Queen Elizabeth II ముఖ్య అతిథిగా విచ్చేసిన కమల్ హాసన్ చిత్రం ఏంటో తెలుసా?

ABN , First Publish Date - 2022-09-09T16:58:02+05:30 IST

తండ్రి మరణంతో యునైటెడ్ కింగ్‌డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్.. నార్తరన్ ఐర్లండ్‌కు తన పాతికేళ్ళ వయసులో అంటే 1952, ఫిబ్రవరి 6న మహారాణిగా లాంఛన ప్రాయంగా బాధ్యతలు చేపట్టారు. క్వీన్ ఎలిజబెత్ 2 (Queen Elizabeth II ). ఏకంగా ఆమె ఏడు దశాబ్దాల పాటు ఆమె రాణిగా పరిపాలించారు.

Queen Elizabeth II ముఖ్య అతిథిగా విచ్చేసిన కమల్ హాసన్ చిత్రం ఏంటో తెలుసా?

తండ్రి మరణంతో యునైటెడ్ కింగ్‌డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్.. నార్తరన్ ఐర్లండ్‌కు తన పాతికేళ్ళ వయసులో అంటే 1952, ఫిబ్రవరి 6న  మహారాణిగా లాంఛన ప్రాయంగా బాధ్యతలు చేపట్టారు. క్వీన్ ఎలిజబెత్ 2 (Queen Elizabeth II ). ఏకంగా ఆమె ఏడు దశాబ్దాల పాటు ఆమె రాణిగా పరిపాలించారు. గురువారం ఆమె తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆమె 70 ఏళ్ల ఏడు నెలల 3 రోజుల పాటు గ్రేట్ బ్రిటన్‌ను పాలించడం ఒక రికార్డుగా చెప్పాలి. ఇప్పటికి ఈమె భారత్‌ను మూడు సార్లు అంటే.. 1961, 1983, 1997 సంవత్సరాల్లో సందర్శించారు. అయితే 1997వ సంవత్సరం లోకనాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) కెరీర్‌లో ఒక మరపురాని మధురఘట్టం ఆవిష్కృతమైంది. ఆ ఏడాది ఆయన భారీ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘మరుదనాయగం’ (Marudanayagam) లాంచ్ అయింది. 


రాజ్ కమల్ ఇంటర్నేషనల్ (Rajkamal International) బ్యానర్ పై స్వీయదర్శకత్వంలో ఈ సినిమాను అత్యంత భారీగా నిర్మించాలనుకున్నారు కమల్ హాసన్. ప్రముఖ నవలా రచయిత్రి సుజాత (sujatha)తో కలిసి ఆరేళ్ళు కష్టపడి కమల్ ఈ సినిమా స్ర్కిప్ట్ ను రాసుకున్నారు. 1997, అక్టోబర్‌లో చెన్నైలోని యం.జీ.ఆర్ ఫిల్మ్ సిటీలో ఎంతో గ్రాండ్ గా లాంఛయింది ‘మరుదనాయగం’. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌గా క్వీన్ ఎలిజబెత్ 2 విచ్చేశారు. దాదాపు 20 నిమిషాలపాటు ఆమె సెట్లోనే ఉన్నారు. ఆమె కోసం ఓ భారీ యుద్ధ సన్నివేశం పైలెట్ వీడియో షూట్ చేసి టీజర్ గా ప్రదర్శించారు. దానికి ఏకంగా రూ. 1.5 కోట్లు ఖర్చయింది. 1997 వ సంవత్సరంలో అది చాలా పెద్ద అమౌంట్ అని చెప్పాలి. అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.  అప్పట్లో ఈ సినిమాను దాదాపు రూ. 80 కోట్ల బడ్జెట్ తో నిర్మించాలనుకున్నారు కమల్. విష్ణువర్ధన్, అమ్రిష్ పురి, నసీరుద్దీన్ షా లాంటి ప్రముఖ నటులతో  విజువల్ గ్రాండియర్ గా తీర్చిదిద్దాలనుకున్నారు. సంగీత దర్శకుడిగా ఇళయరాజా (Ialayaraja) ను ఎంపిక చేశారు. అత్యంత భారీ ఎత్తున లాంఛ్ అయిన ఈ సినిమా.. షూటింగ్ ఇంకా మొదలు కాకుండానే.. ఆగిపోవడం అభిమానుల్ని ఎంతగానో నిరాశపరిచింది. 


‘మరుదనాయగం’ చిత్రానికి నిర్మాణ భాగస్వామిగా ముందుకొచ్చిన ఓ అంతర్జాతీయ కంపెనీ .. అనూహ్యంగా వెనక్కి తగ్గడంతో సినిమా అర్ధంతరంగా ఆగిపోయింది.  1999లో ఈ సినిమాను తిరిగి పట్టాలెక్కించాలని కమల్ తెగ ట్రై చేశారు. అప్పుడు కూడా బడ్జెట్ సమస్యల వల్లనే చిత్రం సెట్స్ పైకి వెళ్ళలేకపోయింది. 18వ శతాబ్దానికి చెందిన గొప్ప యోధుడైన ముహమ్మద్ యూసఫ్ ఖాన్ జీవిత చరిత్రను ‘మరుదనాయగం’ గా తెరకెక్కిద్దామనుకొన్నారు. కానీ ఆ కల నెరవేరకపోవడంతో కమల్ ఇప్పటికీ ఆ సినిమా గురించి బాధపడుతుంటారు. అయితే ఈ సినిమా కోసం కమల్ షూట్ చేసిన పైలెట్ వీడియోలోని సన్నివేశాలపై ప్రత్యేకంగా ఇళయరాజా ఓ పాటను కంపోజ్ చేసి పాటగా విడుదల చేశారు. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. మరుదనాయగం చిత్రం సెట్స్ పైకి వెళ్ళలేకపోయినప్పటికీ..  సినిమా లాంఛింగ్ కు ‘క్వీన్ ఎలిజబెత్ 2’ ముఖ్య అతిథిగా విచ్చేశారన్న విశేషం మాత్రం ఈ సినిమాకి మిగిలింది. 



Updated Date - 2022-09-09T16:58:02+05:30 IST