బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్ (Karan Johar) కీలక ప్రకటన చేశాడు. కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. ‘కాఫీ విత్ కరణ్’ (Koffee With Karan) చాట్ షో ముగిసిందని తెలిపాడు. కొన్ని గంటల అనంతరం సోషల్ మీడియాలో మరో మెసేజ్ షేర్ చేశాడు. ఓటీటీ ప్లాట్‌ఫాం ‘డిస్నీ+హాట్ స్టార్’ (Disney+ Hotstar) లో ‘కాఫీ విత్ కరణ్- 7’వ సీజన్ స్ట్రీమింగ్ కాబోతుందని పేర్కొన్నాడు. ఈ షోలో ఫస్ట్ గెస్టులుగా రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh), ఆలియా భట్ (Alia Bhatt) పాల్గొనబోతున్నారని బాలీవుడ్ మీడియా తెలుపుతోంది. కరణ్ జోహార్ తెరకెక్కించిన ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ (Rocky Aur Rani Ki Prem Kahani)లో రణ్ వీర్, ఆలియా హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ప్రమోషన్లను చాట్ షోతోనే ప్రారంభింబోతున్నారని వినికిడి. సౌతిండియన్ సెలబ్రిటీలు కూడా ‘కాఫీ విత్ కరణ్- 7’ లో సందడి చేయనున్నారని తెలుస్తోంది. ‘పుష్ప: ది రైజ్’ ( Pushpa: The Rise) సినిమాతో అభిమానులను అలరించిన అల్లు అర్జున్ (Allu Arjun), రష్మిక మందన్న( Rashmika Mandanna) ఈ షోలో పాల్గొనబోతున్నారని బాలీవుడ్ మీడియా తెలుపుతోంది.
అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప’ సినిమా బాలీవుడ్‌లో భారీస్థాయిలో కలెక్షన్లను కొల్లగొట్టింది. దాదాపుగా రూ. 100కోట్ల వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాతో ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు బన్నీ, రష్మిక ఇద్దరికీ కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ‘కాఫీ విత్ కరణ్-7’ మేకర్స్ వీరిద్దరని ఈ షోకీ ఆహ్వానించారని తెలుస్తోంది. ఈ చాట్ షోలో పాల్గొంటే ‘పుష్ప: 2’ కు ప్రచారం లభిస్తుందని అల్లు అర్జున్ భావిస్తున్నాడట. ఉత్తరాది ప్రేక్షకులకు కూడా చేరువ కావొచ్చనే అభిప్రాయంలో అతడు ఉన్నాడని సమాచారం. అందువల్ల ఈ షోలో పాల్గొనేందుకు ఇప్పటికే బన్నీ అంగీకరించడని బీ టౌన్ మీడియా తెలుపుతోంది. రష్మిక మందన్న కూడా హీరోయిన్‌గా బాలీవుడ్‌కీ ఎంట్రీ ఇస్తుంది. ఆమె నటించిన చిత్రాల షూటింగ్ కూడా ముగిసింది. ‘కాఫీ విత్ కరణ్-7’లో పాల్గొంటే సినిమాల విడుదలకు ముందే కొంతైనా ప్రచారం లభిస్తుందని ఆమె భావిస్తోంది. ఫలితంగా ఆమె కూడా తన అంగీకారం తెలిపిందని బీ టౌన్ లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కరణ్ జోహార్ అంతకు ముందు ఓటీటీ ప్లాట్‌ఫాంలో ఈ షో స్ట్రీమింగ్ అవుతుందని సోషల్ మీడియాలో ఓ మెసేజ్ షేర్ చేశాడు. ‘‘ప్రతి గొప్ప కథకు ఓ మంచి ట్విస్ట్ తప్పక ఉండాలి. ‘కాఫీ విత్ కరణ్’ తిరిగి టీవీలో ప్రసారం కాదు. ఈ చాట్ షో 7వ సీజన్ ‘డిస్నీ+హాట్ స్టార్’ లో ప్రసారం కానుంది. భారత్‌కు చెందిన బడా నటీ, నటులందరు కాఫీ తాగుతూ ఈ షోలో పాల్గొనబోతున్నారు. వదంతులకు చెక్ పెట్టి లోతైన చర్చలను జరపడానికి ఈ షో సిద్ధంగా ఉంది’’ అని ట్విట్టర్‌లో కరణ్ పోస్ట్ పెట్టాడు.