Pawan kalyan: కోట్లు ఇవ్వగలడు.. కొట్లాటకైనా దిగగలడు!

ABN , First Publish Date - 2022-09-03T01:21:45+05:30 IST

గబ్బర్‌సింగ్‌’ సినిమాలో పవన్‌కల్యాణ్‌ పాత్రను ఉద్దేశించి బ్రహ్మానందం చెప్పే డైలాగ్‌ ఇది. తెరపై భారీ డైలాగ్‌లు చెప్పకపోయినా.. కొడితే బిల్డింగ్‌లు దాటుకుని విలన్‌ పడకపోయినా, పెద్దగా డాన్స్‌లు చేయకపోయినా తెరపై ఆయన కనిపిస్తే చాలు ప్రేక్షకులు పండగ చేసుకుంటారు.

Pawan kalyan: కోట్లు ఇవ్వగలడు.. కొట్లాటకైనా దిగగలడు!

గబ్బర్‌సింగ్‌’ (Gababr singh)సినిమాలో పవన్‌కల్యాణ్‌ (Pawan kalyan)పాత్రను ఉద్దేశించి బ్రహ్మానందం చెప్పే డైలాగ్‌ ఇది. తెరపై భారీ డైలాగ్‌లు చెప్పకపోయినా.. కొడితే బిల్డింగ్‌లు దాటుకుని విలన్‌ పడకపోయినా, పెద్దగా డాన్స్‌లు చేయకపోయినా తెరపై ఆయన కనిపిస్తే చాలు ప్రేక్షకులు పండగ చేసుకుంటారు. ఇక ఫ్యాన్స్‌ హడావిడికైతే హద్దే ఉండదు. పవన్‌కు భక్తులు ఉంటారని దర్శకుడు హరీష్‌ శంకర్‌ తరచూ చెబుతుంటారు. ఈశ్వరా.. పవనేశ్వరా.. దేవరా అని బండ్ల గణేష్‌ పిలుస్తాడు. ఆయన దర్శనమైతే చాలనుకుంటారు అభిమానులు. పవన్‌కు ఉన్నది ఫ్యాన్స్‌ కాదు భక్తులు అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంటుంది. 

వెనక మెగాస్టార్‌లాంటి మూలస్తంభం ఉన్నప్పటికీ సాధారణ జీవితాన్నే కొనసాగించాలనుకున్న ఓ కుర్రాడు సిని రంగంలో అడుగుపెట్టి దినదినాభివృద్ధి చెందుతూ తనకంటూ ఓ సామ్రాజ్యాన్ని ఏర్పరచుకున్నాడు. ఆయనలోని విలక్షణ వ్యక్తిత్వం.. నాయకుడిని చేసి.. అభిమానుల గుండెల్లో గుడి కట్టుకునేలా చేసింది. జయాపజయాలకు అతీతంగా ఆయనకు ఫ్యాన్‌ బేస్‌ ఉంది. సినిమా ఫ్లాప్‌ అయినా ఆయన క్రేజ్‌, మార్కెట్‌ ఏ మాత్రం తగ్గలేదు. పవన్‌ కోరుకుని సమయం కేటాయిస్తే.. కోట్లు వస్తాయి కానీ అవన్నీ వదులుకుని ప్రజలకు సేవ చేయాలనే దృఢమైన సంకల్పంతో జనసేనగా తిరుగుతున్నాడు. సామాన్యుల కష్టాలను తెలుసుకుంటున్నాడు. ప్రజల కష్టాలు తీర్చడానికి కోట్లు కూడా ఇవ్వగలడు.. కొట్లాటకైనా దిగ గల సత్తా ఉన్న నాయకుడు పవన్‌. తన రాష్ట్రానికి, దేశానికి ఏదో చేయాలనే తపనతో తిరుగుతున్నాడు. ఆ తపన రోజురోజుకీ పెరుగుతుందే తప్ప ఇంచు కూడా తగ్గడం లేదు. 


మంచితనం, మానవత్వం, దేశభక్తిని మించిన హీరోయిజం లేదనేలా.. హీరోయిజం అర్థాన్నే మార్చేశాడు. పవన్‌ గొప్ప నటుడు కాదు. అలాగని అతని డాన్స్‌లు అంతగ గొప్పగా ఉండవు. ఆ విషయాన్ని సూటిగా చెప్పగల సింప్లిసిటీ ఆయనది.  పవన్‌తో సినిమా చేయడానికి నిర్మాతలు క్యూ కడతారు. నంబర్స్‌తో కొలవలేని స్టార్‌డమ్‌ ఆయనది. పవన్‌ అడుగువేస్తే పెద్ద సైన్యమే వెనుక నడుస్తుంది. పోటీ చేసిన చోట ఓడిపోయి ఉండొచ్చు.. ఆ   ఓటమినే గెలుపునకు నాందిగా మలుచుకునే ప్రయత్నంలో ఉన్నారు. అవినీతి రహిత సమాజం కోసం ఆయన చేస్తున్న పోరాటంలో ఓటమిని తట్టుకుంటాడా? లేదా ధైర్యంగా నిలబడతాడా? అన్నది చూడడానికే ఓటమి ఎదురైంది. తట్టుకుని నిలబడి పోరాటం సాగిస్తూనే ఉన్నాడు. ఇక గెలుపు అంటారా? పవన్‌కల్యాణ్‌ ఓడిన రోజే  గెలిచాడు. ఏ అధికారం లేకపోయినా కష్టం అంటూ తన తలుపు తట్టిన వారికి అండగా ఉంటున్నాడు. ప్రభుత్వం బాధ్యతారహితంగా పేదలను పట్టించుకోకపోయినా ‘నేనున్నాను’ అంటూ సహకరిస్తున్న అసలైన లీడర్‌ పవన్‌ కల్యాణ్‌. 



 

















Updated Date - 2022-09-03T01:21:45+05:30 IST