Puneeth Rajkumar: పునీత్‌, అశ్విని ప్రేమకథ.. అప్పట్లో ఎంత సంచలనమో తెలుసా..!

ABN , First Publish Date - 2021-10-30T02:41:35+05:30 IST

1976లో బాలనటుడిగా సినీ కెరియర్‌ ప్రారంభించిన పునీత్‌.. ప్రస్తుతం కన్నడ ఇండస్ట్రీలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న సూపర్‌స్టార్‌గా ఎదిగారు. 1999లో పునీత్ ప్రేమ కథ పెద్ద సంచలనాలను క్రియేట్ చేసింది.

Puneeth Rajkumar: పునీత్‌, అశ్విని ప్రేమకథ.. అప్పట్లో ఎంత సంచలనమో తెలుసా..!

కన్నడ పవర్‌ స్టార్‌ పునీత్ రాజ్‌కుమార్ శుక్రవారం గుండెపోటుతో కన్నుమూయడంతో కన్నడిగులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇచ్చే తమ అభిమాన హీరో అప్పు.. అదే కసరత్తులు చేస్తూ అకస్మాత్తుగా గుండెపోటుతో చనిపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకున్నారు. ఈ సందర్భంగా అభిమానులు పునీత్ గత స్మృతులను నెమరు వేసుకుంటున్నారు. ఎంతో ఇష్టపడి చేసుకున్న భార్యకు, గారాబంగా చూసుకున్న పిల్లలకు.. పునీత్‌ను దేవుడు చిన్న వయసులోనే దూరం చేశాడంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ప్రేమ వివాహం గురించి చర్చ జరుగుతోంది.


1976లో బాలనటుడిగా సినీ కెరియర్‌ ప్రారంభించిన పునీత్‌..  ప్రస్తుతం కన్నడ ఇండస్ట్రీలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న సూపర్‌స్టార్‌గా ఎదిగారు. 1999లో పునీత్ ప్రేమ కథ పెద్ద సంచలనాలను క్రియేట్ చేసింది. పునీత్ రాజ్‌కుమార్, అశ్విని రేవంత్‌.. ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా కలుసుకున్నారు. అలా వారి స్నేహం, చివరికి పెళ్లి వరకూ వెళ్లింది. అయితే ఈ మధ్యలో వారి ప్రేమ కథలో ఎన్నో సినిమా ట్విస్టులు చోటు చేసుకున్నాయి. పునీత్‌ ప్రపోజ్ చేసిన వెంటనే.. ఆమె అంగీకరించినా వారి పెద్దలు మాత్రం అంగీకరించలేదు. అయితే సినిమా తరహాలోనే చివరికి వారి ప్రేమను పెళ్లివరకూ తీసుకెళ్లారు. పునీత్ తల్లిదండ్రులు మాత్రం మొదటి నుంచీ కుమారుడి నిర్ణయానికే మద్దతిచ్చారు. చివరకు అశ్విని కుటుంబం కూడా అంగీకరించడంతో వారి ప్రేమ కథ సుఖాంతమైంది.


1981లో బెంగళూరులో జన్మించిన అశ్వని, పెళ్లి తర్వాత నేక సినిమాలకు కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా.. నిర్మాతగా కూడా వ్యవహరించారు. ప్రస్తుతం ఈ దంపతులకు దృతి, వందిత అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారిలో ఓ కుమార్తె అమెరికాలో ఉంటోంది. సజావుగా సాగుతున్న వీరి కుటుంబంపై ఉన్నట్టుండి విధి చిన్న చూపు చూసిందంటూ.. పునీత్ అభిమానులు బాధాతప్త హృదయంతో చర్చించుకుంటున్నారు.

Updated Date - 2021-10-30T02:41:35+05:30 IST