ఆ తెలుగు సినీ ప్రముఖుడిని గన్‌తో కాల్చినప్పుడు పైపులోంచి నీళ్లు వచ్చినట్టు గొంతులోంచి రక్తం.. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2021-11-03T21:14:51+05:30 IST

కొద్ది రోజుల క్రితం ఓ హాలీవుడ్ సినిమా షూటింగ్‌లో విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఒక నటుడు పొరపాటున గన్ పేల్చటంతో దురదృష్టవశాత్తూ ఆ మూవీ సినిమాటోగ్రఫర్ మరణించారు. అయితే, హాలీవుడ్‌లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా అనేక సార్లు షూటింగ్‌లో... ‘గన్ షూటింగ్’ విషాదాలు చోటు చేసుకున్నాయి. మన టాలీవుడ్‌లోనూ రాజశేఖర్ సినిమా షూటింగ్ సమయంలో సరదాగా పేల్చిన డమ్మీ బుల్లెట్ తీవ్ర కలకలాన్ని రేపింది...

ఆ తెలుగు సినీ ప్రముఖుడిని గన్‌తో కాల్చినప్పుడు పైపులోంచి నీళ్లు వచ్చినట్టు గొంతులోంచి రక్తం.. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే..

కొద్ది రోజుల క్రితం  ఓ హాలీవుడ్ సినిమా షూటింగ్‌లో విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఒక నటుడు పొరపాటున గన్ పేల్చటంతో దురదృష్టవశాత్తూ ఆ మూవీ సినిమాటోగ్రఫర్ మరణించారు. అయితే, హాలీవుడ్‌లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా అనేక సార్లు షూటింగ్‌లో... ‘గన్ షూటింగ్’ విషాదాలు చోటు చేసుకున్నాయి. మన టాలీవుడ్‌లోనూ రాజశేఖర్ సినిమా షూటింగ్ సమయంలో సరదాగా పేల్చిన డమ్మీ బుల్లెట్ తీవ్ర కలకలాన్ని రేపింది. గొంతు దగ్గర గురిపెట్టి ఏం కాదులే అనుకుని పేల్చితే భళ్లున రక్తం బయటకు రావడంతో అక్కడ ఉన్న వాళ్లంతా వణికిపోయారు. 1988వ సంవత్సరంలో పోకూరి బాబురావు నిర్మాణంలో డాక్టర్ రాజశేఖర్ హీరోగా రూపొందిన చిత్రం ‘నవభారతం’. ఆ సినిమా షూటింగ్ ప్రకాశం జిల్లాలో జరుగుతుండగానే ఈ ఘటన జరిగింది. ఆనాడు జరిగిన భయానక ఘటన గురించి నిర్మాత పోకూరి బాబూరావు తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.


‘‘సినిమా షూటింగ్ కోసం అందరం సిద్ధంగా ఉన్నాం. కానీ, హీరో రాజశేఖర్ ఇంకా రాలేదు. ఆయన షూటింగులకు లేటుగానే వస్తారు. ఆయన రావటం కోసం చాలా సేపు ఎదురు చూశాం. ఏ కారు అటుగా వచ్చినా అది హీరోదేనేమో అన్న ఆశతో చూస్తూ కూర్చున్నాం. రాజశేఖర్ ఎంతకూ రాకపోవటంతో మాకు కాస్త అసహనం కలుగుతోంది. ఇంతలో, పీఎల్ నారాయణ ఓ జునియర్ ఆర్టిస్ట్‌కు డమ్మీ పిస్టల్ గురి పెట్టి ‘మందు తాగిస్తావా? లేదా?’ అంటూ సరదాగా బెదిరించసాగాడు. జూనియర్ ఆర్టిస్ట్ హడలిపోతున్నాడు. అప్పుడు నేను(పోకూరి బాబురావు) కలుగజేసుకుని పిస్టల్ లాక్కున్నాను. ఎందుకయ్యా పాపం వాడిని భయపెడుతున్నావు ‘అసలు దీన్ని గురి పెట్టాల్సింది నీకు’ అంటూ పీఎల్ నారాయణ వైపు పిస్టల్‌ మళ్లించాను. ఆయన సరదాగా కాల్చు అల్లుడూ.. కాల్చు అల్లుడూ.. నీ చేతుల్లో పోవడం కంటే అదృష్టం ఏముంది అన్నాడు. నేను ఆ పిస్టల్‌ను గొంతు దగ్గర పెట్టాను. డమ్మీ పిస్టల్ అయినా ఎందుకో అనుమానం కలిగి గన్ పైకెత్తి గాల్లోకి పేల్చాను. చుప్ అంది. ఏమీ లేకుండానే వాడిని భయపెడుతున్నావా అని నేరుగా పీఎల్ నారాయణ గొంతు దగ్గర పెట్టి ట్రిగ్గర్ నొక్కాను!’’ అంటూ పోకూరి మూడు దశాబ్దాల కిందటి షాకింగ్ ఇన్సిడెంట్ గుర్తు చేసుకున్నారు.


‘‘ట్రిగ్గర్ నొక్కిన మరుక్షణం పీఎల్ నారాయణ గొంతులోంచి రక్తం ఎగజిమ్మింది. కొళాయి తిప్పగానే నీళ్లు వచ్చినట్టు ఆయన నోట్లోంచి రక్తం కారింది. నేను భయంతో వణికిపోయాను. కాళ్లూ చేతులు ఆడలేదు. యూనిట్‌లో ఉన్న వాళ్లంతా షాకయిపోయారు. ఏమవుతుందో ఏమో అన్న భయం అందరిలోనూ కనిపించింది. వామ్మో, వాయ్యో అంటూ ఆయన రెండు చేతులను గొంతుకు అడ్డం పెట్టుకున్నాడు. పీఎల్ నారాయణని ఆ స్థితిలో చూడగానే నాకు ఆయన భార్యా, పిల్లలు గుర్తుకు వచ్చారు. ఆ తరువాత నాకు నా భార్యా, పిల్లలు జ్ఞాపకం వచ్చారు. ఈరోజుతో నా జీవితం నాశనమైపోయిందని అనిపించింది. ఇంతలో హీరో రాజశేఖర్ కార్లో వచ్చి దిగారు. రాజశేఖర్ అంటూ నేను గట్టిగా పిలిచాను. ఆయన ఏమయిందని కంగారుతో అమాంతం పరుగెత్తుకుంటూ వచ్చాడు. ఇలా పిస్టల్ పెట్టి కాల్చాను అన్నాను. ఆయన వెంటనే గొంతు మీద చేయి పెట్టి రెండు, మూడు సార్లు పరీక్షించారు. ఆ తర్వాత వెంటనే ప్రాథమిక చికిత్స చేశారు. తరువాత వెంటనే ఒంగోలులోని ఆసుపత్రికి తీసుకెళ్లాలని చెప్పారు. పీఎల్ నారాయణను కార్లో ఎక్కించాం. కారు బయలుదేరబోతుండగా పీఎల్ నారాయణ ఒక్క నిమిషం అని లోగొంతుతోనే అన్నారు. అల్లుడూ నా బ్యాగ్ అక్కడ ఉంది తీసుకురా.. అన్నారు. ఇప్పుడెందుకు మామా బ్యాగ్.. తర్వాత చూసుకుందాం.. ముందు పదా అన్నాను. ఆయన ఒప్పుకోలేదు. సరేనని నేను వెళ్లి బ్యాగ్ తీసుకొచ్చాను.


కారు బయలుదేరిన వెంటనే ఆయన బ్యాగ్ ఓపెన్ చేసి అందులో ఉన్న మద్యం బాటిల్ బయటకు తీసి గటగటా తాగేయటం మొదలు పెట్టారు. నేను షాక్ అయ్యాను. బిత్తరపోయాను. మామా ఆపు మామా.. వద్దు మామా అని నేను అన్నాను. కానీ, రాజశేఖర్ ‘లెట్ హిమ్ డ్రింక్’ అన్నారు. నోట్లోంచి తాగింది కాస్తా.. గాయంలోంచి బయటకు వస్తుందేమోనని నేను భయపడ్డాను. కానీ రాజశేఖర్ మాత్రం ఏం కాదులే అని ధైర్యం చెప్పారు. దాంతో అలాగే హాస్పిటల్‌కి వెళ్లాం. ముందుగానే డాక్టర్‌కు చెప్పి ఉండటంతో మేం వెళ్లేసరికే అన్ని ఏర్పాట్లు చేశారు. వెళ్లిన వెంటనే ఎక్స్‌రే తీశారు. పరీక్షలు చేశారు. ఏం ఫర్వాలేదని చెప్పారు. డమ్మీ బుల్లెట్‌కు ఇంత జరిగిందేంటా.. అని నాకు ఇంకా అయోమయంగానే ఉంది. అదే విషయం అడిగితే.. డమ్మీ బుల్లెట్ అయినా టప్ మని సౌండ్ వస్తుంది కదా. అలా సౌండ్ రావాలంటే తీవ్రమైన ప్రెజర్‌తో అది బయటకు రావాలి. దాంట్లో పైర్, స్మోక్ కూడా వస్తుంది. ఆ డమ్మీ బుల్లెట్‌కు, గొంతుకు ఏమాత్రం గ్యాప్ లేకపోవడం వల్లే ఇలా జరిగింది. అన్నవాహికకు ఆ బుల్లెట్ తగిలి ఉంటే పది పదిహేను నిమిషాల్లో చనిపోతారు. రాజశేఖర్ రాగానే గొంతు దగ్గర చేయి పెట్టి అదే పరీక్షించారట. మొత్తానికి ఆయన ప్రాణాలతో బయటపడటంతో నేను ఊపిరి పీల్చుకున్నాను. కొద్ది గంటల తర్వాత పీఎల్ నారాయణే.. అల్లుడూ అక్కడ రూమర్స్ పెరిగిపోతాయి. వెంటనే షూటింగ్ స్పాట్‌కు వెళ్లిపోదాం అన్నారు. రెస్ట్ తీసుకోమని చెప్పినా వినలేదు. గొంతు చుట్టూ టవల్ వేసుకుని కాసేపు షూటింగ్ దగ్గర నిలబడి ఆ తర్వాత ఇంటికి వెళ్లిపోయారు. ఆ ఘటన గురించి తలచుకుంటే ఇప్పటికీ భయంకరంగానే అనిపిస్తుంది’ అని పోకూరి బాబూరావు చెప్పుకొచ్చారు.

Updated Date - 2021-11-03T21:14:51+05:30 IST