జైలు నుంచి బెయిల్‌పై ఎవరు బయటకు రావాలన్నా ఈ 15 అంశాలు పాటించాల్సిందే.. అందుకే Aryan Khan విడుదలకు అంత టైమ్..!

ABN , First Publish Date - 2021-10-30T20:30:02+05:30 IST

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ 27 రోజుల జైలు జీవితం తర్వాత ఎట్టకేలకు మన్నత్ చేరుకున్నాడు

జైలు నుంచి బెయిల్‌పై ఎవరు బయటకు రావాలన్నా ఈ 15 అంశాలు పాటించాల్సిందే.. అందుకే Aryan Khan విడుదలకు అంత టైమ్..!

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ 27 రోజుల జైలు జీవితం తర్వాత ఎట్టకేలకు మన్నత్ చేరుకున్నాడు. ఈ రోజు 11 గంటలకు జైలు నుంచి ఆర్యన్ విడుదలయ్యాడు. ఆర్యన్‌కు బెయిల్ మంజూరు చేస్తూ ముంబై హైకోర్టు గురువారమే తీర్పునిచ్చింది. అయితే ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి అయి ఆర్యన్ జైలు నుంచి బయటకు రావడానికి ఇంత సమయం పట్టింది. బెయిలు పత్రాలు సకాలంలో జైలుకు చేరకపోవడంతో ఆర్యన్ మరో రాత్రి ఆర్థర్ రోడ్డు జైలులోనే గడపవలసి వచ్చింది. నిజానికి జైలు నుంచి ఏ ఖైదీనైనా బెయిల్‌పై విడుదల చేసే ప్రక్రియ చాలా సుదీర్ఘమైనది. జైలు మాన్యువల్ ప్రకారం 15 అంశాలను పాటించిన తర్వాతే బయటకు పంపుతారు. 


1) బెయిల్ ఆర్డర్ జైలు కార్యాలయానికి చేరిన తర్వాత, లౌడ్ స్పీకర్‌లో ఖైదీ పేరును రెండుసార్లు పిలుస్తారు.

2) ఆ రోజు బెయిల్‌పై విడుదలయ్యే వ్యక్తుల సమాచారంతో జైలు ఉద్యోగి బ్యారక్‌కు వెళతాడు. అతడి వద్ద ఖైదీలందరి ఫొటోలు, వివరాలు ఉంటాయి. 

3) ఆ తరువాత, బెయిల్ లభించిన ఖైదీలను అరగంటలో జైలు సూపరింటెండెంట్ కార్యాలయం సమీపంలోని పెద్ద హాలులోకి తీసుకువెళతారు.

4)అక్కడ పీఎస్‌ఐ ర్యాంకు అధికారి వారి సమాచారాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తారు. వారి పేర్లు, వివరాలు అడుగుతారు. 

5)అక్కడ పని పూర్తయిన తర్వాత వారిని జైలు ఆఫీస్‌కు సమీపంలోని మరో గదిలోకి తీసుకువెళతారు. అక్కడ ఐదు కౌంటర్లు ఉంటాయి. 

6)అక్కడ అందరినీ కింద కూర్చోపెడతారు. ఒక్కొక్కరినీ పిలిచి అతడి ఎదురుగా బెయిల్ బాండ్‌ను పరిశీలిస్తారు. 

7)ఒక కౌంటర్‌లో ఫింగర్ ప్రింట్, మరో కౌంటర్‌లో ఐ స్కాన్, మరో కౌంటర్‌లో ఫొటో తీసుకుంటారు. 

8)నాలుగో కౌంటర్‌లో ఖైదీ వ్యక్తిగత వివరాలు, అతడి పూర్తి సమాచారాన్ని పరిశీలిస్తారు. 

9)ఐదో కౌంటర్‌లో కౌన్సిలర్ ఉంటారు. ఖైదీ అతడితో మాట్లాడాలనుకుంటే మాట్లాడవచ్చు. 

10)ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయిన తర్వాత బెయిల్ లభించిన ఖైదీలందరినీ జైలు సూపరింటెండెంట్ దగ్గరకు క్యూలో తీసుకువెళతారు. వారందరితోనూ జైలు సూపరింటెండెంట్ మాట్లాడతారు. 

11)అనంతరం రిలీజ్ ఆర్డర్‌పై ఖైదీలు సంతకాలు పెట్టాలి. ఆ ఆర్డర్ జైలు క్లర్క్ దగ్గరకు వెళుతుంది. 

12)అనంతరం జైలు క్లర్క్ బెయిల్ ఆర్డర్ చదువుతాడు. రిలీజ్ ఆర్డర్ వచ్చాక క్లర్క్, జైలర్ దాన్ని సరిచూసుకుని దానిపై తమ రిమార్క్‌లు రాస్తారు. 

13)విడుదలయ్యే ముందు ఖైదీలు తమ వస్తువులను జైలు సిబ్బంది నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే జైలు లైబ్రరీ నుంచి ఏదైనా పుస్తకం తీసుకుంటే తిరిగి ఇచ్చెయ్యాలి.

14)చివరగా గేటు వద్ద రిజిస్టర్‌లో సంతకం పెట్టాలి. 

15)అనంతరం వారందరినీ జైలు నుంచి బయటకు విడుదల చేస్తారు.  

Updated Date - 2021-10-30T20:30:02+05:30 IST