళ్లి మరిన్ని విజయాలు అందుకుంటే మీరందరూ అన్నది కరెక్ట్‌ అవుతుందేమో చూద్దాం’’ అని రాజమౌళి టొరంటో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ వేదికపై తెలిపారు. 




Updated Date - 2022-09-17T01:57:42+05:30 IST