‘మా సినిమాలకు టికెట్ ధర తగ్గించాం...’ ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమ
ప్రముఖుల నోట విరివిగా వినిపిస్తున్న మాట. టాలీవుడ్లో గత నెల రోజులుగా
విడుదలవుతున్న సినిమాల ప్రచారంలో తగ్గిన టికెట్ ధరల ప్రస్తావన ప్రముఖంగా
వినిపిస్తోంది. ‘ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే మా సినిమాలు చూడొచ్చ’ని
ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు నిర్మాతలు. అయితే వారు
చెబుతున్నట్లు టికెట్ ధరలు నిజంగానే తగ్గాయా?, తగ్గితే దానికి కొలమానం
ఏమిటి? ధర తగ్గితే అన్ని వర్గాల ప్రేక్షకులు థియేటర్లకు పెద్ద సంఖ్యలో రావాలి. మరి
వస్తున్నారా అని అడిగితే ‘అవును’ అని చెప్పలేని పరిస్థితి.
తమ సినిమా విడుదలైన తొలి రోజునే మేకర్స్ భారీ అంకెలు కలిగిన కలెక్షన్ వివరాలు ప్రచారంలోకి తెస్తున్నారు. మొదటి రోజు ఇన్నికోట్లు, రెండో రోజు ఇన్ని కోట్లు అంటూ వసూళ్ల లెక్కలు చెబుతూ ఊదరగొడుతున్నారు. క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తే నిర్మాతలు చెప్పే లెక్కలకు, వసూళ్లకు చాలా తేడా కనిపిస్తోంది. గతంలో లా సినిమా చూడడానికి సగటు ప్రేక్షకుడు ఆసక్తి చూపించడం లేదని అర్థమవుతోంది.
పాఠం నేర్పిన ‘ఆచార్య’
నిర్మాణ వ్యయాన్ని బట్టి సినిమా టికెట్ ధరలను పెంచుకునే వెసులుబాటు ప్రభుత్వమే కల్పించింది. ఇటీవల విడుదలైన పాన్ ఇండియా సినిమాలకు రూ. 400-500 ధరకు టికెట్లు అమ్మారు. అయితే చిరంజీవి, రామ్‌చరణ్ నటి ంచిన ‘ఆచార్య’ చిత్రం కలెక్షన్లు మాత్రం తీవ్రంగా నిరాశపరిచాయి. కథ, కథానాల్లో దమ్ములేకపోవడం ఒక కారణం అయితే, పెరిగిన టికెట్ ధరలు ప్రేక్షకులను థియేటర్లకు రాకుండా చేశాయనే అభిప్రాయం సినీ వర్గాల్లో వినిపించింది. రిపీట్ ఆడియన్స్ సంగతి పక్కనపెడితే, రూ. 300-400 ఖర్చు పెట్టి సినిమా చూడడానికి తమ స్థోమత సరిపోక కొందరు మెగా అభిమానులు కూడా వెనుకాముందు ఆడారని చెబుతున్నారు. అయితే ‘ఆచార్య’ ప్రభావం ఆ తర్వాత విడుదలయ్యే సినిమాలపై పడింది. ఎంత పెద్ద హీరో సినిమా అయినా టికెట్ ధర తనకు అందుబాటులో లేకపోతే ప్రేక్షకుడు థియేటర్లోకి అడుగుపెట్టడనేది స్పష్టమైంది.
వ్యవహారం బెడిసికొట్టింది.
అలాగని ప్రేక్షకుల అభిరుచుల్లో అనూహ్య మార్పులు వచ్చాయనుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే టికెట్ ధర తగ్గినప్పుడు ప్రేక్షకుడు విజృంభించిన ఉత్సాహంతో థియేటర్ల బాట పడుతున్నాడు. ‘పుష్ప’, ‘భీమ్లానాయక్’, ‘అఖండ’ సినిమాలకు సాధారణ ధరతోనే టికెట్లు అమ్మారు. అయినా భారీ వసూళ్లను రాబట్టాయి. ‘కేజీఎఫ్ 2’ చిత్రానికి మంచి హైప్ ఉన్నా టికెట్ ధరలను మరీ భారీగా పెంచలేదు. ఇది ఆ సినిమాకు బాగా కలిసొచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి వసూళ్లను రాబట్టడానికి కారణమైంది. భారీ అంచనాలతో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి టికెట్ ధర పెరిగినా జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్, రాజమౌళి క్రేజ్‌తో ప్రేక్షకులు చూశారు. పెద్ద సినిమాలను చూసి కొన్ని చిన్న సినిమాలకు కూడా టికెట్ ధరలు భారీగా పెంచారు. దీంతో ప్రేక్షకుడు థియేటర్‌కు రావాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించే పరిస్థితి ఏర్పడింది.
విష్వక్సేన్ ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ సినిమాకు మంచి టాక్ వచ్చింది. కానీ దానికి తగ్గట్లు వసూళ్లు రాలేదు. కారణం పెరిగిన టికెట్ ధరలే. దాంతోపాటే విడుదలైన శ్రీ విష్ణు ‘భళా తందనాన’కు ఇదే పరిస్థితి. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగల సత్తా ఉన్న హీరోగా శ్రీ విష్ణు ఇప్పటికే నిరూపించుకున్నారు. అయినా ‘భళా తందనాన’ టికెట్ ధరను చూసి ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లడానికి ఆసక్తి చూపించలేదు. అదే వారంలో వచ్చిన ‘జయమ్మ పంచాయితీ’ డిజాస్టర్ అయింది. బుల్లితెర యాంకర్‌గా ఇంటింటికి సుపరిచితమైన సుమ ఇందులో లీడ్ రోల్ చేసినా ఫలితం దక్కలేదు.
రాజశేఖర్ హీరోగా నటించిన ‘శేఖర్’, వెంకటేశ్.. వరుణ్‌తేజ్ ‘ఎఫ్ 3’ చిత్రాల విడుదల సమయంలో టికెట్ ధరలను తగ్గించామనీ, ప్రేక్షకులు కుటుంబాలతో థియేటర్స్‌కు వచ్చి తమ సినిమాను చూడాలని మేకర్స్ పదే పదే కోరారు. అయితే వారూహించిన స్థాయిలో థియేటర్లు నిండిపోలేదు. ఇప్పుడు అడివిశేష్ ‘మేజర్’ నిర్మాతలు కూడా టికెట్ ధరలను తగ్గించినట్లు ప్రకటించారు. దీనిని బట్టి ఒక్కటి అర్థమవుతోంది. సినిమా బడ్జెట్ పెరిగినా, తగ్గినా ప్రేక్షకుడికి అనవసరం. తనకు మాత్రం సినిమా టికెట్ ధర అందుబాటులో ఉండాలి. లేకపోతే ఓటీటీలో, టీవీలో చూడడానికి ఫిక్స్ అయిపోతున్నాడు.
టికెట్ ధరలు బాగా తగ్గించామని చెబుతున్న పరిస్థితుల్లో కూడా నలుగురున్న కుటుంబం సింగిల్ స్ర్కీన్ థియేటర్లో సినిమా చూసినా రూ. వెయ్యిదాకా ఖర్చు అవుతుంది. అదే మల్టీప్లెక్స్‌ల్లో అయితే రూ. 1500 దాకా అవుతోంది. ఈ ధరలను యువత అంతగా పట్టించుకోకపోవచ్చు కానీ కుటుంబ ప్రేక్షకులు మాత్రం తమకు ఇది పెద్ద మొత్తమే అంటున్నారు. ఇప్పటికే కరోనా కారణంగా ఓటీటీలకు అలవాటు పడిన మధ్యతరగతి ప్రేక్షకులు ఇప్పుడున్న పరిస్థితుల్లో థియేటర్లకు కదిలేలా లేరు. సినిమా బాగుందని చెవులు చిల్లులుపడేలా ప్రచారం చేసినా అంత మొత్తంలో ఖర్చు చేయడం ఇష్టం లేక ఓటీటీ విడుదల కోసం వేచి చూస్తున్నారు. సినిమాలో ఎంత సత్తా ఉన్నా అన్ని వర్గాలకు అందుబాటులో ఉండేలా టికెట్ ధర నిర్ణయిస్తేనే ఫలితం. లేదంటే టాక్‌తో సంబంధం లేకుండా వసూళ్లు దెబ్బతినడం ఖాయం!
పెరిగింది ఎంత? తగ్గింది ఎంత?
టికెట్ ధరలు తగ్గాక సింగిల్ స్ర్కీన్లలో రూ. 150 నుంచి రూ. 200 దాకా విక్రయిస్తున్నారు. కరోనాకు ముందు చిన్న సినిమాలు, మీడియం రేంజ్ సినిమాలకు సింగిల్ స్ర్కీన్లలో రూ. 100 వరకూ టికెట్ ధర ఉండేది. ఇప్పుడది దాదాపు రెట్టింపైంది. మల్టీప్లెక్స్‌ల్లో ఇది మరింత పెరిగింది. రూ. 250 నుంచి రూ. 300 వరకూ అమ్ముతున్నారు. ఇలా రూ. 300 అమ్ముతుంటే ధర ఎక్కడ తగ్గిందో ప్రేక్షకుడికి అర్థం కావడం లేదు. కరోనాకు ముందుతో పోల్చితే ఇప్పుడు టికెట్ ధర దాదాపు రెట్టింపు అయింది. పాన్ ఇండియా సినిమాలతో పోలుస్తూ చిన్న, మీడియం సినిమాల నిర్మాతలు తమ సినిమా టికెట్ ధరలు తగ్గించామని చెబుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ’