Tollywood: చర్చలు సఫలం.. షూటింగ్స్ షురూ!

ABN , First Publish Date - 2022-06-23T21:37:50+05:30 IST

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో రెండు రోజులుగా సినీ కార్మికుల సమ్మె జరుగుతున్న విషయం తెలిసిందే. వేతనాలు పెంచితేనే షూటింగ్స్‌కి వస్తామని కార్మికులు సమ్మెకు దిగారు. మరోవైపు సినీ కార్మికులు షూటింగ్‌లకు హాజరైతేనే వేతనాల

Tollywood: చర్చలు సఫలం.. షూటింగ్స్ షురూ!

Tollywood: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో రెండు రోజులుగా సినీ కార్మికుల సమ్మె జరుగుతున్న విషయం తెలిసిందే. వేతనాలు పెంచితేనే షూటింగ్స్‌కి వస్తామని కార్మికులు సమ్మెకు దిగారు. మరోవైపు సినీ కార్మికులు షూటింగ్‌లకు హాజరైతేనే వేతనాల పెంపు గురించి ఆలోచిస్తామని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కూడా ఖరాకండీగా ప్రకటించింది. ఇలా ఒకరిని మించి మరొకరు.. ‘తగ్గేదే లే’ అన్నట్లుగా వ్యవహరించడంతో.. దాదాపు 28కి పైగా చిత్రాల షూటింగ్స్ ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ కలగజేసుకుని.. పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో ఫిల్మ్ ఫెడరేషన్, నిర్మాతల మండలితో విడివిడిగా ఆయన చర్చలు జరిపారు. అనంతరం ఫిల్మ్ ఫెడరేషన్ ప్రతినిధులను, ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులను ఒకచోటకి చేర్చి ఆయన జరిపిన చర్చలు సఫలం అవ్వడంతో.. ఈ సమస్యకు పరిష్కారం లభించింది. 


ఈ చర్చల్లో వేతనాలు పెంచేందుకు నిర్మాతలు, షూటింగ్స్‌లో పాల్గొనేందుకు సినీ కార్మికులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కార్మికుల వేతనాల పెంపు కోసం నిర్మాత దిల్ రాజు అధ్యక్షతన ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఆధ్వర్యంలో రేపు (శుక్రవారం) జీతాల పెంపు విషయమే నిర్మాతలందరితో చర్చలు జరిపి విధివిధానాలను ప్రకటిస్తామని ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు తెలపగా.. చర్చలు సఫలం అవడంతో రేపటి నుండి (శుక్రవారం) యథావిధిగా సినిమా షూటింగ్స్ జరుగుతాయని, పెరిగిన జీతాలు రేపటి నుండే అమలులోకి వస్తాయని  ఫిల్మ్ ఫెడరేషన్ పెద్దలు ప్రకటించారు.


ఈ విషయంపై ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ మాట్లాడుతూ.. ‘‘మంత్రి తలసానిగారి చొరవతో జరిగిన సమావేశంలో అన్ని విషయాలు చర్చకు వచ్చాయి. వేతనాలు పెంచడానికి నిర్మాతలు సిద్ధమయ్యారు. రేపటి నుంచి సినిమా షూటింగ్స్ యథావిధిగా జరుగుతాయి. సినీ కార్మికులు షూటింగ్స్‌కు హాజరవుతారు. అన్ని సమస్యలను కోఆర్డినేషన్ కమిటీ ద్వారా పరిష్కారం చేసుకుంటాము. ఈ విజయానికి మీడియా కూడా ఎంతో సహకరించింది. ఈ సందర్భంగా మీడియాకు ప్రత్యేక ధన్యవాదాలు’’ అని తెలిపారు.   

Updated Date - 2022-06-23T21:37:50+05:30 IST