‘మనలో ఒకడు’ అవుతున్న Prakash Raj ?

ABN , First Publish Date - 2022-07-18T15:31:47+05:30 IST

ఏ పాత్రనైనా అవలీలగా పోషించే సత్తా కలిగిన నటుడు ప్రకాశ్ రాజ్ (Prakash Raj) అని అందరికీ తెలిసిందే. పాత్ర స్వభావాన్ని ఆకళింపు చేసుకొని.. ఇట్టే ఆ పాత్రలోకి ఒదిగిపోవడం ఆయన టాలెంట్. ఆయన కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన పాత్రలు చేశారు.

‘మనలో ఒకడు’ అవుతున్న Prakash Raj ?

ఏ పాత్రనైనా అవలీలగా పోషించే సత్తా కలిగిన నటుడు ప్రకాశ్ రాజ్ (Prakash Raj). పాత్ర స్వభావాన్ని ఆకళింపు చేసుకొని.. ఇట్టే ఆ పాత్రలోకి ఒదిగిపోవడం ఆయన టాలెంట్. ఆయన కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన పాత్రలు చేశారు. ఇంకా కొత్తదనం కోసం ప్రాకులాడుతున్నారు. ఇక ఆయనలో ఒక సామాజిక వేత్త, నిర్మాత, దర్శకుడు కూడా ఉన్నారు. మంచి కథ దొరికితే, తానే ప్రధాన పాత్రలో తన దర్శకత్వంలోనే చిత్రాలు తీయడం ఆయనకు అలవాటైన పనే. ‘ధోనీ (Dhoni), ఉలవచారు బిర్యానీ (Ulavacharu Biryani), మనవూరి రామాయణం (Manavuri Ramayanam)’ లాంటి సినిమాలు ఆయనలోని చక్కటి దర్శకుడ్ని వెలికితీశాయి. ఈ క్రమంలో ఆయన దర్శకత్వంలో మరో సినిమా కూడా తెరకెక్కబోతోందని టాక్. సినిమాకి ‘మనలో ఒకడు’ (Manalo Okadu) అనే టైటిల్ నిర్ణయించారు.  ఇంతకు ముందు సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ (RP Patnayak) తనే నటిస్తూ.. ఇదే టైటిల్ తో ఓ సినిమా తెరకెక్కించారు. కానీ అది ఆశించిన రీతిలో ఆడలేదు. 


ఒక మరాఠీ నాటకం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఈ సినిమాకి నిర్మాత కూడా ప్రకాశ్ రాజే. ఏడాదిగా ఆయన ఈ స్ర్కిప్ట్ పై కసరత్తులు చేస్తున్నారు. ఇందులో ప్రకాష్ రాజ్ కీలకపాత్ర చేస్తున్నారు. సమాజంలో హెచ్చుతగ్గుల్ని, అసమానతల్ని ఈ సినిమాతో ప్రశ్నించబోతున్నారని, ఇదో రాజకీయ వ్యంగ్యాస్త్రం అని సమాచారం. ఈ సినిమాకి ఇళయరాజా (Ilayaraja) సంగీతం అందించబోతున్నట్టు టాక్. ఇప్పటి వరకూ ప్రకాశ్ రాజ్ దర్శకత్వం వహించిన చిత్రాలన్నిటికీ ఇళయరాజానే సంగీతం అందించిన సంగతి తెలిసిందే. 


అతి త్వరలో ‘మనలో ఒకడు’ చిత్రం సెట్స్ పైకి వెళ్ళబోతోంది. కొంతకాలంగా చాలా సెలెక్టివ్‌గా మాత్రమే నటిస్తున్నారు ప్రకాశ్ రాజ్. అలాంటి సినిమానే ‘రంగమార్తండ’ (Rangamarthanda). ఆ సినిమాకి ప్రకాశ్ రాజ్ తప్ప వేరే ఆప్షన్ లేరని కృష్ణవంశీ (Krishnavamshi) భావించడం వల్లనే ఆ సినిమాలో ప్రకాశ్ రాజ్ నటిస్తున్నారని తెలుస్తోంది. నిజానికి ఈ సినిమాకి కూడా ప్రకాశ్ రాజే దర్శకత్వం వహించాలి. చివరి నిమిషంలో కృష్ణవంశీ ఆ బాధ్యత తీసుకున్నారు. అందుకే ఈ సినిమా అవగానే.. తన దర్శకత్వంలో ‘మనలో ఒకడు’ రూపొందించేందుకు ప్రకాశ్‌రాజ్ రెడీ అవుతున్నారు. 

Updated Date - 2022-07-18T15:31:47+05:30 IST