పులి జెండా నీడలో పోరాడు

ABN , First Publish Date - 2022-08-20T05:30:00+05:30 IST

‘‘పొన్నియిన్‌ సెల్వన్‌’ లాంటి గొప్ప చిత్రాన్ని రూపొందించినందుకు ఆనందంగా ఉంది.

పులి జెండా నీడలో పోరాడు

‘‘పొన్నియిన్‌ సెల్వన్‌’ లాంటి గొప్ప చిత్రాన్ని రూపొందించినందుకు ఆనందంగా ఉంది. నా బిడ్డ లాంటి ఈ చిత్రాన్ని చూసుకోవాల్సిన బాధ్యత ఇక దిల్‌రాజుదే’’ అని దర్శకుడు మణిరత్నం అన్నారు. ఆయన దర్శకత్వం వహించిన పాన్‌ ఇండియా చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వన్‌-1’.  విక్రమ్‌, కార్తి, జయం రవి...ఐశ్వర్యారాయ్‌ బచ్చన్‌, త్రిష ప్రధాన తారాగణం. లైకా ప్రొడక్షన్స్‌, మద్రాస్‌ టాకీ స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చోళరాజ్యం నేపథ్యంలో సాగే కాల్పనిక గాథతో రెండు భాగాలుగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. తొలిభాగం సెప్టెంబరు 30న విడుదలవుతోంది. ఈ చిత్రం నుంచి ‘కడకడకడవరకూ ఎగురుతది రెపరెపరెపమనుచూ’ అంటూ సమరోత్సాహాన్ని వర్ణిస్తూ సాగే లిరికల్‌ వీడియో గీతాన్ని శుక్రవారం హైదరాబాద్‌లో చిత్రబృందం విడుదల చేసింది. ఈ గీతానికి అనంత శ్రీరామ్‌ సాహిత్యం అందించగా ఎ. ఆర్‌. రెహమాన్‌ స్వరకల్పన చేశారు. మనో, అనురాగ్‌ కులకర్ణి ఆలపించారు.  ఈ సందర్భంగా మణిరత్నం మాట్లాడుతూ ‘ఇలాంటి చిత్రాలను మనం తీయగలం అనే ధైర్యాన్ని ఇచ్చిన రాజమౌళికి ధన్యవాదాలు. అలాగే చిరంజీవికి థాంక్స్‌. ఆయనకు ఇప్పుడు ఎందుకు థాంక్స్‌ చె ప్పానో మున్ముందు మీకే తెలుస్తుంది’ అని స్పందించారు. దిల్‌రాజు మాట్లాడుతూ ‘‘అమృత’ అనే సినిమా వల్ల నేను నిర్మాతగా మారాను. మళ్లీ ఇప్పుడు ఈ సినిమా రిలీజ్‌ చేసే అవకాశం మణిరత్నం గారు ఇచ్చారు’ అన్నారు. 

సుహాసిని మాట్లాడుతూ ‘నేను ఆయన్ను (మణిరత్నం) ఇష్టపడ్డాను. ఆయన ఈ సినిమాను ఇష్టపడ్డారు. ప్రేక్షకులూ ఈ చిత్రాన్ని ఇష్టపడాలి’ అని కోరారు. మణిరత్నం గారితో పనిచేయడం అంటే మన కల నెరవేరడం లాంటిది అని విక్రమ్‌ చెప్పారు. మణిరత్నం దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన నేను ఇప్పుడు ఆయన చిత్రంలో ఓ మంచి పాత్ర చేశానని కార్తి ఆనందం వ్యక్తం చేశారు. మా హృదయాలను తాకిన సినిమా ఇది, చరిత్ర సృష్టించబోతోంది అని నాజర్‌ చెప్పారు. ప్రకా్‌షరాజ్‌ మాట్లాడుతూ ‘ఈ కథను సినిమాగా తీయాలని చాలామంది అనుకున్నా మణిరత్నం వల్ల అయింది. పలు భాషలకు చెందిన గొప్ప నటీనటులు కలసి నటించిన చిత్ర మిది’ అన్నారు. ఈ చిత్రంలో భాగమైనందుకు తనికెళ్ల భరణి సంతోషం వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-08-20T05:30:00+05:30 IST