Krishnam Raju Demise: రెబల్ స్టార్ కన్నుమూత.. రాజకీయ, సినీ ప్రముఖుల నివాళి

ABN , First Publish Date - 2022-09-11T15:38:03+05:30 IST

టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు 83 ఏళ్ల వయస్సులో తుది శ్వాస విడిచారు. ఆదివారం తెల్లవారుజామున 3.25 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది...

Krishnam Raju Demise: రెబల్ స్టార్ కన్నుమూత.. రాజకీయ, సినీ ప్రముఖుల నివాళి

టాలీవుడ్ రెబల్ స్టార్  కృష్ణంరాజు 83 ఏళ్ల వయస్సులో తుది శ్వాస విడిచారు. ఆదివారం తెల్లవారుజామున 3.25 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రి(AIG Hospital)లో చికిత్సపొందుతూ మరణించారు. దీంతో పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఆయనకు నివాళి అర్పించారు. 


తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ‘హీరోగా, విలన్‌గా ఏ పాత్ర చేసిన తనదైన శైలిలో నటించిన విలక్షణ నటుడిగా పేరుపొందిన కృష్ణం రాజు మరణం టాలీవుడ్‌కి తీరని లోటు’ అని అన్నారు. అలాగే.. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సైతం కృష్ణంరాజుకి నివాళి అర్పిస్తూ ట్వీట్ చేశారు. అందులో.. ‘తెలుగు సినీ ప్రముఖులలో ఒకరైన రెబల్ స్టార్ శ్రీ కృష్ణంరాజు గారి మరణవార్త తెలిసి చాలా బాధపడ్డాను. ప్రభాస్ గారికి, ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు నా హృదయపూర్వక సానుభూతి. మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా కృష్ణంరాజు గారూ’ అని రాసుకొచ్చారు.


అలాగే.. టాలీవుడ్ యువ నటుడు విష్ణు సైతం.. ‘హృదయం ముక్కలైంది. మన కుటుంబం కృష్ణంరాజులాంటి ఇంటి పెద్దని కోల్పోయింది. ఆయన ఓ లెజెండ్’ అని ట్వీట్ చేశారు. అలాగే నటుడు నిఖిల్ సిద్ధార్థ్ సైతం ‘కృష్ణంరాజు లాంటి ఓ లెజెండ్ మనల్ని వదిలి వెళ్లిపోయాడు. మంచి మనస్సున్న వ్యక్తి. మీ ఆత్మకు శాంతి చేకూరాలి సర్. మేము ఎప్పటికీ మిమ్మల్ని, మీ మోటివేషన్‌ని మిస్ అవుతాం’ అని రాసుకొచ్చారు.


అలాగే.. డైరెక్టర్ మారుతి సైతం.. ‘లెజెండరీ యాక్టర్ రెబల్ స్టార్ కృష్ణంరాజు గారు ఇక లేరనే విషాద వార్త తెలిసి షాక్ అయ్యాను.ప్రభాస్ గారికి, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. రెస్ట్ ఇన్ పీస్ కృష్ణంరాజు సర్. మీరు ఎప్పటికీ మా గుండెల్లోనే ఉంటారు’ అని రాసుకొచ్చారు. అంతేకాకుండా.. మంచు మనోజ్, మరికొందరూ సినీ ప్రముఖులు సైతం కృష్ణంరాజు మరణానికి సానుభూతి వ్యక్తం చేశారు.











Updated Date - 2022-09-11T15:38:03+05:30 IST