Puneet Rajkumar: పునీత్‌ రాజ్‌కుమార్‌‌ను స్టార్‌ను చేసింది.. మన పూరీనే..

ABN , First Publish Date - 2021-10-29T22:16:58+05:30 IST

తెలుగులో ఇడియట్ సినిమా ఎంత సంచలనమైన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. అయితే అంతకు ముందే ఈ సినిమాను కన్నడలో అప్పు పేరుతో పునీత్ రాజ్ హీరోగా తెరకెక్కించారు. 2002 ఏప్రిల్‌లో విడుదలైన ఈ చిత్రం.. పునీత్‌ను స్టార్ హీరోను చేసిందనేది వాస్తవం.

Puneet Rajkumar: పునీత్‌ రాజ్‌కుమార్‌‌ను స్టార్‌ను చేసింది.. మన పూరీనే..

కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ కుమారుడు, అప్పు అని ముద్దుగా పిలుచుకునే పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణాన్ని కన్నడ ప్రజలు జీర్ణించుకోలేకున్నారు. పొద్దున వరకూ ఎంతో ఆరోగ్యంగా ఉన్న ఆయన.. జిమ్ చేస్తుండగా, ఒక్కసారిగా గుండెపోటుకు గురవడం రాష్ట్రంలో సంచలనం కలిగించింది. కర్ణాటకతో పాటూ మిగతా రాష్ట్రాల్లోనూ ఈ వార్త తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


ఆయన మృతిచెందారనే వార్త వినగానే.. చాలా మంది తెలుగు వారు కూడా శోక సంద్రంలో మునిగిపోయారు. ఈ సందర్భంగా తెలుగు వారితో పునీత్ రాజ్‌కుమార్‌కు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. మన టాలీవుడ్ డైరెక్టర్లు, హీరోలతో పునీత్‌కు మంచి అనుబంధం ఉంది. కన్నడలో పునీత్‌ను హీరోగా ప్రేక్షకులకు పరిచయం చేసి, సెన్సేషనల్ హిట్ అందించింది మన పూరీ జగన్నాధే కావడం విశేషం.


తెలుగులో ఇడియట్ సినిమా ఎంత సంచలనమైన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. అయితే అంతకు ముందే ఈ సినిమాను కన్నడలో అప్పు పేరుతో పునీత్ రాజ్ హీరోగా తెరకెక్కించారు. 2002 ఏప్రిల్‌లో విడుదలైన ఈ చిత్రం.. పునీత్‌ను స్టార్ హీరోను చేసిందనేది వాస్తవం. అప్పటినుంచి పునీత్‌ను అభిమానులంతా అప్పు అని ముద్దుగా పిలుచుకుంటున్నారు. అనంతరం ఇదే కథతో తెలుగులో ఇడియట్ పేరుతో తీసి.. రవితేజకు కూడా స్టార్ హోదాను ఇచ్చారు పూరీ. అటు పునీత్‌కు, ఇటు రవితేజకు ఒకే ఏడాదిలో.. పూరి జగన్నాధ్ సంచలనమైన విజయాలను అందించారు. పునీత్ రాజ్‌కుమార్‌కు రామ్‌చరణ్,  జూనియర్ ఎన్టీఆర్‌తో కూడా సన్నిహిత సంబంధం ఉంది. పునీత్ నటించిన చక్రవ్యూహ సినిమా కోసం ఎన్టీఆర్ ఓ పాటను కూడా పాడిన విషయం తెలిసిందే.


అప్పు చిత్రం తర్వాత పునీత్.. ఇక వెనక్కు తిరిగి చూసుకోలేదు. అభి, ఆకాశ్, అజయ్, అరసు, అంజనీపుత్ర తదితర చిత్రాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. ఇలా ఎన్నో విజయవంతమైన చిత్రాలతో చిన్న వయసులోనే పవర్ స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు పునీత్. అదేవిధంగా బాలనటుడిగానూ ఆయన చాలా చిత్రాల్లో నటించారు. జాతీయ స్థాయి ఉత్తమ నటుడుగా అవార్డు కూడా అందుకున్నారు. కన్నడిగులు ప్రత్యక్ష దైవంలా ఆరాధించే రాజ్‌కుమార్‌కు ఈయన మూడో కుమారుడు. మొదటి కుమారుడు శివరాజ్ కుమార్‌ కూడా కన్నడ చలన చిత్ర సీమలో సూపర్ స్టార్‌గా వెలుగొందుతున్నారు. రెండో కుమారుడు రాఘవేంద్ర రాజ్‌కుమార్.. మొదట్లో హీరోగా అనేక సినిమాల్లో నటించారు.


 ఇదిలావుండగా, పునీత్ ఇటీవల నటించిన యువరత్న సినిమా తెలుగులోనూ విడుదలై.. మంచి సినిమాగా మౌత్ టాక్‌ను సొంతం చేసుకుంది. కాగా, మరో రెండు సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. మంచి చిత్రాలను అందించడంతో పాటూ, మంచి పేరును కూడా సొంతం చేసుకున్న పునీత్.. 46 ఏళ్ల వయసులోనే హఠాన్మరణం చెందడంతో కర్నాటక రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Updated Date - 2021-10-29T22:16:58+05:30 IST