ఫ్రీగా చూపిస్తా అన్నావుగా.. పవన్ కల్యాణ్‌పై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-02-26T00:40:11+05:30 IST

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, ‘భీమ్లా నాయక్’ చిత్రంపై ఏపీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘సినిమాని ఫ్రీగా చూపిస్తానని ప్రగల్భాలు పలికాడు కదా.. మరి ఈ బ్లాక్ మార్కెట్ బతుకెందుకు?’ అంటూ

ఫ్రీగా చూపిస్తా అన్నావుగా.. పవన్ కల్యాణ్‌పై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, ‘భీమ్లా నాయక్’ చిత్రంపై ఏపీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘సినిమాని ఫ్రీగా చూపిస్తానని ప్రగల్భాలు పలికాడు కదా.. మరి ఈ బ్లాక్ మార్కెట్ బతుకెందుకు?’ అంటూ ఆయన ప్రశ్నించారు. నేడు(శుక్రవారం) విడుదలైన ‘భీమ్లా నాయక్’ చిత్రంపై ఏపీ ప్రభుత్వం కక్ష కట్టిందనేలా వార్తలు వస్తున్న నేపథ్యంలో వివరణ ఇచ్చేందుకు తాజాగా ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన పవన్ కల్యాణ్‌‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. 


ఆయన మాట్లాడుతూ.. 

‘‘లైసెన్సింగ్ అథారిటీ అయినటువంటి జాయింట్ కలెక్టర్ల దగ్గరకి వెళ్లి, రేట్లు ఫిక్స్ చేసుకుని, థియేటర్ ఎంట్రీ రేట్లను ఫిక్స్ చేసుకుని సినిమాని ఆడించండి అని హైకోర్టు తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పు అంటే లెక్కలేదు, ప్రభుత్వం అంటే లెక్కలేదు. జీవోలంటే లెక్కలేదు, వ్యవస్థ అంటే లెక్కలేదు. ఇవన్నీ గాడి తప్పటానికి చంద్రబాబు కారణం కాదా? 


ఇక మైక్ పట్టుకుంటే చాలు నీతులు చెప్పే ఒక హీరోగారిని చూస్తున్నాం. మరి ఈ నీతిమాలిన పనులేంటి? బ్లాక్ మార్కెటింగ్‌ని కూడా రాజకీయ పార్టీలు ప్రోత్సహిస్తున్నాయి. భారతదేశంలో ఎక్కడా ఇటువంటి దిక్కుమాలిన స్థితులను చూడలేదు. బ్లాక్ మార్కెటింగ్‌కి భజన చేస్తున్న దిక్కుమాలిన వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనబడుతుంది. బ్లాక్‌లో టికెట్లు అమ్మితే తప్పు అని చెప్పాల్సిన వాళ్లు.. దానిని ఒప్పు కింద చూపిస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన జీవోని నిలుపుదల చేసి, జాయింట్ కలెక్టర్ల దగ్గర రేట్లను నిర్ణయించుకుని అనుమతి తెచ్చుకోమని కోర్టు చెబితే.. మీరెందుకు చేయరు? అసలు మేము ఎవరికీ లెటర్ రాసే పనిలేదు, ప్రభుత్వం మా దగ్గరకి రాకూడదు. మా ఇష్టారాజ్యం అన్నట్లుగా వెళుతున్నారు. 


పవన్ కల్యాణ్‌గారి సినిమా అంట. దానిని తొక్కేస్తున్నారట. అసలు సినిమాని తొక్కడం ఏమిటో నాకు అర్థం కాలేదు. స్నేహితుడు అని చెబుతున్నారు.. స్నేహితుడో కాదు నాకు తెలియదు కానీ.. ఆయన(గౌతమ్ రెడ్డి) మృతి చెందాడని సినిమా వేడుకని ఒక రోజు వాయిదా వేసుకున్నవారు.. ఇంకో రెండు, మూడు రోజులు సినిమాని వాయిదా వేసుకోలేరా? వాయిదా వేసుకోకుండా మీరు సినిమా రిలీజ్ చేసుకున్నప్పుడు.. ప్రస్తుతం ఉన్న రేట్లే పరిగణనలోకి వస్తాయి. అంతేందుకు, పగలదీస్తామని చెప్పి.. సినిమాని ఫ్రీగా చూపిస్తామని చెప్పారు కదా. ఫ్రీ గా చూపించకుండా బ్లాక్‌లో అమ్ముకునే బతుకెందుకు?’’ అని పేర్ని నాని ఈ సమావేశంలో మాట్లాడారు.

Updated Date - 2022-02-26T00:40:11+05:30 IST